కారులో శవం...

కారులో శవం... - Sakshi


పట్టుకోండి చూద్దాం

హాల్లో టెన్షన్‌గా అటూ ఇటూ తిరుగుతున్నాడు సందీప్. మధ్య మధ్యన ద్వారం వైపు చూస్తున్నాడు. అప్పుడప్పుడూ గడియారం వైపు చూస్తున్నాడు. భారంగా నిట్టూరుస్తున్నాడు. అతనికేమీ అర్థం కావడం లేదు. పొద్దుననగా ఫంక్షన్‌కి వెళ్లింది కళ్యాణి. ఫంక్షన్ ఎప్పుడో అయిపోయి ఉంటుంది. కానీ అయిదవుతున్నా రాలేదు. ఫోన్ కూడా స్విచాఫ్ చేసి ఉంది. అందుకే సందీప్‌కి  టెన్షన్‌గా ఉంది. ‘‘కాఫీ ఇవ్వ మంటారా అయ్య గారూ’ అంది లోనికి వస్తూనే పనిమనిషి కాంతమ్మ. వద్దు అన్నట్టు తలూ పాడు. ‘‘కళ్యాణి జాడ తెలియడం లేదు కాంతమ్మా’’ అన్నాడు దిగులుగా.



‘‘ఏదో ఫంక్షన్‌కి వెళ్తాను అన్నారుగా బాబూ. అక్కడ్నుంచి ఇంకెక్కడికైనా వెళ్లారేమో’’ అంది కాంతమ్మ. ఆ ఆలోచన తనకి రానందుకు తిట్టు కున్నాడు సందీప్. ఫంక్షన్‌కి కళ్యాణి అన్నయ్యవాళ్లు కూడా వెళ్లి ఉంటారు. వాళ్ల ఇల్లు అక్కడికి దగ్గరే. అందరూ కలిసి అక్కడికిగానీ వెళ్లారేమో అను కుంటూ సెల్ చేతిలోకి తీసుకున్నాడు. కానీ అతడు డయల్ చేసేలోపే అది రింగ య్యింది. కొత్త నంబర్. తీసి హలో అన్నాడు.

 ‘‘సందీప్‌గారేనా మాట్లాడేది?’’ అంది అవతలి నుంచి ఓ మగమనిషి స్వరం. ‘‘అవును. మీరెవరు’’ అన్నాడు ఆతృతగా. ‘‘నేను కుకట్ పల్లి ఎస్సైని మాట్లాడుతున్నాను. మీ భార్యను ఎవరో హత్య చేశారు. మీరు వెంటనే రావాలి.’’

 అవాక్కయిపోయాడు సందీప్. దుఃఖం పొంగుకొచ్చింది. వెంటనే ‘‘కళ్యాణీ’’ అంటూ బయటకు పరుగుదీశాడు.

   

కుకట్‌పల్లికి కొన్ని కిలోమీటర్ల దూరంలో... ఓ నిర్మానుష్య ప్రదేశంలో ఉంది కారు. దానిలో డ్రైవింగ్ సీట్‌లో వెనక్కి వాలి ఉంది కళ్యాణి. ఎవరో దారుణంగా పీక కోసేశారు. ఛాతిలో కూడా కత్తిపోట్లు ఉన్నాయి. తట్టుకోలేక పోయాడు సందీప్. కళ్యాణీ అంటూ గుండెలవి సేలా ఏడుస్తుంటే పోలీసుల మనసులు సైతం కదిలిపోయాయి. అతి కష్టమ్మీద అతణ్ని ఊరుకో బెట్టగలిగారు. బాడీని పోస్ట్‌మార్టమ్‌కి పంపించి, సందీప్‌ని తీసుకుని స్టేషన్‌కి బయలుదేరారు.

   

‘‘మీకుగానీ మీ భార్యకిగానీ ఎవరైనా శత్రువులు ఉన్నారా సందీప్‌గారూ?’’ ఎస్సై రవికిరణ్ అలా అడగ్గానే మరోసారి భోరుమన్నాడు సందీప్. ‘‘లేరు సర్. తనకైతే అస్సలు ఉండరు. ఎందుకంటే తను చాలా సాఫ్ట్. నాతో కూడా ఎప్పుడూ పోట్లాడదు. ఎంతో కూల్’’ అన్నాడు కళ్లొత్తుకుంటూ. ‘‘అంత కూల్‌గా ఉండే మనిషిని ఎవరు చంపుతారు సందీప్ గారూ? ఇది అనుకోకుండా జరిగినట్టు అనిపించడం లేదు. ఎవరో కావాలని కసితో చేసినట్టు అనిపిస్తోంది.’’

