మధురమైన చావు

మధురమైన చావు


నలభై ఏళ్ళ మేడం షాలోన్‌ని చూస్తే ఎవరూ ఆమె హంతకురాలు అనుకోరు. ఆమెని చూడగానే ఇన్‌స్పెక్టర్ మిరాన్‌కి గ్రీకు దేవత గుర్తొచ్చింది. ‘‘థాంక్స్’’ ఆమె ఇచ్చిన వైన్‌గ్లాస్‌ని అందుకుని చెప్పాడు. ‘‘చూడండి. మీరు దీన్ని తాగినా ఏం కాదు. అందులో విషం కలపలేదు.’’ ఆమె నవ్వుతూ చెప్పింది. ‘‘మేడమ్. నేను...’’ ‘‘నేను నా భర్తలని విషం ఇచ్చి చంపాననే అనుమానంతో కదా మీరు ఇక్కడికి వచ్చింది? మీ పోలీసులంతా అదే నిజమని నమ్ముతున్నారు.’’ నవ్వింది. ‘‘నేను మీ భర్తల శవాలని వెలికి తీయడానికి అనుమతి కోసం మాత్రమే వచ్చాను. మీ మొదటి భర్త ఎం.ఛార్లెస్ లెస్సర్ జనవరి 1939న, రెండో భర్త ఎం. ఎటైనే షాలోన్ మే 1946న మరణించారు. వారి కొన్ని అవయవాలని అధికారికంగా పరీక్షించాలని నిర్ణయించింది నేను కాదు. స్థానిక సార్జెంట్ మీ దగ్గరికి ఆ అనుమతి కోసం వస్తే దేనికి తిరస్కరించారు?’’ ఇన్‌స్పెక్టర్ మిరాన్ ప్రశ్నించాడు.  ‘‘అతను మీలా మర్యాదస్థుడు కాదు. చాలా మొరటుగా వ్యవహరించాడు. నేను అతని ప్రవర్తనని తిరస్కరించాను తప్ప చట్టాన్ని కాదు.’’ ‘‘మీరు నన్ను పొగుడుతున్నారు.’’ ‘‘ఎందుకంటే నాకు మీ పేరిస్ పోలీసుల పని తీరు తెలుసు. ఇప్పటికే వారి శవాలని మీరు రహస్యంగా పరిశీలించారు. ఫలితాలు మీరు ఆశించినట్లుగా రాలేదు. అది మీకు పెద్ద ప్రశ్నగా మిగిలింది. లేదా ఈపాటికి మీరు సాక్ష్యాధారాలతో నన్ను అరెస్ట్ చేయడానికి వచ్చేవారు. అవునా?’’ మేడం షాలోన్ నవ్వుతూ అడిగింది.

 ఆ బాణాలు అతన్ని సూటిగా వెళ్ళి గుచ్చుకోవడంతో అతని మొహం పాలిపోయింది.

 ‘‘నిజమే మేడం షాలోన్. మీరు చెప్పింది అక్షరాలా నిజం. కాని ఇంకా వృద్ధాప్యానికి చేరుకోని ఇద్దరు భర్తలు పెళ్ళయిన రెండేళ్ళల్లో గేస్ట్రిక్ సమస్యతో మరణించి, వారి నించి మీకు చాలా సొమ్ము వారసత్వంగా వచ్చిందంటే నేరానికి అవకాశం ఉందని నా యూనిఫాంలో మీరున్నా అనుకోరా?’’

 ‘‘అనుకుంటాను. మీకు ఒప్పుకోలు కావాలి కదా?’’

 ‘‘మీ తప్పుని మీరు పూర్తిగా ఒప్పుకుని అది ఎలా చేశారో చెప్తే మీకు పేరిస్ పోలీసులు కృతజ్ఞతగా ఉంటారని చెప్పగలను.’’

 ‘‘ఐతే సరే. ఇంకాస్త వైన్ పోయనా?’’

 మిరాన్ తల ఊపడంతో ఆమె అతని గ్లాసుని వైన్ సీసాలోంచి నింపి అడిగింది.

 ‘‘మీకు పాక కళలో ప్రవేశం ఉందా?’’

 ‘‘అభిరుచి తప్ప ప్రవేశం లేదు.’’

 ‘‘కామ కళలో?’’

