చివరికి నిజమే గెలిచింది!

చివరికి నిజమే గెలిచింది! - Sakshi


  చేయని నేరం

 ‘డెరిక్‌ను నిర్దోషిగా పరిగణిస్తున్నాం’ అని న్యూయార్క్ సుప్రీంకోర్టు న్యాయ మూర్తి రేమండ్ గజ్‌మన్ తీర్పు ఇవ్వడంతో డెరిక్ ముఖం వికసించింది. ఒక హత్య కేసులో జైలుపాలైన ఇరవై రెండేళ్ల తర్వాత నిర్దోషిగా బయటికి వచ్చాడు.  కోర్టు వెలుపల మీడియా అతడిని చుట్టుముట్టింది. డెరిక్ తొలిసారి పెదవి విప్పాడు. ‘పోలీసు డిటెక్టివ్ లూయీ సార్సెల్లా నన్ను ఈ కేసులో ఇరికించాడు’ అని చెప్పాడు. న్యూయార్క్ బ్రూక్లిన్ ప్రాంతంలో స్కార్సెల్లాకు ఘన చరిత్రే ఉంది. పాతికేళ్ల కెరీర్‌లో స్కార్సెల్లా వందకు పైగా హత్య కేసుల్లో నిందితులను దోషులుగా నిరూపించ గలిగాడు. అయితే, వీటిలో చాలా కేసులు అక్రమంగా బనాయించినవేననే ఆరోపణలు గుప్పుమనడంతో బ్రూక్లిన్ డిస్ట్రిక్ట్ అటార్నీ జనరల్ కెన్నెత్ థాంప్సన్ నేతృత్వంలో ఏర్పడిన రివ్యూ కమిషన్ ఆ కేసులన్నింటినీ తిరగదోడింది. డెబ్బయి కేసులను పునఃసమీక్షకు స్వీకరించింది. వాటిలో డెరిక్ హామిల్టన్ కేసు కూడా ఒకటి.

 

 ఇదీ కేసు...

 బ్రూక్లిన్‌లోని బెడ్ ఫోర్డ్ స్టైవిసెంట్ ప్రాంతంలో 1991లో  నతానియేల్ క్యాష్ అనే యువకుడిని అతడి ఇంటి వద్దనే ఎవరో కాల్చి చంపారు. అప్పుడక్కడ క్యాష్ గర్ల్‌ఫ్రెండ్ జూవెల్ స్మిత్ మాత్రమే ఉంది. ఆమె ఫిర్యాదుతో పోలీసులు రంగంలోకి దిగారు.  స్కార్సెల్లా ఆధ్వర్యంలో దర్యాప్తు మొదలైంది. ఇవేవీ తెలియని డెరిక్.. కనెక్టికట్‌లోని సెలూన్‌కు వెళ్లాడు. ఇంతలోనే ఊడిపడ్డాడు స్కార్సెల్లా. అతడిని ఈడ్చుకొచ్చి పోలీసు వాహనం లోకి ఎక్కించాడు. కోర్టులో ప్రత్యక్ష సాక్షిగా జూవెల్ స్మిత్‌ను ప్రవేశపెట్టారు. తన బాయ్‌ఫ్రెండ్‌ను కాల్చి చంపేసింది అతడేనని చెప్పిందామె. ఇంకేం, డెరిక్‌కు శిక్ష పడింది.

 

 అయితే, మూడేళ్ల కిందట పోలీసుల బలవంతం వల్లే తాను అబద్ధపు సాక్ష్యం చెప్పానంటూ జూవెల్ ఒక దినపత్రికకు  చెప్పింది. దాంతో డెరిక్ లాయర్లు పునర్విచారణకు అప్పీలు దాఖలు చేశారు. కోర్టు డెరిక్‌ను పెరోల్‌పై విడుదల చేసింది. పెరోల్‌లో ఉన్న కాలంలోనే డెరిక్ ఒక ఉద్యోగంలో చేరాడు. తన గర్ల్‌ఫ్రెండ్‌ను పెళ్లాడాడు. రెండేళ్ల కిందట ఒక కూతురికి తండ్రి కూడా అయ్యాడు. మూడేళ్ల సుదీర్ఘ విచారణ తర్వాత ఈ ఏడాది జనవరిలో నిర్దోషిగా విడుదలయ్యాడు.

Read latest Funday News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top