ఒక వర్షపు రాత్రి

ఒక వర్షపు రాత్రి - Sakshi


ఆరోజు రాత్రంతా ఒకటే వాన. ఆ వర్షపు రాత్రి నాయుడిని ఎవరో కాల్చి చంపారు. ‘నాయుడు హత్యకు గురయ్యాడు’ అనే ‘సంచలనం’ కంటే ‘నాయుడిని హత్య చేయాల్సిన అవసరం ఎవరికుంది?’ అనే ‘అనుమానం’ ఎక్కువ మందిని పట్టి పీడించింది.

ఎవరీ నాయుడు?



ఒకప్పుడు బాగా సంపన్నుడు.ఏమైందో ఏమోగానీ ఉన్నట్టుండి వైరాగ్యంలోకి దిగిపోయాడు.

దానధర్మాలకు డబ్బును మంచినీళ్లలా ఖర్చు చేయడం మొదలుపెట్టాడు.నాయుడికి  ఇద్దరు  కొడుకులు. 1.అమర్‌ 2. ఆదిత్య.దానధర్మాల పేరిట తండ్రి డబ్బును ఖర్చు పెట్టడం కొడుకులిద్దరికీ ఎంతమాత్రం నచ్చలేదు.తండ్రికి నచ్చ చెప్పారు.తగాదా పడ్డారు.



‘‘మీ ఇద్దరికీ ఒక్క పైసా కూడా ఇవ్వను. ఏంచేసుకుంటారో చేసుకోండి’’ అని మొండికేయడంతో కొడుకులకు, తండ్రికి మధ్య విపరీతమైన అంతరం పెరిగింది. ఈ నేపథ్యంలోనే నాయుడు హత్య జరగడంతో...సహజంగానే అమర్, ఆదిత్యలు అనుమానితుల జాబితాలో చేరారు.ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే, ‘తండ్రి మీద వ్యతిరేకత’ విషయంలో తప్ప కొడుకులిద్దరికీ ఏ విషయంలోనూ ఏకాభిప్రాయం లేదు. ఇద్దరి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుంది.



హత్య జరిగిన స్థలంలో ఒక గ్లౌజ్, 9 ఎం.ఎం. రివాల్వర్‌ బుల్లెట్‌ ఒకటి దొరికింది.

‘‘ఈ రెండూ చాలు...హంతకుడిని పట్టుకోవడానికి’’ అన్నాడు కానిస్టేబుల్‌.

విచారణలో తేలిన విషయం ఏమిటంటే,అమర్‌ దగ్గర లైసెన్స్‌డ్‌ 9 ఎం.ఎం.

 రివాల్వర్‌ ఉంది. ఇతను లెఫ్ట్‌ హ్యాండర్‌. ఇన్‌స్పెక్టర్‌ నరసింహ అమర్‌ని కాకుండా ఆదిత్యను అరెస్ట్‌ చేశాడు. రెండు సాక్ష్యాలు ఉన్నప్పటికీ...ఆదిత్యను ఎందుకు అరెస్ట్‌ చేశాడు?



2

వర్షం కురిసిన ఆ రాత్రి ఇంజనీర్‌ రామారావు హత్యకు గురయ్యాడు.

రామారావును ఉరి వేసి చంపారు.‘‘ఏదో చప్పుడు కావడంతో వచ్చి చూశాను. ఎవరో పారిపోతున్న శబ్దం స్పష్టంగా వినిపించింది’’ అని చెప్పాడు పొరుగింటి వ్యక్తి.

పోలీసులకు ఒక గొడుగు దొరికింది. పొరుగింటి వ్యక్తి పెద్దగా అరుస్తూ రావడంతో హంతకుడు భయంతో పారిపోతూ గొడుగును పడేసుకున్నాడు. ఇప్పుడు ఆ గొడుగే హంతకుడిని పట్టించబోయే కీలక ఆధారం అవుతుంది.ముగ్గురిని అనుమానితుల జాబితాలో చేర్చారు పోలీసులు.



1.సుబ్బారావు.

2.అప్పారావు.

3.డేవిడ్‌.




పోలీసుల దర్యాప్తు మొదలైంది.‘‘నా దగ్గర గొడుగే లేదు. అప్పుడెప్పుడో వాడాను. అది ఎక్కడ ఉందో కూడా నాకు తెలియదు’’ అన్నాడు సుబ్బారావు.‘‘నా దగ్గర మంచి గొడుగు ఉండేది. వారం రోజుల క్రితం సినిమా హాల్‌కు వెళ్లి దాన్ని మరిచిపోయి వచ్చాను. ఇక దాని గురించి ఆలోచించలేదు’’ అన్నాడు అప్పారావు.‘‘నా గొడుగును మీరు తప్పనిసరిగా చూడవచ్చు’’ అంటూ తన గొడుగును చూపించాడు డేవిడ్‌.

పోలీసులు డేవిడ్‌ను హంతకుడిగా తేల్చారు. ఎలా?



1

బుల్లెట్‌ సంగతి ఎలా ఉన్నా, ఎంత తెలివి తక్కువ హంతకుడైనా హత్య జరిగిన స్థలంలో గ్లౌజ్‌ను వదిలి వెళ్లడు. అమర్‌పై అనుమానం రావడానికే అతని ఇంట్లోని రివాల్వర్, గ్లౌజ్‌ను దొంగిలించి తండ్రిని కాల్చి చంపాడు ఆదిత్య. పొరపాటున రైట్‌ హ్యాండ్‌ గ్లౌజ్‌ను వదిలి వెళ్లాడు.



2

డేవిడ్‌ చూపించిన గొడుగు చాలా కొత్తగా ఉంది. ‘నా గొడుగు ఏది?’ అని పోలీసులు అడిగితే చూపించడానికి ఆరోజు ఉదయమే కొత్త గొడుగు కొనుగోలు చేశాడు డేవిడ్‌.  ఆ కొత్తదనమే డేవిడ్‌ను అనుమానించేలా చేసింది.

Read latest Funday News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top