మచాలియా

మచాలియా


‘ధూమ్’.. అంటే బ్లాస్ట్ ఇంగ్లిష్‌లో. తెలుగులో విస్ఫోటనం అంటారు. కానీ వాడుకలో బ్లాస్టే బెటర్. బాక్సాఫీసుని కొల్లగొట్టిన భారతీయ సినిమాలు చాలా వాటిల్లో అంతర్లీనంగా ఒకే ఫార్ములా ఉంటుంది- ‘బ్రేక్ ద రూల్స్’. రూల్స్‌ని బ్రేక్ చేసి కొత్త రూట్ క్రియేట్ చేసిన ప్రతి సినిమా బాక్సాఫీస్‌ని కలెక్షన్లతో బ్లాస్ట్ చేసింది. అదే ‘ధూమ్’. 2004, ఆగస్టు 27న అలాంటి ఒక బ్లాస్ట్ బాక్సాఫీసుని బద్దలుకొట్టింది. ‘దిల్‌వాలే దుల్హనియా లేజాయేంగే’ అనే రాముడు మంచి బాలుడు టైప్ సూపర్‌హిట్ సినిమా తీసిన ఆదిత్య చోప్రా తను నిర్మాతగా మారి సంజయ్ గాధ్వి అనే ఊరూ పేరూ తెలీని దర్శకుణ్ని పెట్టుకుని తనే కథ ఇచ్చి మరీ సూపర్‌హిట్ సినిమా తీయించాడు.

 

 ఒక కథలో ప్రొటాగనిస్ట్, అంటే హీరో, యాంటాగనిస్ట్ అంటే విలన్. ఒక దొంగని హీరోగా పెట్టి సినిమా తీసినప్పుడు ఆ దొంగ ప్రొటాగనిస్ట్, అతణ్ని పట్టుకోవాలని ప్రయత్నించే మంచి, సిన్సియర్ పోలీసాఫీసర్ విలన్, అంటే యాంటాగనిస్ట్ అవుతాడు. ఇలా రివర్స్ చేసి రాసుకున్న కథ ‘ధూమ్’.సాధారణంగా ఒక సినిమా సీక్వెల్ తీస్తే అందులో హీరోని మాత్రం కంటిన్యూ చేస్తూ, మిగిలిన పాత్రల్ని మారుస్తారు. ‘ధూమ్’తో ఆ రూల్‌ని కూడా బ్రేక్ చేశారు ఆదిత్య చోప్రా. హీరోల్ని మాత్రమే మారుస్తూ మిగిలిన పాత్రల్ని కంటిన్యూ చేయిస్తూ, ‘ధూమ్’ మూడు భాగాలు తీశారు. నాలుగోది తీయబోతున్నారు. నాలుగో భాగంతో కలిపి ‘ధూమ్’ చిత్రాల వ్యాపారం వేయి కోట్లకు చేరుతుంది. అందుకు ఆద్యమైన మొదటి సినిమా ‘ధూమ్’ కథా కమామీషు ఈ వారం మన ‘వ్యాసం’గం.

 

 కథ ముందు, కమామీషు తర్వాత.

 ముంబైలో బైకర్స్‌గ్యాంగ్ ఒకటి ఏర్పడి, పోలీస్ డిపార్ట్‌మెంట్‌కి పెనుసవాలు విసురుతుంది. చిత్ర విచిత్రమైన దొంగతనాలతో, క్షణాల్లో మాయమైపోతూ వాళ్లని పట్టుకోవడానికి పోలీస్ డిపార్ట్‌మెంట్ ఒక మంచి పోలీస్ ఆఫీసర్‌ని నియమిస్తుంది. అతను వాళ్ల వివరాల కోసం ఒక చిల్లర దొంగని సహాయకుడిగా పెట్టుకుంటాడు. బైక్‌గ్యాంగ్ నాయకుడు హీరో - జాన్ అబ్రహామ్. పట్టుకోవాలని ప్రయత్నించే పోలీసాఫీసర్ - యాంటీ హీరో - అభిషేక్ బచ్చన్. అతని సహాయకుడు - చిల్లర దొంగ - ఉదయ్ చోప్రా. వీళ్ల మధ్య చిన్నపిల్లలాడుకునే దొంగ-పోలీస్ ఆట, చోర్ - చోర్, ఐస్ బాక్స్, టామ్ అండ్ జెర్రీ, క్యాట్ అండ్ మౌస్ ఇత్యాది ఆటల్లాంటి ఆటే సినిమా అంతా.దొంగ తన తెలివితేటలతో, స్కిల్స్‌తో పోలీసుకి దొరక్కుండా తప్పించుకు తిరగడం, ఆ ప్రయత్నంలో అతనికో ప్రేమకథ, ఇలాంటి మసాలాలన్నీ దట్టించి చాలా స్టైలిష్‌గా, లావిష్‌గా తీసిన భారీ యాక్షన్ సినిమా ‘ధూమ్’.

