అన్నిటికీ కన్‌ఫ్యూజ్ అవుతాడు... ఎందుకని?

అన్నిటికీ కన్‌ఫ్యూజ్ అవుతాడు... ఎందుకని?

మా బాబు నాలుగో తరగతి చదువుతున్నాడు. వాడు స్వతహాగా మంచి పిల్లాడు. కానీ మొన్న దసరా సెలవులు ముగిసి, మళ్లీ బడికి వెళ్లినప్పట్నుంచీ తన ప్రవర్తన మారిపోయింది. చదవడం లేదు. ఎంతసేపూ టీవీ చూస్తుంటాడు. ఆపమంటే ఆపడు. మేం ఆపేస్తే ఏడుస్తున్నాడు. గట్టిగట్టిగా అరిచేస్తున్నాడు. హోమ్‌వర్క్ గురించి అడిగినా చెప్పడం లేదు. స్కూల్లో ఏం చెప్పారు అంటే నీకెందుకు అని ఎదురు ప్రశ్నిస్తున్నాడు. ఉన్నట్టుండి ఎందుకిలా మారిపోయాడు? నేనేమో వర్కింగ్ ఉమన్‌ని. వాడితో ఎక్కువ సమయం గడపలేను. అందుకే వాడి గురించి దిగులుగా ఉంది. ఇప్పుడు నేనేం చేయాలి?

 - అనుశ్రీ, హైదరాబాద్

 దసరా సెలవుల్లో ఏదైనా సంఘటన జరిగి, బాబు డిస్టర్బ్ అయ్యాడేమో ఆలోచించండి. అలాంటిదేమీ లేకపోతే టెన్షన్ పడక్కర్లేదు. ఒక్కోసారి సెలవుల్లో తీరికగా, సరదాగా ఉండటం అలవాటయ్యి... మళ్లీ స్కూలుకు వెళ్లడం, చదవడం, హోమ్‌వర్క్ చేయడం ఇబ్బందిగా, అయిష్టంగా అనిపించవచ్చు. అయితే దాన్ని మొగ్గలోనే తుంచేయడం ఉత్తమం. హోమ్‌వర్క్ చేస్తేనే టీవీ చూడనిస్తానని, ఆడుకోనిస్తానని తనతో కచ్చితంగా చెప్పండి. ఏడ్చినా సరే తప్పకుండా దీన్ని అమలు చేయండి. కొన్నాళ్లు మీరు బలవంతాన అయినా చేయిస్తే, మెల్లగా తనకే అలవాటై పోతుంది. ఒకసారి స్కూల్లో టీచర్లతో, ఫ్రెండ్స్‌తో మాట్లాడి తనకేదైనా ఇబ్బంది ఉందేమో కనుక్కోండి. అలాంటిదేమీ లేకపోతే నేను చెప్పిన పద్ధతి పాటిస్తే సరిపోతుంది. 

 

  మా పాప నాలుగో తరగతి చదువుతోంది. బాగా చదువుతుంది. కానీ ఎందుకో తెలీదు... తను అబ్బాయిలెవరితోనూ మాట్లాడదు. బంధువులు, క్లాస్‌మేట్స్, చుట్టుపక్కలవాళ్లు... ఎవరైనా సరే, మగపిల్లలను చూస్తే దూరంగా వెళ్లిపోతుంది. వాళ్ల నాన్న తప్ప మరెవరికీ చేరువగా వెళ్లదు. ఇంత చిన్న వయసులో తను అలా ఎందుకు చేస్తోందో అర్థం కావడం లేదు. అలా అని భయపడుతుందా అంటే అలానూ అనిపించడం లేదు. కారణం ఏమిటని ఎంత అడిగినా చెప్పడం లేదు. ఇదేమైనా మానసిక సమస్యా?