 ‘‘నేను పేరిస్ నివాసిని.’’

 ‘‘సరే. ఏభై ఏడేళ్ళ నా మొదటి భర్త ఎం. లెస్సర్‌ని, అలాగే అరవై ఐదేళ్ళ నా రెండో భర్త ఎం.షాలోన్‌ని నేను కావాలని సకారణంగా హత్య చేశాను.’’

 ‘‘సకారణంగా అని తెలుసు. కాని ఎలా అన్నది మాకు తెలియాలి.’’

 ఎం. లెస్సర్‌ని నా కుటుంబ సభ్యులు ప్రమేయం వల్ల చేసుకున్నాను కాని నా అంతట నేను చేసుకున్న పెళ్ళి కాదది. అతనిలో మీలోని సగం మర్యాద ఉన్నా, నా రెండో భర్తకి మీలోని సగం అందం ఉన్నా వాళ్ళు జీవించే ఉండేవారు. లెస్సర్ పంది లాంటివాడని పెళ్ళయిన రెండు వారాలకే నాకు అర్థమైంది. బీదలని, అమాయకులని మోసం చేసి ఆర్జించే తిండిపోతు. భోజనం బల్ల దగ్గర చప్పుడు చేయకుండా తినలేడు. అతని అలవాట్లన్నీ అసహ్యకరమైనవే. వాటిలో గౌరవం, మృదుత్వం ఉండవు. దాంతో అతని జీర్ణశక్తి మందగించింది. మనో నిబ్బరం కూడా.

 ‘‘ఎం. షాలోన్?’’

 ‘‘జర్మన్స్ ఎలాంటివారో మీకు తెలుసు కదా? ఉత్తమమైనవన్నీ తమకే కావాలి. అరుదైన ఆహారపదార్థాలు, వైన్లు. రోజూ బీదవారు రోడ్ల మీద ఆకలికి స్పృహ తప్పి పడిపోవడం చూసి కూడా! నేను హంతకురాలినే కాదు ఇన్‌స్పెక్టర్ మిరాన్, ఫ్రెంచి పౌరురాల్ని కూడా. ఈ అన్యాయాన్ని సహించలేకపోయాను.’’

 ‘‘అప్పుడేం చేశారు?’’

 ‘‘మీకు కొన్ని ఆహార పదార్థాల పేర్లు తెలుసా? సుప్రీమ్స్ డి ఒలైలా? ఆలా ఇండియనే? టోర్నెడోస్ మస్కాటే? ఆమ్లెట్ ఎన్ సర్‌ప్రైజ్? అలా నెపోలిటైన్? పోటేజ్ బేగ్‌రేషన్ గ్రాసా? జౌబర్‌జైన్స్ అలాటర్క్యూ?’’

 ‘‘ఆపండి. నా నోట్లో నీళ్ళూరుతున్నాయి.’’ ఇన్‌స్పెక్టర్ మిరాన్ నవ్వుతూ చెప్పాడు.

 ‘‘అవన్నీ కొవ్వు అధికం గలవి. మీరు నా పద్ధతుల్ని అడిగారు కదా? నేను వాటిని, ఇంకో ఇలాంటి వందల వంటకాలని వాడాను. ప్రతి దాంట్లో నేను కొద్దిగా ఉంచాను.’’ అకస్మాత్తుగా చెప్పడం ఆపేసింది.

 ‘‘మీరు కొద్దిగా ఏం ఉంచారు మేడమ్ షాలోన్?’’

 ‘‘మీరు నా గురించి పరిశోధించారు. నా తండ్రి ఎవరో మీకు తెలుసా?’’

 ‘‘జాన్ మేరీ విల్లెరోయిస్. గొప్ప వంటగాడు. ఫ్రాన్స్‌లో అగ్రగణ్యుడైన ఎస్కాఫీసర్ దగ్గర ఏకైక సహాయకుడు. ఎస్కాఫీకి వంటలో ఆయనే వారసుడు అనే పేరు తెచ్చుకున్నాడు.’’

 ‘‘అవును. నా ఇరవై రెండో ఏట, అంటే ఆయన మరణానికి మునుపు నాకు కొవ్వుతో రుచికరంగా ఎలా వండాలో నేర్పాడు.’’

