హిట్ అయితే హీరో ఫట్ అయితే మేమా?

హిట్ అయితే హీరో ఫట్ అయితే మేమా? - Sakshi


ఇంటర్వ్యూ

తెలుగు తెరపై తాప్సీ కనిపించి, రెండేళ్లయ్యింది. అనువాద చిత్రాల ద్వారా కనిపిస్తున్నారే కానీ, తెలుగులో స్ట్రయిట్ చిత్రాలు చేయడంలేదు. ఎందుకని? తెలుగు పరిశ్రమపై తాప్సీ అలిగారా? ఆమెనే అడిగి తెలుసుకుందాం...

     

మీరు చాలా మారిపోయారండీ?

అదేంటి అంత మాట అనేశారు! నేనెప్పటిలా ఫ్రెండ్లీగానే మాట్లాడుతున్నాను కదా!



అలా అని కాదు. అప్పట్లో మీ మాటల్లో ఇంత దూకుడు కనిపించేది కాదు. ఇప్పుడు ఏమడిగినా టకీమని సమాధానాలొచ్చేస్తున్నాయ్?

ఓహ్ అదా..? కాన్ఫిడెన్స్, ఎక్స్‌పీరియన్స్.. ఈ రెండూ ఉన్నవాళ్లు ఇలానే మాట్లాడతారు. ఒకప్పుడు నాకీ రెండూ నిల్. ఇప్పుడు ఫుల్. అందుకే ఇలా!

   

ఫ్రెండ్లీగా ఉన్నా... తెలుగు పరిశ్రమపై కోపంగా ఉన్నారేమో అనిపిస్తోంది?

వరుసగా తమిళ్, హిందీ సినిమాలు చేస్తున్నానని అలా అనుకుంటున్నారేమో? అలా ఏమీ లేదు. నన్ను కథానాయికను చేసిందే తెలుగు పరిశ్రమ. నేనెక్కువ సినిమాలు చేసింది కూడా ఇక్కడే. ఈ పరిశ్రమపై కోపం పెంచుకుంటే అంతకంటే అన్యాయం ఉండదు.

     

కానీ, ఏదో విషయంలో మీరు ‘హర్ట్’ అయ్యారేమో అనిపిస్తోంది?

నిజమే. రెండేళ్ల క్రితం వరకూ తెలుగు పరిశ్రమలో నా గురించి ఏమనేవారో తెలుసా? ‘తాప్సీ అన్‌లక్కీ. తను చేసే సినిమాలేవీ హిట్టవ్వవు’ అని.

     

ఇప్పుడా ట్యాగ్ మారిందా?


మారింది. ఏ వెబ్‌సైట్ అయితే ‘అన్‌లక్కీ’ అని నా మీద ముద్ర వేసిందో, అదే వెబ్‌సైట్ ‘తాప్సీ లక్కీ’ అని రాసింది. అంత సడెన్‌గా నేను ఎలా లక్కీ అయ్యానో నాకే అర్థం కాలేదు. హిందీలో ‘బేబీ’ హిట్ అయ్యింది. తమిళంలో నేనిప్పటివరకూ చేసినవన్నీ విజయవంతమైన సినిమాలే. అందుకే ‘లక్కీ’ అంటున్నట్టున్నారు.

     

‘అన్ లక్కీ’ అంటుంటే ఏమనిపించేది?

ఎలా రియాక్ట్ అవ్వాలో అర్థం అయ్యేది కాదు. ఎందుకంటే తమిళ, హిందీ రంగాల్లో నాపై ఈ ముద్ర లేదు. అక్కడ లక్కీ అనిపించుకున్న నేను ఇక్కడ అన్‌లక్కీ ఎలా అవుతాను? ఆ మాట విన్నప్పుడల్లా అభద్రతాభావం ఆవరించేది. పైగా ఒక సినిమాలో నేను ఏ పది, పదిహేను సీన్సో చేసి ఉంటాను. అలాంటప్పుడు చిత్ర అపజయానికి నేనెలా కారణమవుతాను? కానీ, నన్నే టార్గెట్ చేశారు.