 

‘‘ఒకవేళ దొంగలెవరైనా ఈ పని చేశారంటారా సర్. తన ఒంటిమీద నగలు కూడా మాయమయ్యాయి కదా?’’ అన్నాడు సందీప్ సాలోచనగా. ‘‘లేదు. ఇది కచ్చితంగా ఎవరో తెలిసినవారి పనే’’ అన్నాడు రవికిరణ్. ‘‘ఎందుకలా అంటున్నారు సర్?’’ అర్థం కాక అడిగాడు సందీప్. ‘‘ఎందుకంటే తన శవం దొరికిన ప్రదేశాన్ని చూశారుగా? మారుమూల ప్రాంతం. నిర్మానుష్యంగా ఉంది. ఫంక్షన్ నుంచి ఇంటికి రావాల్సిన మనిషి అలాంటి చోటికి ఎందుకెళ్తుంది? ఎవరో తీసుకెళ్లి ఉండాలి. అలా అని ఎవరు పడితే వాళ్లు తీసుకెళ్తే ఎందుకెళ్తుంది? తెలిసినవాళ్లు అయితేనే వెళ్తుంది. ఒకవేళ తనకి వేరే ఎవరితోనైనా...’’

 

ఇన్‌స్పెక్టర్ భావం అర్థమై అంతెత్తున లేచాడు సందీప్. ‘‘ఏం మాట్లాడుతున్నారు సర్? తన గురించి మీకు ఏం తెలుసని మాట్లాడుతున్నారు? మేం ప్రేమించి పెళ్లి చేసుకున్నాం. ఒకరంటే ఒకరికి ప్రాణం. నా కళ్యాణి నన్ను తప్ప ఎవరినీ ప్రేమించదు.’’

 ‘‘కానీ మీరు మాత్రం వేరే వాళ్లని ప్రేమించ గలరు. పెళ్లి చేసుకోగలరు.’’ చివ్వున చూశాడు సందీప్. ఇన్‌స్పెక్టర్ అలా ఎందుకన్నాడో అర్థం కాలేదు.

 

‘‘ఏంటలా చూస్తున్నారు? మీరు డబ్బు కోసం వేరే అమ్మాయిని ప్రేమించారు. పెళ్లి చేసుకోవాలనుకున్నారు. అది మీ భార్యకి తెలిసి పోయింది. మీతో గొడవపడింది. మీరు మారి పోయినట్టు నటించారు. ఇక ఎప్పుడూ మోసం చేయను అని మాట కూడా ఇచ్చారు. ఆ నమ్మకమే ఆమె ప్రాణాలు తీసేసింది.’’

 విస్తుపోయాడు సందీప్. ‘‘లేదు సర్, మీరు పొరపాటు పడుతున్నారు.’’

 

‘‘నేను ఎంక్వయిరీ చేశాను మిస్టర్. మీ మధ్య జరిగిన గొడవ లన్నీ కళ్యాణి ఫ్రెండ్ చెప్పింది. ఫంక్షన్ అయ్యే టైమ్‌కి మీరు వెళ్లారు. ఎవరికీ కనిపించకుండా తనని తీసుకుని బయలుదేరారు. తనని చంపేసి, కారుతో సహా అక్కడ వదిలేశారు. మీ కాల్ రికార్డ్స్ పరిశీలిస్తే ఫంక్షన్ జరిగిన ప్రదేశంలో, శవం దొరికిన ప్రదేశంలో కూడా మీరు ఉన్నారని నిర్ధారణ య్యింది. కాబట్టి ఇక తప్పించుకోవాలని చూడకండి’’... చకచకా చెప్పాడు రవికిరణ్.

 

ఇక వాదించలేదు సందీప్. ‘‘తను నా గురించి అందరికీ చెప్పి గొడవ పెడతానంది. అందుకే మారినట్టు నటించి నోరు నొక్కేశాను. కానీ తనంటే నాకు ఏమాత్రం ఇష్టం లేదు. నేను పావనిని పెళ్లి చేసుకోవాలనుకున్నాను. కళ్యాణి ఉండగా అది సాధ్యం కాదు. అందుకే చంపే శాను. కానీ ఈ విషయం మీకెలా తెలిసింది సర్? అసలు నా మీద మీకు అనుమానం ఎలా కలిగింది?’’ అన్నాడు ఆశ్చర్యంగా.

 సందీప్ ఆ ప్రశ్నకు సమాధానం చెప్పకుండా... ‘‘కానిస్టేబుల్... సర్‌ని లోపలెయ్యి’’ అంటూ బయటికెళ్లిపోయాడు. పోనీ మీరు చెప్పండి. సందీపే హంతకుడని ఇన్‌స్పెక్టర్ ఎలా కనిపెట్టాడు???

 

జవాబు:  

మీ భార్య హత్యకు గురయ్యింది, రమ్మని పిలవగానే సందీప్ ఎక్కడికి రావాలి అని అడగలేదు. ఫోన్ పెట్టేసి తిన్నగా స్పాట్‌కి వెళ్లిపోయాడు. దాంతో అతడి చరిత్ర మొత్తం బయటికి లాగాడు ఇన్‌స్పెక్టర్.

Read latest Funday News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top