స్వామి సేవలో పెరుమాళ్ పల్లె

స్వామి సేవలో పెరుమాళ్ పల్లె - Sakshi


‘పెరుమాళ్’ అంటే తమిళంలో శ్రీవేంకటేశ్వర స్వామి అని అర్థం. దిగవూరుకు చెందిన వందలాది కుటుంబాలు మహంతుల కాలం నుంచి తిరుమల ఆలయంలో సేవ చేశాయి. నిరంతరం పెరుమాళ్ సేవలో తరించిన దిగవూరు గ్రామం కాలానుగుణంగా ‘పెరుమాళ్’ పల్లెగా రూపాంతరం చెందింది. తిరుపతి నుంచి చంద్రగిరి మార్గంలో10 కి .మీ. దూరంలో తిరుమల శేషాచల కొండ కింద ఈ పల్లె ఉంది.

 

 1843 నుంచి 1933 వరకు ఆలయ పాలనను ఉత్తరాదికి చెందిన హథీరాం మఠం మహంతులే పర్యవేక్షించారు. అప్పట్లో ఆయా పర్వదినాల్లో నిత్యపూజలు, ఆలయ ఆదాయపు లెక్కలు, పండుగలు ఎప్పుడు వస్తాయి, ఉత్సవాలు ఎప్పుడు నిర్వహించాలి, ఎంతమంది సేవకులు, పనివాళ్లు అవసరం... అన్న విషయాలను మఠం పాలనాధికారులే నిర్ణయించేవారు.

 

 నాటి దిగవూరు నేటి ‘పెరుమాళ్’పల్లె

  తిరుమలలో మౌలిక వసతులు ఏమీ లేనప్పటికీ మహంతుల పిలుపు మేరకు తిరుపతి, దిగవూరు లాంటి చుట్టుపక్కల గ్రామాల ప్రజలు తొలిజాములోనే కాలినడకన తిరుమలకు చేరి, ఆలయ పనుల్లో భాగస్వాములయ్యేవారు. వీరిలో దిగవూరు గ్రామస్థులే కీలకంగా మారారు.  వారితో మహంతులకు అవినాభావ సంబంధం ఏర్పడింది. వారి స్వామి సేవకు చిహ్నంగా దిగవూరును పెరుమాళ్‌పల్లెగా మార్పు చేశారు మహంతులు.

 

 మహంతులు ఏర్పడిన 1843 నుంచి  1933లో టీటీడీ ధర్మకర్తల మండలి ఏర్పడేవరకూ ఇదే పరిస్థితి కొనసాగింది. నాటి నుంచి అనేక రకాలు సేవలు చేసిన వీరు కాలక్రమంలో ఆలయ ఉద్యోగులుగా మారారు. పెరుమాళ్‌పల్లెకు కూతవేటు దూరంలోని తొండవాడకు చెందిన ఐఏఎస్ అధికారి ఎం.చంద్రమౌళిరెడ్డి 1969లో టీటీడీ ఈవోగా నియమితులయ్యారు. అప్పటి వరకు రోజువారి కూలీలుగా పనిచేసే పెరుమాళ్ వాసులకు అవగాహన కల్పించి ఉద్యోగులుగా చేరాలని సూచన చేయటంతో వారు దేవస్థానం ఉద్యోగులుగా మారారు. నాటి నుంచి నేటికీ వందల కుటుంబాలు ఆలయ ఉత్సవాలను మోసే వాహన బేరర్లు, ఇతర విభాగాల సిబ్బందిగా పనిచేస్తున్నారు. నాడు దమ్మిడీ, అణాలు, రూకలు సంపాదించేవీరు ప్రస్తుత టీటీడీ ఉద్యోగులుగా  రూ.30 వేల వరకు జీత భత్యాలు పొందే స్థాయిలో ఉన్నారు.

 

 పెరుమాళ్‌పల్లె వాసులతో ప్రత్యేక సైన్యం

 వెంకటగిరి సంస్థానం, శ్రీకాళహస్తి పాలెగాళ్లకు హథీరాంజీ మఠం పాలకులు అప్పటి సామాజిక పరిస్థితుల్లో కప్పంగా  అనధికార చెల్లింపులు చేసేవారు. గత రికార్డుల ప్రకారం హథీరాం మఠం పాలకులు పాలెగాళ్లకు వందల రూకలు, స్వర్ణనాణాలు అప్పుగానూ, అనధికారికంగానూ చెల్లింపులు చేసినట్టు తెలుస్తోంది.

 పాలెగాళ్ల దర్పం తగ్గుతున్న సమయంలో హథీరాం మఠం పాలకులు సొంతంగా పెరుమాళ్లపల్లె వాసులు, చుట్టూ గ్రామాలకు చెందిన జనంతో ప్రత్యేక దళాన్ని ఏర్పాటు చేసుకున్నారు. ఆ సైన్యానికి మఠంలోని బైరాగులే నాయకత్వం వహించినట్టు రికార్డులు చెబుతున్నాయి.  

 

 తిరుమలలో చిరు వ్యాపారాలు

 ఇక, పెరుమాళ్లపల్లెతోపాటు నరసింగాపురం, మిట్టపాళెం, చంద్రగిరి, నాగపట్ల రిజర్వుప్రాంతంలోని గ్రామాల ప్రజలు  పాలు, పెరుగు, నెయ్యి, వెన్న, మజ్జిగ, కూరగాయలు, పప్పుదినుసులు, తినుబండారాలు, రాగి, సజ్జ,జొన్నరొట్టెలు, చెక్కల బెల్లంగా పిలిచే నల్లబెల్లంతో తయారు చేసిన శెనక్కాయ తీపి పదార్థాలను తిరుమలకు తీసుకొచ్చి వ్యాపారాలు సాగించే వారు. స్వామివారితో వీరి అనుబంధం నేటికీ అలానే కొనసాగుతోంది.

 

 మా భుజాలపై స్వామి వాహనాలను మోసే భాగ్యం...

 దేవదేవుడైన స్వామినే భుజాలపై మోసే భాగ్యం దక్కటం మా పూర్వజన్మ సుకృతం. తిరుమలకు ఎలాంటి సౌకర్యాలు లేని రోజుల నుంచే మా గ్రామస్తులు స్వామి సేవ చేశారు. మా పెద్దల ఉద్యోగ విరమణతో ఇతర విభాగాల దేవస్థానం ఉద్యోగులు మాతోపాటు స్వామి సేవలో భాగస్వాము లయ్యారు. 1991లో ఆలయంలో రంగనాయక మండపం నుంచి అద్దాల మండపం వరకు బరువులు మోయడంతో స్వామి వాహన సేవలు మోసే వాహన బేరర్‌గా మారాను. అప్పటి నుంచి స్వామి సేవలో ఉంటున్నాను. అందుకు ఆనందంగా ఉంది.

 - మధుసూధన్‌రెడ్డి, పెరుమాళ్‌పల్లె

Read latest Funday News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top