 - చంద్రిక, వనస్థలిపురం

 బాగా నెర్వస్‌గా ఉండే పిల్లలు ఇలా చెయ్యడానికి అవకాశం ఉంది. అది కూడా చాలా అరుదుగానే. అయితే అలా అనుకుని వదిలేయడం మంచిది కాదు. ముందు తనకి మగపిల్లలతో ఏవైనా బాధాకర అనుభవాలు ఉన్నాయేమో తెలుసుకోవడం అవసరం. స్కూల్లో కానీ, మరెక్కడయినా కానీ మగ పిల్లలతో తనకు నచ్చని అనుభవాలు ఎదురయ్యాయేమో తెలుసుకోండి. సాధారణంగా వేధింపులకు గురయ్యే ఆడపిల్లల్లో ఈ తరహా ప్రవర్తన ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. అలా అని మీ పాపకి అదే జరిగి ఉంటుందని చెప్పలేం. ఒకవేళ జరిగివుంటే మాత్రం తనని ఆ పరిస్థితి నుంచి కాపాడాల్సిన బాధ్యత మనదే. కాబట్టి ముందు తన ప్రవర్తనకి కారణం ఏమిటో తెలుసుకుని, దాన్ని పరిష్కరించే ప్రయత్నం చేయండి. మీ వల్ల కాకపోతే వెంటనే ఓ చైల్డ్ సైకాలజిస్టును సంప్రదించండి. 

 

  మా అబ్బాయి వయసు పద్నాలుగేళ్లు. వాడు ప్రతి విషయంలోనూ కన్‌ఫ్యూజ్ అవుతుంటాడు. ఏ పని చెప్పినా దాన్ని పాడు చేస్తాడు. ఏదైనా తీసుకురమ్మంటే నేలపాలు చేసేస్తాడు. ఏదైనా ప్రశ్న అడిగినా తడబడుతూ సమాధానం చెబుతాడు. చివరికి ఏం తింటావ్, నీకేం ఇష్టం అన్నా ఠక్కున జవాబివ్వడు. అలా అని చదువులో అలా ఉండదు. చదివినవన్నీ చక్కగా గుర్తు పెట్టుకుని పరీక్షల్లో రాస్తాడు. ఫస్ట్ ర్యాంక్ వస్తాడు. మరి మిగతా విషయాల్లో ఎందుకంత కన్‌ఫ్యూజ్ అయిపోతాడో అర్థం కావడం లేదు. ఇదేమైనా మానసిక సమస్యా?

 - నళిని, హనుమాన్ జంక్షన్

 బాబు కన్‌ఫ్యూజ్ అవుతున్నాడా లేక టెన్షన్ పడుతున్నాడా గమనించండి. పిల్లలే కాదు, కొంతమంది  పెద్దవాళ్లు కూడా త్వరగా భయపడటం, కంగారు పడటం జరుగుతూ ఉంటుంది. మార్కులు బాగా వస్తాయంటున్నారు కాబట్టి తెలివైనవాడే. ఈ కన్‌ఫ్యూజన్‌కి ఎక్కువగా టెన్షన్ పడటం కారణం కావొచ్చు. భయపడే మనస్తత్వం అయితే... ఏ పని చెయ్యాలన్నా, ఇతరులతో మాట్లాడాలన్నా కంగారు పడి పోతారు. తద్వారా పనుల్లో తప్పులు దొర్లుతూ ఉంటాయి. కాబట్టి బాబు భయపడుతున్నాడా, టెన్షన్ పడుతున్నాడా అన్నది గమనించండి. భయపడుతుంటే కనుక తన భయం ఏమిటో కనుక్కోండి. ఎందుకు టెన్షన్ పడుతున్నాడో తెలుసు కోండి. నువ్వు చేయగలవు అంటూ ప్రోత్స హించండి. తనమీద తనకు నమ్మకం పెరిగేలా మాట్లాడండి. దానివల్ల తనలో కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. ఎప్పుడైతే తనమీద తనకు నమ్మకం పెరుగుతుందో, కంగారు తగ్గుతుంది. ఏ పనినైనా చక్కగా చేయగలుగుతాడు.                         
Read latest Funday News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Tags: 



 

Read also in:
Back to Top