ఆడంగులంతా లోపలకి వెళ్లండి...

ఆడంగులంతా లోపలకి వెళ్లండి...


‘ఇంజినీరన్నయ్యా, నాకు సెప్పకుండా డ్యామ్‌ కట్టేసి దాని పేరు సెప్పుకుని నువ్వు, నీ పేరు సెప్పుకుని నీ కొడుకులు అంతా నొక్కేద్దామనుకుంటున్నారా. నేను బతికుండగా ఆ డ్యామ్‌ పని జరగనివ్వను’’ అంటూ బ్రహ్మన్న పాత్రలో చెప్పిన డైలాగ్‌తో తెలుగుతెరకు విలన్‌గా పరిచయం చేశారు కృష్ణవంశీ. చిత్రం శ్రీఆంజనేయం. ‘ఆడంగులంతా లోపలకి వెళ్లండి... అంటూ ‘ఔనన్నా కాదన్నా’ చిత్రంలో మంగరాజు పాత్రలో ప్రేక్షకులను భయపెట్టారు. ‘ఆరున్నర కోట్లు నీ మీద పెట్టుబడి పెడుతున్నాం...’  అన్నారు నిర్మాత అట్లూరి పూర్ణచంద్రరావు... ఈ చిత్రంలో పాత్ర గురించి చెబుతూ. ౖరైల్వే ప్లాట్‌ఫారమ్‌ మీద కళాసీ అభిమానులు ‘యాక్షన్‌’ అంటూ, పిళ్లా లక్ష్మీప్రసాద్‌ చేత ముచ్చటగా ‘ఔనన్నా కాదన్నా’ డైలాగును పెద్ద గొంతులో చెప్పించుకున్నారు.



1969లో సీతన్నపేటలో ‘విషవలయం’ నాటకంలో వీధిలో హాస్యపాత్రతో రంగస్థల జీవితం ప్రారంభించి, నాటకాలలో హీరో అయ్యారు. ఆదివిష్ణు రచించిన ‘సిద్ధార్థ’ నాటకంతో రంగస్థలం మీద గుర్తింపు తెచ్చుకున్నారు. 1973లో అత్తిలి కృష్ణారావు ‘యుగసంధ్య’ నాటకాన్ని చెన్నై ఆంధ్ర క్లబ్‌లో ప్రదర్శించారు. నాటకానికి వచ్చిన సినీ ప్రముఖులందరూ ప్రశంసల జల్లులు కురిపించారు. కానీ ఒక్కరూ చలన చిత్రంలో నటించే అవకాశం ఇవ్వలేదు.ఆ నాటకానికి ప్రముఖ హాస్యనటుడు రాజబాబు వచ్చారు. ప్రసాద్‌ నటన చూసి ముచ్చటపడి, ఆయనను మెచ్చుకుని ఊరుకోకుండా, ముద్దాడారు. ‘నీకు ఎప్పటికైనా సినిమాలలో నటించే అవకాశాలు వస్తాయి. ఒక్క విషయం మాత్రం గుర్తుంచుకో. ఇక్కడ అన్నీ ఉన్నాయి. వాటికి దూరంగా ఉండు’ అని చెవిలో రహస్యంగా చెప్పిన శిలాక్షరాలను ప్రసాద్‌ ఎన్నటికీ మర్చిపోలేదు.

పిళ్లా ప్రసాద్‌లో చాలా కోణాలు ఉన్నాయి.



 రచయిత, రంగస్థల నటుడు, దర్శకుడు, రేడియో టీవీ నటుడు. ‘పిట్టలదొర’ గా వేగంగా మాట్లాడి ఉగాది పురస్కారం అందుకున్నారు.  విజయవాడలో ఉన్న రోజుల్లోనే ‘కళాభారతి’ నాటక సంస్థలో జంధ్యాలతో కలిసి పనిచేశారు. ఆయన రికమెండేషన్‌ మీదే ‘గందరగోళం’ లో నటించే అవకాశం వచ్చింది. పిళ్లా ఫొటోలు జంధ్యాల స్వయంగా సింగీతం శ్రీనివాసరావుకి పంపారు. ‘బీగరపంధ్య’ కన్నడ చిత్రంలో హాస్యనటునిగా కన్నడ తెర మీదా కనిపించారు.   సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వంలో 1980లో విడుదలైన ‘గందరగోళం’ చిత్రంలో మూడో హీరోగా నట జీవితం ప్రారంభించారు. ఆ తరువాత ‘నటన’ చిత్రంలో సెకండ్‌ హీరోగా కనిపించారు. హీరోగా రెండు చిత్రాలలో మాత్రమే కనిపించారు. అన్నవరంలో ఏదో పనిలో ఉన్న కృష్ణవంశీ ఏదో మ్యాగజైన్‌లో పిళ్లా ప్రసాద్‌ ఫొటో చూసి ‘వీడు నా ఫ్రెంyŠ , వీడిని పట్టుకోవాలి’ అనడంతో పిళ్లాప్రసాద్‌ కృష్ణవంశీ చేతికి దొరికారు. ‘శ్రీఆంజనేయం’ చిత్రంలో విలన్‌గా పరిచయం చేశారు.



అలా 2004లో సినీరంగంలోకి రీ ఎంట్రీ ఇచ్చారు. వెంటనే దర్శకులు తేజ, ‘ఔనన్నా కాదన్నా’ చిత్రంలో ప్రధాన విలన్‌ మంగరాజు పాత్ర ఇచ్చారు. విజయవాడలోనే ఉంటూ, వస్తూ వెళ్తూ సినిమాలు చేశారు. విలన్‌గా 31 సినిమాలు పూర్తి చేసుకున్నారు. మరో రెండు సినిమాలలో కనిపించనున్నారు. బుర్ర మీసాలతోను, ఎర్రబడ్డ కళ్లతోనూ, గంభీరమైన డైలాగులతో ప్రేక్షకులను భయపెట్టిన పిళ్లా ప్రసాద్, అక్కడితో ఆగకుండా ‘వంకాయ ఫ్రై’లో కామెడీ విలన్‌గా నవ్వులు పండించారు. నగరం నిద్రపోతున్న వేళ, మిర్చి, యువసేన, అసాధ్యుడు, నేను శైలజ చిత్రాలలో ప్రధానంగా కనిపించారు. 2014, 2015 ఉత్తమ విలన్‌ అవార్డులు అందుకున్నారు.

– సంభాషణ: డా. పురాణపండ వైజయంతి

Read latest Funday News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top