భగవదర్చన

భగవదర్చన


‘‘ఇదుగో వెడుతున్నాడే, ఆయన్ని చూడు’’ అన్నాడు నా మిత్రుడు.

 ‘‘ఆయన్ని చూస్తే నాకేం వస్తుంది?’’

 ‘‘చూడు, తరువాత చెపుతాను.’’

 ఇలా మేము మాట్లాడుకుంటూ వుండగా ఆయన మమ్మల్ని దాటి వెళ్లాడు. నేను చూచిందంతా ఆయన వీపునే. ఎండిన కట్టెలా దేహం. నాలుగు మూరల ధోవతి కట్టుకున్నాడు. పైన ఒక తుండుగుడ్డ. అంతే నాకు కనిపించింది.

 ‘‘చూశాను’’ అన్నాను.

 

 ‘‘ముఖం చూడలేదుగా!’’

 ‘‘వెళ్లి చూసి రమ్మంటావా?’’

 ‘‘ఎర్రగా, బుర్రగా ఎవరైనా వెడుతుంటే, అప్పుడు చెప్పకుండా చెయ్యకుండా వెళ్లి చూసి వుండేవాడివి’’ అన్నాడు మిత్రుడు ఎత్తిపొడుస్తూ.

 ‘‘చూడనందువల్ల యిప్పుడు మునిగిపోయిందేమిటి?’’

 ‘‘ఆయన ఒక వింత మనిషి!’’

 ‘‘అంటే?’’

 ‘‘ఆయనా అందరిలా ఏదో ఒక పని చేస్తున్నాడు. అయినా ఆయనలో ఏదో ఒక ప్రత్యేకత వుంది.’’

 ‘‘ఆయన చేస్తున్న పనేవిటి?’’

 ‘‘వడ్రంగం.’’

 ‘‘సరే-’’

 ‘‘పని చక్కగా చేస్తాడు. కాని యేమీ మాట్లాడడు.’’

 

 ‘‘మూగవాడా?’’

 ‘‘కాదు; మౌనం పాటిస్తాడు.’’

 మూగ కాకపోయినా, మౌనం పాటిస్తాడని వినగానే నాకు ఆశ్చర్యం కలిగింది. మాట్లాడాలనే తాపత్రయం కొద్దీ మూగవాళ్లు రకరకాల ధ్వనులు చేసి, చేతివేళ్లనే నోరుగా చేసుకుని మాట్లాడుతారు. మాట్లాడగలిగినవాడు మౌనం పాటిస్తున్నాడంటే, అది ఆశ్చర్యపడవలసిన విషయమే మరి! అందులోనూ మాటలతో యుద్ధం చేసి, పొట్ట నింపుకోవలసిన పారిశ్రామికుడు మౌనం పాటిస్తున్నాడంటే, నమ్మదగిన విషయమేనా అది?

 ‘‘అది సరే - మాట్లాడడు. పోనీ కూలి అయినా తీసుకుంటాడా? అదీ లేదా?’’

 ‘‘అందులో లోపం చెయ్యడు.’’

 ‘‘ఆయన నీకు తెలుసా?’’

 ‘‘చాలాసార్లు చూశాను. కొంచెం పరిచయం వుంది.’’

 

 ‘‘మాట్లాడడు గదా!’’

 ‘‘మాట్లాడడు. సంజ్ఞలు చేస్తాడు. వాటి ద్వారా చాలా విషయాలు చెపుతాడు. ఒక్కొక్కసారి వ్రాసి వివరిస్తాడు. ఆయన మొట్టమొదట ఒక ప్రముఖుని వద్ద మోటారు డ్రైవరుగా వుండేవాడు. నెలకు అరవై రూపాయల జీతం. మోటార్లో తీరిగ్గా కూర్చున్న వేళల్లో పట్టణత్తార్, తాయుమానవర్ మొదలైన సిద్ధుల రచనలు చదివేవాడు. ఒకసారి ఆయనా ఆయన యజమానీ మోటార్లో వెడుతూవున్నారు. ఉన్నట్టుండి ఎదురు సందులోంచి ఒక మోటారు చాలా వేగంగా రావడం, అది వాళ్ల మోటారుతో ఢీకొనడం, అందువల్ల యజమానికి బలమైన గాయం ఏర్పడడం జరిగాయి. ఆయనేమో దూరంగా వెళ్లి పడ్డాడు. ప్రజ్ఞ తప్పింది. ఇద్దర్నీ ఆసుపత్రికి తీసుకువెళ్లారు. యజమానియేమో అక్కడే మరణించాడు. డాక్టర్లు ఆయన్ని పరీక్ష చేశారు. లోపల గాని బయట గాని ఎటువంటి దెబ్బా తగలలేదు. కాని కళ్లు మాత్రం మూతలుపడే వున్నాయి.

