అనుమానితులు

అనుమానితులు


అరవై సంవత్సరాల నాగమణి భర్తతో గొడవపడి కొన్ని సంవత్సరాలుగా ఒంటరిగా ఉంటోంది. పిల్లలు ఎవరూ లేరు. నాగమణి నోటిదురుసుతనం వల్లే భర్త దూరమయ్యాడని ఇరుగుపొరుగు అనుకుంటారు. ఆమె నోటికి జడిసి బంధువులు కూడా దూరమయ్యారని అంటుంటారు. లంకంత కొంపలో ఒంటరిగా ఉంటుంది నాగమణి. ఉన్నట్టుండి ఒకరోజు ఆమె హత్యకు గురైంది. రకరకాల ఎంక్వైరీల తరువాత ముగ్గురిని అనుమానితుల జాబితాలో చేర్చారు పోలీసులు.



1. ఆనంద్‌ : నాగమణి భర్త. నగరంలోనే ఒకచోట నివసిస్తున్నాడు. ‘ఇద్దరికీ ఎవరూ లేరు కదా. కలిసి ఉందాం’ అని ఇటీవల ఆనంద్‌ ప్రపోజ్‌ చేస్తే  నాగమణి తిరస్కరించింది. దీన్ని మనసులో పెట్టుకొని నాగమణిని ఆనంద్‌ హత్య చేశాడా? అనే కోణంలో పోలీసులు ఆలోచించారు.



2. కుమార్‌: నాగమణికి చెస్‌ ఆడడం అంటే ఇష్టం. ప్రొఫెషనల్‌ చెస్‌ ప్లేయర్‌ అయిన కుమార్‌తో రోజూ చెస్‌ ఆడేది నాగమణి. ఒకరోజు నాగమణిని అయిదు లక్షల రూపాయల అప్పు అడిగి చేదు అనుభవాన్ని ఎదుర్కొన్నాడు. ఈ అవమానభారంతో కుమార్, నాగమణిని హత్య చేసి ఉంటాడా?



3. గీత: నాగమణితో ఒకప్పుడు చాలా సన్నిహితంగా ఉండేది. ఇద్దరూ కలిసి వ్యాపారం చేయడానికి సన్నాహాలు కూడా చేశారు.  ఆ సమయంలో ఏదో విషయంలో ఇద్దరూ తీవ్రంగా గొడవ పడ్డారు. ఈ గొడవను మనసులో పెట్టుకొని నాగమణిని గీత హత్య చేసిందా?

హత్య జరిగిన స్థలంలో పోలీసులకు ఒక షాపింగ్‌ లిస్ట్‌ దొరికింది. ఆ లిస్ట్‌లో ఇలా ఉన్నాయి... 1. పాలప్యాకెట్, 2. సిగరెట్లు, 3. టూత్‌పేస్ట్, 4. సోప్, 5. సెట్రిజెన్‌ ట్యాబ్లెట్లు, 6. స్వీట్లు

 ‘సిగరెట్లు’ అనేదాన్ని చూసి ‘ఇది కచ్చితంగా నాగమణిది కాదు’ అని నిర్ధారించారు పోలీసులు. ఎందుకంటే ఆమె సిగరెట్లు కాల్చదు. కాల్చేవారిని తెగ తిడుతుంది. మరి  ఈ లిస్ట్‌ ఎవరిదై ఉంటుంది?  ఈ షాపింగ్‌ లిస్ట్‌ ఎవరిదో కనుక్కుంటే హంతకులెవరో సులభంగా కనుక్కోవచ్చు అంటూ రంగంలోకి దిగారు పోలీసులు.



‘‘ఈ షాపింగ్‌ లిస్ట్‌ మీరే ఇక్కడ పోగొట్టుకున్నారని నమ్ముతున్నాం. ఏమంటారు?’’ అని అడిగాడు ఇన్‌స్పెక్టర్‌.



‘‘మీరు నన్ను అనుమానించడం వల్ల నేనేమీ ఫీల్‌ కావడం లేదు. మీ స్థానంలో నేను ఉన్నా అలానే చేస్తాను. ఇటీవల మా ఇద్దరి మధ్య గొడవ జరిగిన మాట నిజమేగానీ భార్యను చంపేంత క్రూరుడిని కాదు. మీకో విషయం తెలుసా? సోప్‌ తప్ప ఈ లిస్ట్‌లో ఉన్న వస్తువులేవీ నేను వాడను’’ అన్నాడు ఆనంద్‌.



‘‘అదేమిటి?’’ ఆశ్చర్యంగా అడిగాడు ఇన్‌స్పెక్టర్‌.

‘‘అవును. నా ఇంట్లో స్టవ్‌ అనేదే లేదు. భోజనం చేయడం, టీ తాగడం అన్ని హోటల్లోనే. కాబట్టి నాకు పాలప్యాకెట్లు కొనే అవసరం ఏమిటి? నేను సిగరెట్లు కాల్చనని, కొన్ని సంవత్సరాలుగా టూత్‌పేస్ట్‌కు బదులుగా వేపపుల్లని ఉపయోగిస్తున్నాని అందరికీ తెలుసు. ట్యాబ్లెట్లు కూడా ఎప్పుడూ వాడింది లేదు’’ అన్నాడు ఆనంద్‌. అనుమానితుల జాబితాలో ‘ఆనంద్‌’ పేరు కొట్టివేయబడింది.



మరి కుమార్, గీత సంగతి ఏమిటి?

‘‘ఒకవేళ ఆ లిస్ట్‌ నాదే అనుకుందాం. సిగరెట్లు తాగని నాకు అవి ఎందుకు? షుగర్‌ పేషెంట్‌ అయిన నాకు స్వీట్లతో పనేమిటి?’’ పోలీసులను ఎదురు ప్రశ్నించాడు కుమార్‌.

జాబితాలో కుమార్‌ పేరు కూడా కొట్టివేయబడింది.



ఆన్సర్‌

‘‘షాపింగ్‌ చేయడం అంటే నాకు మా చెడ్డ చిరాకు. అంతా మా పని అమ్మాయే చూసుకుంటుంది’’ అని చెప్పింది గీత. గీతను  ఒకసారి తేరిపార చూసి...



‘‘నువ్వే నాగమణిని హత్య చేశావు’’ అంటూ ఆమెను అరెస్ట్‌ చేశాడు ఇన్‌స్పెక్టర్‌ నరసింహ. ఇప్పుడు చెప్పండి.... గీతే హంతకురాలని ఇన్‌స్పెక్టర్‌  ఏ ఆధారంతో కనిపెట్టగలిగాడు?



గీత సిగరెట్లు తాగుతుందనేది బహిరంగ రహస్యం. ఇన్‌స్పెక్టర్‌ మాట్లాతున్నప్పుడు ... కర్చీఫ్‌తో రెండు మూడుసార్లు ముక్కు తుడుచుకుంది. ఆమె గొంతు కూడా మారిపోయింది. ఆమెకు జలుబు చేసిందనే విషయం అర్థమైపోయింది. లిస్ట్‌లో సిట్రిజన్‌ ట్యాబ్లెట్స్‌ అని ఉండడంతో... అది ఆమె షాపింగ్‌ లిస్టే అనే విషయం తెలిసిపోయింది.



 

Read latest Funday News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Tags: 



 

Read also in:
Back to Top