ఆ పాట నన్ను స్టార్‌ని చేసింది!

ఆ పాట నన్ను స్టార్‌ని చేసింది!


సంభాషణం: సత్యమేవ జయతే కార్యక్రమం చూసినవాళ్లకి సోనా మహాపాత్ర గురించి చెప్పాల్సిన పని లేదు. ఎపిసోడ్ చివర్లో ఆమె పాడే ఒక్క పాట... వేలాదిమంది కళ్లు చెమర్చేలా చేస్తుంది. ఆ ప్రోగ్రామ్‌తో ఎంతోమందికి అభిమాన గాయనిగా మారిన సోనా మనసులోని మాటలు...

 

మీరు క్లాసికల్ సింగరా?

 అవును. కానీ స్టేజీల మీద ప్రదర్శనలివ్వడానికే నా టాలెంట్‌ని పరిమితం చేయదలచుకోలేదు. ఆల్బమ్స్ చేశాను. సినిమాల్లో పాడాను. కాన్సర్ట్స్ ఇచ్చాను. అడ్వర్టయిజ్‌మెంట్లకి కూడా స్వరమిచ్చాను.


పాటంటే ఎందుకంత ప్రేమ?

 తెలియదు. కటక్‌లోని ఓ బ్రాహ్మణ కుటుంబంలో పుట్టాను. చిన్నప్పుడే సంగీతం పట్ల ఆసక్తి ఏర్పడింది. అయితే చదువులోనూ వెనకబడలేదు. బీటెక్ పూర్తి చేసి, ఎంబీయే కూడా చేశాను. ప్యారచూట్, మెడికర్ లాంటి ఉత్పత్తులకు బ్రాండ్ మేనేజర్‌గా పని చేశాను. అయితే ఏ దారిలో సాగినా నా గమ్యం సంగీతమే అనిపించి ఇటువైపు వచ్చేశాను. జింగిల్స్‌తో ప్రారంభించాను. తర్వాత సోనీ కంపెనీ సహకారంతో ‘సోనా’ అనే ఆల్బమ్ రిలీజ్ చేశాను. ఢిల్లీ బెల్లీ, ఐ హేట్ లవ్‌స్టోరీస్, తలాష్ వంటి సినిమాలకు పాడాను.

కానీ మీరంటే ఏంటో ‘సత్యమేవ జయతే’తోనే తెలిసింది...?

 అవును. అసలా కార్యక్రమమే ఎంతో గొప్ప ఆలోచనతో చేస్తున్నది. సమాజంలో మార్పు తీసుకువచ్చే లక్ష్యంతో ఆమిర్‌ఖాన్ దాన్ని ప్రారంభించారు. ప్రతి ఎపిసోడ్ చివర్లో ఆ కాన్సెప్ట్‌తోనే ఓ పాట పెట్టాలనుకున్నారు. అది పాడే చాన్స్ నాకు దొరకడం నిజంగా నా అదృష్టం. ‘ముఝేకా బేచేగా రూపయా’ పాటయితే నన్ను స్టార్‌ని చేసేసింది.

సింగర్‌గా మీకున్న బలం ఏమిటి?

 ఫీలై పాడటం. పాటలో లీనమవడం వల్లే సత్యమేవ జయతే పాటలతో కదిలించగలిగాను. నా ఇంకో బలం... నా భర్త రామ్. తను కంపోజర్. మాకు ముంబైలో ప్రొడక్షన్ హౌస్ ఉంది. తన ప్రోత్సాహమే నన్ను ముందుకు నడిపిస్తోంది.      

Read latest Funday News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top