మీకు తెలుసా?

మీకు తెలుసా?


 ఇండోనేసియా రైతులు వరి పొలాల్లోని నీటి మడులలో చేపలు పెంచుతారు. చేపల విసర్జితాలు పొలానికి ఎరువుగా ఉపయోగపడతాయని, పంట దిగుబడి పది శాతం పెరుగుతుందని! ఈ విధానాన్ని ‘రైస్-ఫిష్ కల్చర్’ అని పిలుచుకుంటారు.

 

 జింబాబ్వే తొలి అధ్యక్షుడు బనానా! పేరు విచిత్రంగా ఉండడంతో ఆయనపై ఎన్నో జోకులు ప్రచారంలో ఉండేవి. దాంతో ఆగ్రహించిన బనానా... తన పేరుపై జోకులు వేసేవారిని శిక్షించడానికి చట్టం  తేవాలను కున్నాడట. ఇంతకీ ఈ బనానా గారి పూర్తి పేరేంటో తెలుసా? కెనాన్ సోడినో బనానా.

 

 ‘మొబైల్ ఫోన్ త్రోయింగ్’ అనేది ఫిన్‌లాండ్‌లో అనధికారిక క్రీడ.

 

 జపాన్‌లోని అషిమా ద్వీపానికి  ‘క్యాట్స్ ఐల్యాండ్’ అని పేరు. ఈ దీవిలో 22 నివాసాలు ఉన్నాయి. విశేషమేమిటంటే ఇక్కడ మనుషుల కంటే పిల్లులే ఎక్కువగా ఉన్నాయి.

 

  డార్విన్ తండ్రి ప్రసిద్ధ వైద్యుడు. తన కుమారుడిని డాక్టర్‌గా చూసుకోవాలను కున్నాడు ఆయన. యూనివర్శిటీ ఆఫ్ ఎడిన్‌బర్గ్‌లో మెడికల్ స్కూల్లో డార్విన్‌ను చేర్పించాడు. అయితే ఆ స్కూల్లో వైద్యం గురించి ఉపాధ్యాయుల చేసే బోధనలు వినలేకపోయేవాడు డార్విన్. ప్రయోగ శాలల్లో రక్తం చూసి బెదిరిపోయేవాడు. దీంతో పాపం తండ్రి కోరికను నెరవేర్చలేకపోయాడు.

 

 ‘ద మోస్ట్ బ్యూటిఫుల్ వుమన్ ఇన్

 ద వరల్డ్’గా పేరుగాంచిన హాలీవుడ్ నటి హెడీ లామర్‌కి గణిత, విజ్ఞాన శాస్త్రాల్లో మంచి పట్టు ఉండేది. తనని అందగత్తెగా కాక తెలివైన వ్యక్తిగా గుర్తు పెట్టుకోవాలని ఆమె ఎంతో తపించేదట. కానీ పాపం ఆ కోరిక నెరవేరలేదు. ప్రస్తుతం బ్లూటూత్, వైఫైల్లో వాడుతోన్న ‘ఫ్రీక్వెన్సీ హాపింగ్ స్ప్రెడ్ స్పెక్ట్రమ్’ టెక్నాలజీని ఆమె అప్పట్లోనే కనిపెట్టిందని, దాని క్రెడిట్ మరెవరికో దక్కిందని అంటుంటారు.

 

 ఇంగ్లండ్, అమెరికా దేశాల్లో ‘కలరింగ్ బుక్స్’కు మాంచి డిమాండ్ ఉంది. బొమ్మలకు రంగులు వేయడం వల్ల  ఒత్తిడి, ఆందోళన తగ్గిపోయి మనసు ఉల్లాసంగా ఉంటుందనే  శాస్త్రీయ నిర్ధారణే దీనికి కారణం.

 

 అరటిపండు తొక్క ఏ రంగులో ఉంటుందో మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అయితే ఆస్ట్రేలియాలో పండే ‘రెడ్ బనానా’ తొక్క... పేరుకు తగ్గట్లే ఎరుపు రంగులో ఉంటుంది. దీని రుచి కూడా కాస్త రాస్‌బెర్రీలాగా ఉంటుందట.

 

  తెలివైనవాళ్లు తమను తాము తక్కువ అంచనా వేసుకోవడం, తెలివి తక్కువవాళ్లు తమను తాము గొప్పగా భావించుకునే  లక్షణాన్ని ‘డన్నింగ్-క్రుగెర్’ ఎఫెక్ట్ అంటారు.

 

 కల్పిత పాత్రలు నచ్చితే

 నెత్తిన పెట్టుకోవడం జపాన్‌లో కూడా ఉంది. జపాన్‌లోని యోకోహమలో... ఫిక్షన్ క్యారెక్టర్, వీడియో గేమ్ మెగాస్టార్‌గా పేరుగాంచిన ‘పికచు’ పేరుతో ప్రతి సంవత్సరం వారం రోజుల పాటు ఉత్సవాలు నిర్వహిస్తారు.  రకరకాలుగా ‘పికచు’ వేషాలు వేసుకొని చిన్నా పెద్దా నృత్యం చేస్తారు.

 

  సెయింట్ లూయిస్ సిటీ మ్యూజియం(యు.ఎస్)లో ప్రపంచంలోనే పెద్దవైన పెన్సిల్, టెన్నిస్ రాకెట్‌లు ఉన్నాయి.

 

Read latest Funday News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top