 

 ‘‘ధూమ్ మచాలే...’’ టైటిల్ సాంగ్ మూడు భాగాలకీ బెస్ట్ సాంగ్.

 ఏడు కోట్లతో తీసిన చిన్న సినిమా పదిరెట్లు అంటే డెబ్భై కోట్లు వసూలు చేసి, చాలా పెద్ద సినిమా అయింది. అదీ విశేషం. ఈ సినిమా ఇచ్చిన లాభంతో ఇంకా భారీగా ‘ధూమ్-2’ తీశారు నిర్మాత, దర్శకుడు - జాన్ అబ్రహామ్ బదులు హృతిక్ రోషన్‌ని, ఈషాడియోల్ బదులు ఐశ్వర్యారాయ్‌ని పెట్టి. అదిచ్చిన లాభంతో ‘ధూమ్-3’ తీశారు- ఆమిర్‌ఖాన్‌ని, కత్రినాకైఫ్‌ని పెట్టి. ఇప్పుడు నాలుగో భాగం ప్లాన్ చేస్తున్నారని వినికిడి. ఇలా ఒకదాన్ని మించి ఒకటి రెట్టింపు లాభాలతో విజయవంతమవుతున్నా యంటే ‘ధూమ్-1’లో కుదిరిన ఫార్ములా ఎంత గట్టిదో, ఎంత కరెక్టో అర్థమౌతోంది. పునాది బలంగా ఉంటేనే కదా, బిల్డింగ్ ఎన్ని అంతస్తులైనా కట్టుకోగలం. అలాంటి బలమైన పునాదే ‘ధూమ్’.రొమాంటిక్ ఫ్యామిలీ డ్రామా తీసిన దర్శకుడు నిర్మాతగా మారి, మారుతున్న మిలీనియం యువత నాడిని పర్‌ఫెక్ట్‌గా పట్టుకుని, విజయవంత మవ్వడం ఎందరికో స్ఫూర్తినిచ్చే విషయం.

 

 ఈ ‘ధూమ్’ చిత్రాల దర్శకుడు సంజయ్ గాధ్వి మొదటి చిత్రం ‘తేరేలియే’ విడుదల కాకుండానే ఆగిపోయింది. రెండో చిత్రం ‘మేరే యార్‌కి షాదీ’ చాలా యావరేజ్ చిత్రం. అలాంటివాడికి అవకాశం ఇచ్చినందుకు నిర్మాత ఆదిత్య చోప్రాని మరీ మరీ అభినందించాలి. ఈ వ్యాసం రాయడం కోసం ఇప్పుడు మళ్లీ చూసినా ఈ చిత్రం అంతే గ్రిప్పింగ్‌గా ఉంది. క్లైమాక్స్ సూపర్.ఇంగ్లిష్‌లో ఇలాంటి చిత్రాలు చాలానే చూసుంటాం. జాకీచాన్ చిత్రాల్లో ఇలాంటి సీన్లు, ఛేజ్‌లు, ఫైట్లు చాలానే చూసుంటాం. కానీ మన నేటివిటీలో మన పాత్రలు, మన నటీనటులతో ఆ స్థాయి చిత్రాలు తీయడమే అసలైన పురోగతి. ‘ధూమ్’ హిట్టవ్వడం వల్ల హిందీ సినిమా నెక్ట్స్ లెవెల్‌కి వెళ్లిందని కచ్చితంగా చెప్పొచ్చు.

 వచ్చేవారం మరో మంచి చిత్రంతో కలుద్దాం.            

 

 మెచ్చుకోదగ్గ డైలాగుల్లో మచ్చుకి కొన్ని...

  ‘వేగం బుల్లెట్‌లో ఉండదు. కాల్చేవాడిలో ఉంటుంది.’

 ‘నా రూల్స్ ఎవడూ బ్రేక్ చేయలేడు, నేను కూడా.’

 ‘ఏదీ శాశ్వతం కాదు - నువ్వు, నేను, ప్లాన్, టైమ్.’

 ‘నీ అదృష్టం మారబోతోంది - నువ్వు కూడా మారిపోతావ్.’

 ‘చెడు ఎంత వేగంగా ముందుకెళ్లినా, అదెప్పుడూ మంచికి వెనకాలే ఉంటుంది.’

 

Read latest Funday News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top