 ‘‘ఓసారి మీ వంట రుచి చూడాలని ఉంది. ఇందాక మీరు ప్రతీ వంటకంలో ఏదో ఉంచి వండానన్నారు?’’

 ‘‘ప్రేమ.’’

 ‘‘అంటే?’’

 ‘‘నేను మా నాన్న నించి నేర్చుకున్న కొన్నిటిని. అంతకు మించి మరేం లేదు. ఎస్కాఫీసర్ లేదా మా నాన్న వంట రుచిని నా ఇద్దరు భర్తల్లో ఎవరు తిరస్కరించగలరు? రోజుకి నాలుగు సార్లు నేను వాళ్ళకి అత్యంత కేలరీలు గల ఆహార పదార్థాలని వండి పెడితే ఇష్టంగా తిన్నారు. వాళ్ళకి కొసరి కొసరి వడ్డించి ప్రీతిగా తినిపించాను. తిన్నాక వైన్ తాగి నిద్రపోవడం, లేచాక మళ్ళీ తిని పడుకోవడం! వారికి శారీరక శ్రమ అనేదే లేకుండా పోయింది. వారి వయసులో వారు ఆ తిండితో ఎంతకాలం జీవించగలరు?’’

 కొద్దిసేపు వారి మధ్య గోడ గడియారం చేసే చప్పుడు మాత్రమే వినిపించింది. ఇన్‌స్పెక్టర్ మిరాన్ కొద్దిసేపు ఆలోచించి అడిగాడు.

 ‘‘ప్రేమ? ఇందాక మీరు ప్రేమ కళ గురించి చెప్పారు?’’

 ‘‘ప్రేమ. అవును. అలాంటి భోజనం కామోద్రేకం కలిగించి తీరుతుంది. వారు నాతోనే కాక కొందరు పరాయి ఆడవాళ్ళతో సంబంధం పెట్టుకున్నా నేను వారించలేదు. దాంతో నిత్యం వారి బీపీ పెరిగి తరగడం జరిగేది. ఫలితంగా ఎం.లెస్సర్ ఏభై ఏడో ఏట, ఎం.షాలోన్ అరవై ఐదో ఏట సహజంగా మరణించారు. జరిగింది అంతే.’’

  మరి కొద్ది సేపు ఆ గదిలో నిశ్శబ్దం. ఇన్‌స్పెక్టర్ మిరాన్ చేతి వేళ్ళు ఆలోచనగా బల్లని తాటించాయి.

 ‘‘మేడం షాలోన్! మీరు నాతో బయటికి వస్తారా?’’ చివరకి అతను అడిగాడు.

 ‘‘పోలీస్ స్టేషన్‌కా?’’

 ‘‘కాదు. రెస్టారెంట్‌కి. షాంపేన్, సంగీతాల కోసం. మీతో నేను కొంత మాట్లాడాలి.’’

 ‘‘కాని ఇన్‌స్పెక్టర్...’’

 ‘‘నేను చెప్పేది వినండి మేడం. నేను బ్రహ్మచారిని. నా వయసు నలభై నాలుగు. నేను అందంగా ఉంటానని చాలామందిలా మీరూ అన్నారు. నేను కొంత సొమ్ముని బ్యాంక్‌లో దాచాను. మీ మరణించిన భర్తలంత గొప్ప సంపన్నుణ్ణి కాకపోయినా మీరు తిరస్కరించ తగ్గవాడిని కానని అనుకుంటున్నాను.’’

 అతను ఆమె కళ్ళల్లోకి చూస్తూ పూర్తి చేశాడు.

 ‘‘నాకు చావాలని ఉంది.’’

 ఆమె నవ్వుతూ తల తాటించి చెప్పింది. ‘‘ఇప్పుడు నాకు తృప్తి కలిగేంత సంపద ఉంది. ఆ వంటకాల్లో కొవ్వుని తగు పాళ్ళల్లో వాడితే నా వంట ఎవర్నీ చంపదు. నా చేతిని ముద్దు పెట్టుకుంటారా ఇన్‌స్పెక్టర్ మిరాన్?’’

 ఆమె తన చేతిని అతని వైపు చాపింది. (సిపి డొనెల్ జూనియర్ కథకి స్వేచ్ఛానువాదం)

 -  మల్లాది

Read latest Funday News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top