ఫ్యామిలీ ఫ్యామిలీ జీన్స్‌లోనే...

ఫ్యామిలీ ఫ్యామిలీ జీన్స్‌లోనే...


‘‘అదిరేటి డ్రెస్‌ మేవేస్తే.. బెదిరేటి లుక్కు మీరేస్తే... దడ’ అనే ‘భారతీయుడు’ సినిమాలోని సాంగ్‌ గుర్తుందా..? నేటి ట్రెండ్‌కి ఆ సాంగ్‌ సరిగ్గా సూటైపోతుంది కదూ..! వేసిన డ్రెస్‌ అదిరిపోయేలా ఉంటే... చూసేవాళ్ల చూపులు బెదరక ఏంచేస్తాయి.? మోడల్‌ అంటే జీన్స్‌.. జీన్స్‌ అంటే మోడల్‌ అన్నట్లుగా సాగిపోతోంది నేటి యువత. ‘నీట్‌గా, టైట్‌గా.. నాలుగు గొలుసులు వేలాడేసుకుని... రెండు చిరుగులు ఉన్న జీన్స్‌ వేసుకుంటే ఆ లుక్కే వేరు బాసూ! అంటున్నారు ట్రెండ్‌ సెటర్స్‌. నిజమే ఆ లుక్కే వేరు.



ఒక్క జీన్స్‌తో పోష్‌ లుక్‌. పాపులర్‌ లుక్‌ రెండూ వచ్చేస్తాయి. అమ్మాయికైనా, అబ్బాయికైనా అతికినట్లు సూటయ్యే జీన్స్‌కు ప్రపంచ వ్యాప్తంగా చాలా క్రేజ్‌ ఉన్న విషయం తెలిసిందే. అందుకే కొందరు ఫ్యాషన్‌ ట్రెండాభిమానులు ఫ్యామిలీ ఫ్యామిలీనే జీన్స్‌లో తళుకుమంటున్నారు. ట్రెండ్‌ ఫాలోవర్స్‌ మనసుని ఇంతగా దోచుకున్న జీన్స్‌కు కూడా ఓ రోజుందని మీకు తెలుసా? దాని వెనుకు ఉన్న కథా కమామీషు తెలుసుకుందామా?



సేఫ్టీ జీన్స్‌

అమ్మాయిలు జీన్స్‌ వేస్తే... ఆడిపోసుకునే ఛాందసులకు, అహంభావులకు ఇప్పుడు చెప్పబోయే విషయం మింగుడు పడకపోవచ్చు. కానీ, ఇది నిజం. అసలు డెనిమ్‌(జీన్స్‌) డే ఎందుకు వచ్చిందంటే... రోమ్‌లో 1992లో జరిగిన ఓ అత్యాచార ఆరోపణ కేసులో అమ్మాయి ధరించిన టైట్‌ జీన్స్‌ కారణంగానే ఆమె రక్షించబడిందని తేలింది. దీంతో అమ్మాయిలంతా తమను తాము రక్షించుకోవడానికి టైట్‌ జీన్స్‌లనే వాడేవారు. అలా ఏప్రిల్‌ 26 జీన్స్‌ డేగా ప్రపంచదేశాల అమ్మాయిలు ఎంతో అనందంగా సెలబ్రేట్‌ చేసుకుంటారు. రక్షణ కోసం రూపొందిన టైట్‌ జీన్స్‌ రానురానూ రంగులద్దుకుని లేటెస్ట్‌ ట్రెండ్‌ను సృష్టిస్తోంది.



కంఫర్ట్‌ కాస్తా కామన్‌గా...

ఇక జీన్స్‌ కథను తిరగేస్తే... 16 శాతబ్దంలో ఫ్రాన్స్, ఇటలీ దేశాల్లో నావికులు తమ పనులకు అనువైన డ్రెస్‌గా జీన్స్‌ను ఎంచుకునేవారట. తరువాత 1873 సమయంలో నెవాడాలోని జాకబ్‌ డేవిస్‌ అనే ఓ దర్జీ.. లెవీ స్ట్రాస్‌ అనే వ్యాపారితో కలిసి డెనిమ్‌ జీన్స్‌ను మార్కెట్‌లోకి విరివిగా తెచ్చాడు. దాంతో అప్పటి పిల్లలు, రైతులు, మెకానిక్స్‌ అంతా జీన్స్‌ వేసుకోవడానికే ఎక్కువ మక్కువ చూపేవారు. కాలక్రమేణా రంగులు, మెరుపులు, పూసలు, లేసులు కలుపుకొని మోడల్‌ ట్రెండ్‌లో జీన్స్‌ ఓ వెలుగు వెలుగుతోంది. కేవలం ప్యాంట్‌ మాత్రమే కాకుండా అదే క్లాత్‌తో టాప్స్, కోట్స్‌ కూడా మార్కెట్‌లో హల్‌ చల్‌ చేస్తున్నాయి.



జిల్‌ జిల్‌ మెగ జీన్‌

 ప్రతీ ఏటా 45 కోట్ల జీన్స్‌ అమెరికా నుంచి ప్రపంచానికి ఎగుమతి అవుతున్నాయి. 50 శాతం జీన్స్‌ ప్రత్యేకంగా చైనా, ఇండియా, బంగ్లాదేశ్‌ల కోసమే తయారవు తున్నాయి. సుమారు 80 కిలోల పత్తితో 225 జతల జీన్స్‌ తయారు చేయవచ్చు. నిజానికి రెండవ ప్రపంచ యుద్ధంలో అమెరికా సైనికులు ‘బ్లూ కలర్‌ జీన్స్‌’నే వేసుకునే యుద్ధం చేశారు. ఆ సమయంలోనే తొలిసారిగా మిగిలిన ప్రపంచానికి బ్లూ కలర్‌ జీన్స్‌ పరిచయమైంది.



లెగ్గింగ్స్‌ దెబ్బతగిలి...

జీన్స్‌కు యూత్‌లో ఎంత క్రేజ్‌ ఉన్నా.. పోటీ మాత్రం తప్పలేదు. ట్రెండ్‌కు తగ్గట్టుగా యువత మనసును దోచుకున్న లెగ్గింగ్స్‌ జీన్స్‌ను కాస్త వెనక్కి తోశాయనే చెప్పాలి. విపరీతంగా జీన్స్‌ వాడే అమ్మాయిలు... రూట్‌ మార్చి లెగ్గింగ్స్‌ కొనుగోళ్లపై ఆసక్తి చూపడంతో 2013–14 సమయంలో జీన్స్‌ క్రేజ్‌ కొంత తగ్గింది. ఇదంతా ఫ్యాషన్‌ ట్రెండ్‌లో జీన్స్‌కు తాత్కాలిక విరామం మాత్రమే. కొత్త హంగులతో జీన్స్‌ మళ్లీ పుంజుకుని సత్తా చాటుకుంటున్నాయి.

Read latest Funday News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top