     

అందుకే తెలుగుఫీల్డ్‌కి దూరమయ్యారా?

నా మాతృభాష హిందీ తర్వాత నేను నేర్చుకున్న భాష తెలుగే. ఇక్కడ నా పాత్రకు నేనే డబ్బింగ్ చెప్పుకుంటున్నాను. తెలుగంటే నాకెంత ప్రేమో దీన్నిబట్టి అర్థం చేసుకోవచ్చు. నేనిక్కడి వాళ్లని ఒక్కటే కోరుకుంటున్నా. ‘నన్ను అభిమానించండి. గ్లామరస్ రోల్స్ చేయగలను. నటనకు అవకాశం ఉన్న పాత్రలూ చేయగలనని నిరూపించుకున్నాను. కాబట్టి ఇప్పటికైనా గుర్తించి మంచి అవకాశాలివ్వండి.

     

మరి... హిందీ రంగం సంగతేంటి?

అక్కడ మెయిన్ హీరోయినా? సెకండ్ హీరోయినా? అని చూడరు. పాత్రని మాత్రమే పట్టించుకుంటారు. ‘బేబీ’లో నా పాత్ర నిడివి 20 నిముషాలే. కానీ ఆ పాత్ర నాకు తెచ్చిపెట్టిన ప్రశంసలెన్నో. మీడియా నన్ను ఎంతగానో అభినందిస్తూ రాసింది.



సినిమాల్లోకి వచ్చిన కొత్తలో కొంచెం బొద్దుగా ఉండేవారు. ఇప్పుడు భలే సన్నబడ్డారే?

అప్పట్లో కెమెరా గురించి అవగాహన ఉండేది కాదు. బరువు గురించి పెద్దగా ఆలోచించలేదు. ఆ తర్వాత తెరపై చక్కగా కనిపించాలంటే ఎంత బరువు ఉండాలో తెలిసింది. దాంతో కొంచెం తగ్గాను.

     

తెలుగు మీడియాలో అలా రాయలేదా?

చాలా మటుకు రాయరు. రివ్యూ రాసేటప్పుడు హీరో, విలన్, కమెడియన్ గురించి విపులంగా రాస్తారు. హీరోయిన్లకు మాత్రం అలా రాయరు. ‘తాప్సీ గుడ్’ అని మొక్కుబడిగా ఓ ముక్క రాస్తారు.  

 

సో... తెలుగు మీడియాపై కోపం ఉందన్నమాట?

కోపం కాదు బాధ. రాత్రికి రాత్రి నన్ను ‘స్టార్’ని చేసింది తెలుగు మీడియానే. కానీ తర్వాత వాళ్లే కింద పడేశారు. ఏదైపా మంచి పాత్ర చేసినప్పుడు రెండు మంచి మాటలు రాస్తే తృప్తిగా ఉంటుంది కదా!

     

‘బేబీ’ తర్వాత మీ దృష్టి ఉత్తరాది చిత్రాలపైనే ఉంటోందా?


తెలుగు దర్శక, నిర్మాతలను మంచి ఆఫర్ ఇవ్వమనండి. ఇక్కడా ఉంటాను. తమిళంలో రెండు సినిమాలు చేస్తున్నాను. సౌత్‌ని వదిలి ఎక్కడికీ వెళ్లలేదు. ఇక్కడి చిత్రాలు వదులుకునే ప్రసక్తే లేదు.

 

తెలుగు పరిశ్రమ, మీడియా సంగతి సరే.  అభిమానుల సంగతి?

వాళ్లు లేకపోతే నేను లేను. ఏదైనా షూటింగ్ కోసం, ఫంక్షన్ కోసం వచ్చినప్పుడు చక్కగా పలకరిస్తుంటారు. అభిమానం రుచి ఎలా ఉంటుందో నాకు తొలిసారి చూపించింది తెలుగు ప్రేక్షకులే. వాళ్లెప్పటికీ నాకు ప్రత్యేకం.

- డి.జి.భవాని

Read latest Funday News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top