 

 తెలివి తప్పి ఆస్పత్రిలోనే వున్నాడు. పదహారో రోజున మామూలు ప్రకారం డాక్టరు రోగుల్ని పరిశీలిస్తూ ఆయన వద్దకు వచ్చాడు. ఉన్నట్టుండీ తెలివి వచ్చింది. ఆయన లేచి కూర్చున్నాడు. డాక్టరుకేమీ బోధపడలేదు. ఆ తర్వాత కొన్ని ప్రశ్నలు వేశాడు. ‘‘ఇన్ని రోజులుగా యముడితో పోట్లాట. అది యివ్వాళ్లే ముగిసింది.’’ ఆరంగుళాల దూరం బయటికి వస్తున్న శ్వాస కుడిముక్కు ద్వారా యి్పుడు వస్తోందనీ, ఒకే సమయంలో రెండు వైపులా శ్వాస, వస్తుందా అని డాక్టర్ని అడిగాడట. డాక్టరు జవాబేమీ చెప్పకుండా వెళ్లిపోయాడు. తర్వాత ఆయన్ని యింటికి పంపించివేశారు. ‘‘ఇంటికి వచ్చిన తర్వాత మునపటిలా ఉండేవాడు కాదు. భార్యా యిద్దరు పిల్లలున్నా, వాళ్లతో మాట్లాడేవాడు కాదు. సంజ్ఞల ద్వారా మాట్లాడటం మొదలుపెట్టాడు.

 

 ఆయనకి పిచ్చెక్కిందేమో అనుకుంది భార్య. మాట్లాడడం మానివేశాడే తప్ప, ఎక్కడో జ్ఞాపకం వుందన్న మాటేగాని, పిచ్చి చేష్టలూ అవీ లేవు. భోజనం చేసేవాడు. పిల్లలతో ఆడుకునేవాడు. భార్యను చూసి నవ్వేవాడు కూడా! అయితే అది పాత నవ్వు కాకపోయినా పిచ్చినవ్వు మాత్రం కాదు. ఒక్క వారం రోజులు యింట్లో యిలా వున్నాడు. ఎనిమిదో రోజునో తొమ్మిదో రోజునో పెద్ద బజారుకి వెళ్లి వడ్రంగం సామాన్లు కొనుక్కుని వచ్చాడు. పదహారవరోజు మొదలుకొని వడ్రంగం పనికి దిగాడు. ఆనాడు పనికి వెళ్లి, మూడు రూపాయలతో ఇంటికి తిరిగి వచ్చాడు’’ అని చెప్పి మిత్రుడు నవ్వాడు. ‘‘లేచి వెళ్లి చూసివుంటే బాగుండేది’’ అన్నాను. ‘‘ఇంకో రోజు చూడు’’ అని మిత్రుడు ఏదో పనిమీద వెళ్లిపోయాడు.

 

 అప్పటినుంచీ ఆయన్ని పరీక్షగా చూడాలని బుద్ధి పుట్టింది. ఇంకో రోజు వడ్రంగం సామాన్లు పుచ్చుకుని ఆయన వీధిలో వెడుతున్నాడు. అప్పుడాయన్ని బాగా చూశాను. చెవిలో ఒక అగరువత్తి దోపుకున్నాడు. మామూలు ప్రకారం నాలుగు మూరల పంచ. రొమ్మున గంధం పూసుకున్నాడు. బుజాన తుండుగుడ్డ. ముఖం చూశాను. అంతర్ముఖుడుగా కనిపించాడు. అంతకుమించి మరేమీ కనిపించలేదు. ఆయన నన్ను చూశాడు. నేనూ ఆయన్ని చూశాను. ఆ తర్వాత ఆయన్ని వీధిలో చాలాసార్లు చూశాను. ఆయనతో నాకు పరిచయం ఏర్పడింది. నన్ను చూసినప్పుడల్లా, నవ్వకుండా వెళ్లేవాడు కాదు.

