పేదోడి దేవాలయం

పేదోడి దేవాలయం


ఆదర్శం

ఇండియా-బంగ్లాదేశ్ సరిహద్దుల్లో ఉండే  మారుమూల ప్రాంతం బరక్ (అస్సాం). ఎన్నో సంవత్సరాలుగా కనీస వైద్యానికి నోచుకోని ప్రాంతం. ఇక క్యాన్సర్‌లాంటి వ్యాధులొస్తే ఏ ఆశకూ వీలు చిక్కని దీనపరిస్థితి. మంచి వైద్యం అందాలంటే... 350 కిలోమీటర్ల దూరంలో ఉన్న గౌహతికి వెళ్లాల్సిందే. దూర భారం, వ్యయ భారంతో... పేదలకు ఆరోగ్యం అనేది అందని పండులా తయారైంది. ఎవరో వస్తారని ఆశ.

 

ఎవరూ రారు అనే నిరాశ.

ఈ చీకట్లో ఒక కాంతిరేఖ... కాచర్ క్యాన్సర్ హాస్పిటల్. ఎన్నో అవరోధాలను, అడ్డంకులను తట్టుకొని, సడలని లక్ష్యంతో రూపుదిద్దుకున్న పేదోళ్ల హాస్పిటల్ ఇది. పొగాకు ఎక్కువగా ఉపయోగించే ఈ ప్రాంతంలో క్యాన్సర్ బాధితులు ఎక్కువగా ఉంటారు. చెన్నై నుంచి అంకాలజిస్ట్ డా.రవి కణ్ణన్ ఇక్కడికి రావడంతో ‘కాచర్ క్యాన్సర్ హాస్పిటల్’ స్థాయి అంచెలంచెలుగా పెరిగి, పేదలకు నాణ్యమైన వైద్యాన్ని అందిస్తుంది.

 

కొన్ని సంవత్సరాల క్రితం...

‘‘అస్సాంలో మారుమూల ప్రాంతంలో ఉన్న క్యాన్సర్ హాస్పిటల్‌లో పని చేయాలనుకుంటున్నాను’’ అని రవి అన్నప్పుడు ఆయన భార్య ఆశ్చర్యానికి గురయ్యారు. భర్తతో విభేదించారు. అయితే అస్సాంకు వచ్చిన తరువాత ఆమె అభిప్రాయంలో మార్పు వచ్చింది.

 

‘‘ఇక్కడ చేయాల్సింది ఎంతో ఉంది’’ అన్నారు ఆమె. తొలి విజయం సాధించారు రవి.

 చెన్నైలోని ‘అడయార్ క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్’లో ప్రముఖ అంకాలజిస్ట్ ఆయన.

 డాక్టర్‌ను వెదుకుతూ పేషెంట్ వెళ్లడం కాదు... పేషెంట్‌ను వెదుకుతూ డాక్టర్ వెళ్లాలనే సిద్ధాంతాన్ని నిజాయతీగా నమ్మారు.

 

తన నిస్వార్థ సేవతో... క్యాన్సర్ హాస్పిటల్‌ను ఉన్నత స్థాయికి తీసుకెళ్లారు రవి కణ్ణన్. ఒకప్పుడు 25 పడకల సామర్థ్యం కలిగిన ఆస్పత్రి ఇప్పుడు 100 పడకలకు చేరుకుంది. ఒకప్పుడు హాస్పిటల్‌లో 6 మంది నర్స్‌లు మాత్రమే ఉండేవారు. ఇప్పుడు 102 మంది ఉన్నారు.

 

ప్రతి సంవత్సరం వందలాది పేద క్యాన్సర్ పేషెంట్లకు ఉచిత, అత్యధిక సబ్సిడీతో కూడిన ట్రీట్‌మెంట్‌ను అందిస్తుంది కాచర్ క్యాన్సర్  హాస్పిటల్. చాలా మంది పేద షేషెంట్లు ప్రాథమిక చెకప్‌ల తరువాత రెండోసారి వచ్చేవారు కాదు. చికిత్సకు అవసరమైన డబ్బు వారి దగ్గర లేకపోవడమే దీనికి కారణం. పేషెంట్లలో 60 శాతం మంది నెలకు మూడు వేలు లేదా అంత కంటే తక్కువ ఆదాయం ఉన్నవాళ్లు.



వీరిలో చాలామంది వ్యవసాయ కూలీలు, టీ తోటల్లో పనిచేసే కూలీలు. దురదృష్టమేమిటంటే, ఎవరైతే క్యాన్సర్ బారిన పడ్డారో వారే కుటుంబానికి ఆధారం. దీన్ని దృష్టిలో పెట్టుకొని ‘హోమ్ విజిట్’ పేరుతో గ్రామాలకు వెళ్లి పేషెంట్లకు ట్రీట్‌మెంట్ చేస్తున్నారు కాచర్ హాస్పిటల్ వైద్యులు. ఎక్కవ దూరం ప్రయాణం చేసి హాస్పిటల్‌కు రాలేని పేషెంట్ల కోసం ‘శాటిలైట్ క్లినిక్స్’ మొదలుపెట్టారు.

 

పేషెంట్లకు ఎప్పటికప్పుడు అందుబాటులో ఉండి సలహాలు, సూచనలు ఇవ్వడానికి ఫోన్ కన్సల్టేషన్ సౌకర్యం ఉంది. హాస్పిటల్‌లో పేషెంట్లకు ఉచిత భోజన సౌకర్యం ఉంది.

 ఈ హాస్పిటల్ మరో ప్రత్యేకత... స్ట్రిక్ట్ ఫాలోఅప్ పాలసీ. అపాయింట్‌మెంట్ మిస్ అయిన పేషెంట్లకు వార్డ్ సూపర్‌వైజర్లు ఎప్పటికప్పుడు ఫోన్‌లు చేస్తారు.

 లాభాపేక్షలేని ఈ  హాస్పిటల్ ఖర్చుల సంగతి ఏమిటి?

 

వ్యక్తులు, రకరకాల స్వచ్ఛంద సంస్థల నుంచి హాస్పిటల్‌కు ఆర్థిక సహాయం అందుతుంది. బరక్ ప్రాంతం నుంచి మాత్రమే కాదు పొరుగు రాష్ట్రాలు, బంగ్లాదేశ్ నుంచి కూడా ఇప్పుడు పేషెంట్లు వస్తున్నారు.

  ఈ హాస్పిటల్‌లో పని చేసే వైద్యులు వేరే హాస్పిటల్‌లో పని చేస్తే... ఇక్కడి కంటే రెండు మూడు రెట్లు ఎక్కువ జీతం వచ్చే అవకాశం ఉంది. అయితే ఇక్కడి వైద్యులకు అది ముఖ్యం కాదు. పేద రోగులకు గట్టి వైద్యం అందించడం ముఖ్యం. వారి జీవితాన్ని నిలబెట్టడం ముఖ్యం. ఈ నిబద్ధతే కాచర్ క్యాన్సర్ హాస్పిటల్‌ను ‘వరల్డ్-క్లాస్ క్యాన్సర్ హాస్పిటల్’గా దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చింది.

Read latest Funday News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top