మీకు తెలుసా?

మీకు తెలుసా?

ఈ ఫొటోలో కనిపిస్తున్న నగరం పేరు... శాన్ పియడ్రో సులా. హోండురాస్ దేశంలో పసిఫిక్ సముద్రాన్ని ఆనుకుని ఉన్న ఈ నగరం... ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన ప్రదేశం. ఇక్కడ జరిగినన్ని హత్యలు, ఆత్మహత్యలు, మానభంగాలు, దోపిడీలు మరెక్కడా జరగవట. అందుకే దీన్ని ప్రపంచంలోనే మోస్ట్ డేంజరస్ సిటీ అని నిర్ధారించారు!

 

 అబ్రహాం లింకన్ గడ్డం వెనుక పెద్ద కథ ప్రచారంలో ఉంది. ఆయన అధ్యక్ష పదవికి పోటీ చేస్తూ ప్రచార కార్యక్రమాల్లో మునిగి ఉన్నప్పుడు ఓ ఉత్తరం వచ్చింది. అందులో... ‘మీకు గడ్డం ఉంటే బాగుంటుంది, ఆడవాళ్లు గడ్డం ఉన్నవాళ్లని బాగా ఇష్టపడతారు, మీకే ఓటు వేస్తారు, తమ భర్తలతో కూడా వేయిస్తారు, మీరే గెలుస్తారు’ అని రాసి ఉంది. ఆ ఉత్తరం రాసింది గ్రేస్ గ్రీన్‌వుడ్ అనే పదకొండేళ్ల పాప. చిన్నపిల్లలంటే ఎంతో ఇష్టపడే లింకన్ అప్పటి నుంచే గడ్డం పెంచడం మొదలుపెట్టారని అంటుంటారు!

 

 అమెరికాకు చెందిన చార్ల్స్ ఆస్బార్న్‌కి 1922లో హఠాత్తుగా వెక్కిళ్లు ప్రారంభమయ్యాయి. అయితే ఎప్పటిలాగా కాసేపటికి ఆగిపోలేదు. వస్తూనే ఉన్నాయి. అలా 1990 వరకు, అంటే 68 యేళ్ల పాటు వెక్కిళ్లు వస్తూనే ఉన్నాయి. రకరకాల పరీక్షలు చేసి, మెదడులో ఓ నరం బాగా దెబ ్బతినడం వల్లే అలా జరిగిందని తేల్చారు వైద్యులు!

 

 స్వర్గీయ ఏపీజే అబ్దుల్ కలామ్‌కి ప్రపంచవ్యాప్తంగా ఎంత ఖ్యాతి, గౌరవం ఉన్నాయంటే... ఆయన 2006, మే 26న స్విట్జర్లాండును సందర్శించారు. అందుకు గుర్తుగా ఆ రోజును యేటా ‘సైన్స్ డే’గా ఆచరించాలని ప్రకటించింది ఆ దేశ ప్రభుత్వం!

 

 మన దేశంలో ఎక్కడ పడితే అక్కడ పానీపూరీ బండ్లు, చాట్ భాండార్లు ఫ్రీగా పెట్టేస్తుంటారు కదా! అమెరికాలో అలాంటి పప్పులేం ఉడకవు. ఇదిగో, ఈ ఫొటోలో ఉన్న వ్యక్తిని చూడండి. అతడు న్యూయార్క్ సిటీలో ఓ రోడ్డు పక్కన ఇలా బండి పెట్టి హాట్‌డాగ్స్ అమ్ముతుంటాడు. వ్యాపారం అద్భుతంగా సాగుతుంది. అయితే ఇక్కడ ఈ బండి పెట్టినందుకుగాను అతడు సంవత్సరానికి 2 లక్షల 89 వేల డాలర్ల అద్దె కడుతున్నాడు ప్రభుత్వానికి!

 

 ఈ ఫొటోలో కనిపిస్తున్నది ఏదో వింత జీవి కాదు. ఇది ఓ రకమైన కోడి. దీన్ని సిల్కీ చికెన్ అంటారు. ఈ కోళ్లు ఎక్కువగా అరవవు. అల్లరి చేయవు. చాలా క్రమశిక్షణతో ఉంటాయి. అందుకే ఈ కోడిని ‘ఐడియల్ పెట్ (ఆదర్శ పెంపుడు జంతువు)’ అంటుంటారు!

 
Read latest Funday News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top