 

 ఒకరోజు మా యింటికి నాలుగో యింట్లో ఆయన పనిచేశాడు. ఆ యింటి యజమాని ఆయన్ని యిలా పొగిడాడు.

 ‘‘చాలా వింత మనిషి. న్యాయమైన కూలి అడిగాడు. వంక పెట్టేందుకు వీలు లేనంత బాగా, అందంగా పెట్టె తయారు చేశాడు. ఆయనలో వున్న చిత్రమైన గుణం మౌనం ఒక్కటే కాదు; పని మొదలు పెట్టేందుకు ముందు చెవిలో వున్న అగరు వత్తిని వెలిగిస్తాడు. అప్పుడప్పుడూ శ్వాస లోపలికి పీలుస్తాడు. శ్రద్ధగా పనిచేస్తాడు.

 

 మధ్యాహ్నం తీరిక వేళలో అర్ధ సేరు మిరపకాయలు కొని తినేవాడు. ఎప్పు డైనా కొంచెం వేణ్ణీళ్లు కావాలని సంజ్ఞ చేసేవాడు. వేణ్ణీళ్లు తాగేవాడు. ఆయన మనస్సు ఆయనలో బాగా వేళ్లు పాకి విస్తరించింది. అందువల్లనే దయ్యపుగాలి వీచినా పెట్టె పైభాగం కదలాడినా, కింది భాగం కదలనట్లుగా కనిపించేవాడు. ఈ గుణం ఆయన ప్రతి చేతిలోనూ కనిపిస్తుంది. నిజంగానే అపూర్వ వ్యక్తి!’’ఆ వడ్రంగిని గురించి నా ఆశ్చర్యం మరీ ఎక్కువయింది. ఆయన్ని గురించి యింకా తెలుసుకోవాలనే ఆశ ప్రబల మైంది. ఆయన వడ్రంగా! వేదాంతా! లేక రెండూనా! ఏమీ బోధపడలేదు.

 

 ఒకరోజు ఆయన్ని పిలిచాను, కొయ్య పని యేదో వుంది. బహుశా కూలి కొంచెం తక్కువగా అడుగుతాడేమో అనుకున్నాను. ఏమిస్తే బాగుంటుందని నేను మనసులో అనుకున్నానో, ఆయన అదే అడిగాడు. నేను ఉలిక్కిపడ్డాను. అది సబబైన కూలి. అంతేకాదు నా మనస్సుని కూడా పసి గట్టాడు. రెండు రోజులు మా యింట్లో పనిచేశాడు. నా మిత్రుడు చెప్పిన మాటల్లో ఒక్కటీ అబద్ధం కాదు. రెండవ రోజున పని పూర్తికాగానే, ఆయనకు రెండు రూపాయలు ఎక్కువగా కూలి యిచ్చాను.

 

 ఆయన డబ్బు లెక్కపెట్టుకుని, మాట్లాడిన కూలి ఎంతో అంతే తీసుకుని, ఎక్కువగా వున్న ఆ రెండు రూపాయలూ నాకు తిరిగి యిచ్చాడు. పెన్సిలూ కాగితం తీసుకురమ్మని సైగ చేశాడు. ‘వీడు ఉచితంగా ఏమీ తీసుకోడు’ అని కాగితం మీద వ్రాశాడు. ఆయనంటే నాకు భక్తి కుదిరింది. డబ్బుకోసం పనిచేస్తాడు. కాని డబ్బిస్తే వద్దంటాడు. ఆయన వైఖరి నాకు ఆశ్చర్యం కలిగించింది. ఆయన్ని ఆయన యింటికి వెళ్లి చూడాలనే ఆశ ఎందుకో ఉన్నట్టుండి కలిగింది. ‘‘మీతోపాటు మీ యింటికి వస్తాను’’ అనగానే ఆయన నవ్వుతూ సరే అన్నాడు.

