నాగేశ్వర జ్యోతిర్లింగం నమో నమామి!

నాగేశ్వర జ్యోతిర్లింగం నమో నమామి! - Sakshi

 ద్వాదశ జ్యోతిర్లింగాలలో నాగేశ్వర లింగం ఒకటి. ఇది గుజరాత్‌లోని దారుకావనంలో ఉంది. నేటి దారుకావనాన్నే పురాణాలలో కామ్యకవనం అని, ద్వైతవనమనీ పేర్కొన్నారు. దీని గురించిన గాథలు చాలా ఉన్నాయి కానీ, ముఖ్యమైనవాటిని చూద్దాం.. 

 

 పూర్వం ఒక సముద్రతీరాన గల ఒక వనంలో దారుకుడనే రాక్షసుడుండేవాడు. వాడి భార్య దారుకి. వాళ్లు తపశ్శక్తి సంపన్నులు. వారికి బోలెడంత మంది సంతానం, మహాదుష్టులు, బలవంతులైన అనుచరగణం ఉన్నారు. వారి అండ చూసుకుని ఆ వనంలో ఉన్నవారినే కాదు, అటుగుండా వచ్చీపోయేవాళ్లని కూడా వదలిపెట్టకుండా హింసించనారంభించారు. దాంతో బాటసారులందరూ కలసి ఔర్వుడు అనే మహాముని పాదాలు పట్టుకుని, తమకు ఆ రాక్షస దంపతుల పీడ వదిలించమని ప్రాధేయపడ్డారు. అప్పుడు ఔర్వముని, ఆ రాక్షసులెవరైనా భూమిమీద ఉంటే, వారిలో హింసాప్రవృత్తి ఉంటే, వారు ఇక ప్రాణాలు కోల్పోవలసిందేనని శాపం పెట్టాడు. దాంతో దారుకుడు సముద్రంలోకి వెళ్లి, అక్కడ ఒక నగరాన్ని నిర్మించుకుని, అందులో ఉంటూ, సముద్ర ప్రయాణీకులను హింసించ డమే ప్రవృత్తిగా పెట్టుకున్నాడు. 

 

 ఒకసారి వాడలా సుప్రియుడనే వర్తకుడిని, అతని బంధుమిత్రులను పట్టి బంధించి, వారిని సముద్రం అడుగున గల తన నగరంలో ఒక చెరసాలలో బంధించాడు. ఈ చెరసాలకు అసంఖ్యాకమైన జలసర్పాలు, రాక్షసులు కాపలా కాస్తూ ఉంటారు. సుప్రియుడు మహాశివభక్తుడు కావడంతో చెరసాలలోని మట్టినంతటినీ ఒకచోట చేర్చి, దానిలో కాసిని నీళ్లుపోసి, ఆ మట్టితోనే ఒక శివలింగాన్ని తయారు చేసుకుని, శివుణ్ణి పూజించనారంభించాడు. సుప్రియుని సలహామేరకు అతనితో కలసి ఉన్నవారందరూ కూడా మహా పవిత్రమైన, అత్యంత శక్తిమంతమైన శివపంచాక్షరీ మంత్రాన్ని తదేక దీక్షతో జపించసాగారు. అప్పుడు ఆ రాక్షసుడి అనుచరులు సుప్రియుడి వద్దకు వచ్చి, ‘‘నీవు శివారాధన చేయరాదు. చేస్తే, మా రాజు, రాణి అయిన దారుకా దారుకిల ఆరాధన మాత్రమే చేయాలి. తక్షణం నీ శివపూజ మానకుంటే నిన్ను చంపేస్తాం’’ అని బెదిరించారు. 

 

 సుప్రియుడు అందుకు లొంగకపోవడంతో దారుకుణ్ణి పిలుచుకు వచ్చారు. దారుకుడు సుప్రియుడి భుజం మీద కత్తిపెట్టి, బెదిరించాడు. అయినా వినలేదు. ఇలా లాభం లేదని, కంఠాన్ని ఖండించబోయాడు. అప్పుడు ఆ పార్థివలింగం నుంచి శివుడు ప్రత్యక్షమై, ఆ రాక్షసుని తన త్రిశూలంతో ఒక్క దెబ్బకొట్టి, దుష్టులైన వాడి అనుచరగణాన్ని భస్మం చేశాడు. సుప్రియుని ప్రార్థన మేరకు అక్కడే జ్యోతిర్లింగరూపంలో కొలువయ్యాడు. అన్ని కథల్లా ఈ కథ ఇంతటితో ముగియలేదు. ఎందుకంటే ఆ రాక్షసుడి భార్య దారుకి పార్వతీదేవికి ప్రియభక్తురాలు కావడంతో తనకు లభించిన కొన్ని శక్తుల వల్ల తన అనుచరుల సాయంతో ఆ అడవినంతటి నీ తీసుకుపోయి సముద్రం అడుగుకు చేర్చింది.దాంతోపాటు ఆ వనంలోకి అడుగుపెట్టిన వారినందరినీ తమ అధీనంలోకి తీసుకుని, వారిని బలవంతంగా తమ రాజ్యప్రజలుగా మార్చసాగింది.