 

 ఆయనతో కలిసి నేను బయలు దేరాను. దోవలో ఎవ్వరితోనూ ఆయన మాట్లాడలేదు. సరాసరి చిన్న బజార్లో ఒక పూల అంగడి వద్దకు వెళ్లి నుంచున్నాడు. అంగడివాడు రెండణాలకు పూలుకట్టి యిచ్చాడు. నేనిచ్చిన డబ్బులోంచే ఆ రెండణాలూ యిచ్చాడు. అక్కడి నుంచి గంధం అమ్మే అంగడికి వెళ్లాం. ఎనిమిదణాలకు సువాసన గంధమూ, ఒక కట్ట అగరవత్తులూ కొనుక్కుని బయలు దేరాడు. పూలకొట్టువాడూ, గంధం కొట్టువాడూ ప్రవర్తించిన తీరు చూసి, యిది అతని దినచర్య అనుకున్నాను.

 

 అక్కడి నుంచి సరాసరి ఆయన యింటికి వెళ్లాము. నిరాడంబరమైన చిలుక పంజరంలా ఉంది యిల్లు. వెళ్లీ వెళ్లగానే, ఆయన తన చేతిలో వున్న పూలను భార్యకిచ్చాడు. బదులుగా ఆమె ఒక మల్లెపువ్వు ఆయన చేతిలో వుంచింది. ఇది చూసి నేను ఆశ్చర్యపడ్డాను. బుద్ధికందని ఏదో ఒక లోకంలో ఉన్నట్టు నాకనిపించింది. భగవదర్చన అంటే... ఆ తర్వాత ఆయన ముంగిట్లో కాళ్లూ చేతులూ కడుక్కుని, అగరవత్తులూ గంధం చేతిలో మిగిలిన డబ్బూ - అన్నీ భార్య చేతికిచ్చాడు. వాటిని తీసుకుంటుంటే ఆమె ముఖం చూశాను. స్త్రీ పురుష సంబంధానికి అతీతమైన స్నేహభావం ఒకటి ఏదో నాకు కనిపించింది.

 

 ఆ తర్వాత ఆయన వీధి అరుగు వద్దకు వచ్చి, నాకు ఒక చదర వేసి, ఆయన ఒక చదర మీద కూర్చున్నాడు. ఇంతలో ఆయన భార్య రెండు గ్లాసులు మజ్జిగ తీసుకువచ్చింది. ‘‘పిల్లలున్నారా?’’ అని అడిగాను. ఆయన రెండు వేళ్లు చూపించాడు. ‘‘కనబడడం లేదే?’’ అని నేనంటూ వుండగా కవల పిల్లల మాదిరిగా వున్న యిద్దరు చెవుల్లో పూలు పెట్టుకుని అక్కడికి వచ్చారు. నేనెవరినో తెలియక పోయినా, వాళ్లు నాకు నమస్కరించి లోపలికి వెళ్లిపోయారు. నా ఆశ్చర్యానికి అంతులేదు.

 

 ఆ తర్వాత సంజ్ఞల ద్వారాను, పలక, పెన్సిలు ద్వారాను మేము చాలా విష యాలు చర్చించుకున్నాము. ఆయన చెప్పిన విషయాలన్నీ నాకు బోధపడినవని నేను చెప్పలేను. కాని నాకవన్నీ కొత్తగా కనిపించాయి. ఆయన మాత్రం ‘‘ఇందులో ఏమీ కొత్త లేదు. పువ్వు కొత్తది; చెట్టు పాతది’’ అని వ్రాశాడు. నాకది సరిగా అర్థం కాలేదు. అయినా తృప్తి కలిగింది. ఇంటికి బయలుదేరేముందు ఆయనతో ఒక సంగతి చెప్పాను. ఆయన యిచ్చిన జవాబు విని నేను దిగ్భ్రమ చెందాను.‘‘రేపు మా స్నేహితుని యింట్లో కొంచెం పనుంది. వస్తారా?’’ అని అడిగాను. ‘‘వీడు మూడు రోజుల దాకా ఎక్కడికీ కదలడు’’ అని ఆయన వ్రాశాడు.

 

 ‘‘ఎందుకు?’’

 ‘‘మూడు రోజులకు సరిపడ్డ డబ్బు చేతిలో వుంది’’ అని వ్రాశాడు ఆయన. ఆ తర్వాత నేను నోరు మెదపలేకపోయాను. ‘‘నమస్కారం’’ అంటూ సెలవు తీసుకున్నాను.

 

Read latest Funday News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Tags: 



 

Read also in:
Back to Top