 

  శివపూజ చేస్తున్న సుప్రియుణ్ణి పూజమానవలసిందిగా నిర్బంధిస్తూ, ఆమె, ఆ రాక్షసగణం సుప్రియుని చిత్రహింసల పాలు చేయడం మొదలు పెట్టారు. మరల శివుడు ప్రత్యక్షమై, సుప్రియుడికి ఒక శక్తిమంతమైన ఆయుధాన్నిచ్చాడు. ఆ ఆయుధంతో సుప్రియుడు వారందరినీ జయించాడు. ఈసారి పరమేశ్వరుడు ఆ జ్యోతిర్లింగంలోనికి తన శక్తులను ప్రవేశపెట్టి, వారందరినీ ఏ దుష్టశక్తులూ ఏమీ చేయకుండా వారికి రక్షణగా అక్కడే కొలువుతీరాడు. పార్వతీదేవి అక్కడ నాగేశ్వరిగా కొలువుతీరి, భక్తులను అనుగ్రహించడం ఆరంభించింది. ఆ రాక్షసగణాన్ని అక్కడినుంచి దూరంగా పంపించి, వారు జనావాసాలలోకి రాకుండా చేసింది జగన్మాత. సుప్రియుడు రూపొందించిన ఆ లింగమే నాగేశ్వర జ్యోతిర్లింగం. నాగేశ్వరుడిగా తనను కొలిచిన వారికి తాను సరైన మార్గాన్ని చూపుతానని, మోక్షాన్నిస్తానని, భక్తి, వైరాగ్య జ్ఞానాలను అనుగ్రహిస్తానని శివుడు సుప్రియుడికి వాగ్దానం చేశాడు. ఈమేరకు శివపార్వతులు నాగేశ్వరుడు, నాగేశ్వరిగా భక్తులను అనుగ్రహిస్తున్నారు. 

 

 అతి ప్రాచీన గాథ: 

 పూర్వం వాలఖిల్యులనే మునులు దారుకావనంలో శివుని గురించి సుదీర్ఘకాలంపాటు ఘోర తపస్సు చేశారు. అయినప్పటికీ శివుడు వారి భక్తిని, సహనాన్ని మరిన్ని పరీక్షలకు గురి చేయాలనుకున్నాడు. దాంతో ఒక యువసన్యాసి రూపంలో వారి ముందు ప్రత్యక్షమయ్యాడు. ఆ యువసన్యాసి వంటిమీద నాగులు తప్ప వేరే వస్త్రాలు కానీ, ఆభరణాలు కానీ లేవు. అత్యంత సుందరాకారంలో ఉన్న ఆ యువసన్యాసిని చూసి, మునిపత్నులు మనసు పారేసుకుని, భర్తలను వదిలేసి, ఆ దివ్యసుందరాకారుడి వెంట పరుగులు తీశారు. దాంతో సహనం చచ్చిపోయి, కోపం కట్టలు తెచ్చుకుంది ఆ మునులలో. ఆ యువసన్యాసి లింగం తెగిపోవాలని శపించారు. ఇంకేముంది, శివుడి లింగం కాస్తా జారి భూమి మీద పడింది. దాంతో లోకాలన్నీ కంపించిపోయాయి. బ్రహ్మ, విష్ణులు భూమి మీదకు వచ్చి, ఆ మునుల తప్పిదాన్ని మన్నించి, లింగాన్ని వెనక్కు తీసుకుని, లోకాలను కాపాడమని శివుని ప్రార్థించారు. శివుడు శాంతించి, భూమి మీద పడిన ఆ లింగంలో జ్యోతిర్లింగాకారంలో కొలువుదీరి, మునులను అనుగ్రహించాడు. వంటిమీద పాములనే వస్త్రాలుగా చుట్టబెట్టుకుని వచ్చాడు కాబట్టి, నాగేశ్వరుడిగా పూజలందుకుంటున్నాడు శివుడు. పతి వెంటే సతి అన్నట్లుగా... పార్వతీదేవి నాగేశ్వరిగా పక్కనే కొలువుదీరింది. 

 

 మరోగాథ: 

 తన ప్రియపత్ని అయిన సతీదేవి యోగాగ్నిలో దగ్ధం కావడంతో సతీవియోగాన్ని తట్టుకోలేక ఓ నదీతీరానికొచ్చి తాను కూడా దహించుకుపోయాడు. ఆ భస్మరాశి ఆ నదిలో కలిసిపోయింది. కొంతకాలానికి పాండవులు ఆ నది ఒడ్డున విశ్రాంతి తీసుకుంటుండగా, కొన్ని ఆవులు వచ్చి నదిలో స్నానానికి దిగగానే వాటి పొదుగులు పాలతో నిండిపోయి, ఆ నదీజలాలు వాటి పాలధారలతో తెల్లబడిపోసాగాయి. ఈ వింతను చూసి ఆశ్చర్యపోతున్న భీమార్జునులతో ధర్మరాజు, బహుశా ఈ నదిలో ఏదో మహిమ ఉండి ఉంటుంది. నదిలో దేవతలో, తపస్సులో ఉండి ఉండవచ్చు అని అన్నాడు. భీముడు నదీజలాలను తోడేసే ప్రయత్నం చేసి, సాధ్యం కాకపోవడంతో కోపంతో నదిమీద తన గదతో మోదాడు. ఆ దెబ్బకు నది రెండుగా చీలి పోయింది. నది మధ్యభాగంలో భీముడు తన గదతో మోదిన చోట రక్తపుచారికలు కనిపించాయి. నీళ్లు వేడెక్కిపోయి, నీటి అడుగున  నాగేశ్వరుడి ఆకారంలో ఉన్న శివలింగం బయటపడింది. పాండవులు అక్కడ గుడిని నిర్మించారు. దారుకలు అంటే దేవదారు వృక్షాలు. ఇక్కడ దేవదారు వృక్షాలు విరివిగా ఉండటం వల్ల దారుకావనమనే పేరు వచ్చింది. ఈ వనంలో 20 మీటర్ల ఎత్తున్న శివుని విగ్రహం చూపరులను కన్నులు తిప్పుకోనివ్వదు. ఆలయం  సుందరంగా ఉంటుంది.

 - డి.వి.ఆర్.భాస్కర్ 

 
Read latest Funday News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top