మనది విలన్ టైప్... అందుకే...

మనది విలన్ టైప్... అందుకే...


ఉత్తమ విలన్

ఇది నా రాజ్యమే...ఇక్కడ పగలేగానీ ప్రేమలుండవు. కక్షలేగానీ కనికరాలుండవు

 

ఒక్కసారి టైమ్‌మిషన్‌లోకి వెళ్లి 1991లో  ఆగండి. దగ్గర్లో ఉన్న థియేటర్‌లో ‘చిత్రం భళారే విచిత్రం’ సినిమా చూడండి. ఆ సినిమాలో పొట్ట చెక్కలయ్యేలా నటించే నటుల్లో జయప్రకాష్‌రెడ్డి కూడా ఉంటారు.

 ఆయన ఊత పదం ‘తూ....చ్’ ‘నీ యెంకమ్మ’లాగే బాగా పాప్‌లర్ అయింది.

 పె....ద్దగా నవ్వి...

 ‘మనది విలన్ టైప్.

 అందుకే అలా నవ్వాను.... తూ....చ్’ అనే డైలాగ్ విసురుతారు.

 

ఇంకాస్త వెనక్కి వెళ్లండి.

 సరిగ్గా 1988లో ఆగండి. ‘బ్రహ్మపుత్రుడు’ సినిమా మరొక్కసారి చూడండి.

 జయప్రకాష్ ఎస్పీగా కనిపిస్తారు. ఆయన డైలాగ్ ఒకసారి వినండి...

 ‘హ్యాండ్సప్... చేతుల్లో ఉన్నది కింద పెట్టు.

 చేతులు ముందుకు పెట్టు.

 చెడుగుడు ఆడేస్తా....’

 జయప్రకాష్‌రెడ్డి పేరుకి విలన్‌గా కనిపించినా... ఆయన డైలాగ్‌లకు భయం కంటే ముందు నవ్వే వస్తుంది. ఆయన విలనిజంలో కామెడీ అంతర్లీనమై కితకితలు పెడుతుంది. అయితే... ఇదంతా ఒకప్పటి సంగతి.

 సరిగ్గా చెప్పాలంటే... ‘ప్రేమించుకుందాంరా’ సినిమా ముందు సంగతి. ఈ సినిమా తరువాత... జయప్రకాష్‌రెడ్డిని తెర మీదే కాదు... తెర బయట చూసి కూడా భయపడ్డారు చాలా మంది!

    

జయప్రకాష్‌కు చిన్నప్పటి నుంచి నాటకాలు ఆడడం అంటే తెగ పిచ్చి. రొటీన్‌గా అయితే ‘ఇదేమి పిచ్చి? చదువుకోకపోతే ఆడుక్కు తింటావు. నాటకాలు అన్నం పెట్టవు’  అనే డైలాగు కోపంగా వినిపించాలి. కానీ ఆ ఇంట్లో మాత్రం ఎలాంటి డైలాగ్ వినిపించలేదు. జయప్రకాష్‌రెడ్డి నాన్నగారు పోలీసు అధికారి. నటుడు కూడా. ఆయనలోని నటుడు కొడుకులోని నటుడిని ఎక్కడా నిరాశ పరచలేదు.

 కొడుకుతో కలిసి స్వయంగా నాటకాలు వేశాడు ఆ తండ్రి!

 నాటకాలు వేసినంత మాత్రాన చదువును నిర్లక్ష్యం చేయలేదు జయప్రకాష్. చదువులోనూ ముందుండేవాడు. డిగ్రీ... ఆ  తరువాత టీచర్ ట్రైనింగ్... ఆ తరువాత లెక్కల మాస్టారుగా పిల్లలకు పాఠాలు చెప్పడం ప్రారంభించారు. అంతమాత్రాన... ఆయనలోని నటుడు ఊరుకుంటాడా?

 పాఠాలు పాఠాలే... నాటకాలు నాటకాలే!

    

ఒకసారి నల్లగొండలో జయప్రకాష్‌రెడ్డి బృందం ‘గప్‌చుప్’ అనే నాటకాన్ని ప్రదర్శిస్తుంది. ముఖ్య అతిథిగా వచ్చిన దాసరి నారాయణరావుకు జయప్రకాష్ నటన బాగా నచ్చింది. ఇదే విషయాన్ని రామానాయుడుతో చెప్పారు. రామానాయుడు ఈ నాటక బృందాన్ని హైదరాబాద్‌కు పిలిపించుకొని ‘గప్‌చుప్’ చూశారు. ఆయనకు కూడా జయప్రకాష్ రెడ్డి నటన బాగా నచ్చింది. అలా జయప్రకాష్‌కు ‘బ్రహ్మపుత్రుడు’ సినిమాలో నటించే అవకాశం వచ్చింది.

 

ఆ సినిమా మంచి హిట్ అయింది.

 అయితే జయప్రకాష్‌కు పెద్దగా పేరు రాలేదు. కెరీర్ ఊపందుకోలేదు.

 అటు చూస్తేనేమో... అప్పులు అంతకంతకు పెరిగి పోతున్నాయి. బాగా ఆలోచించుకున్న తరువాత... బ్యాక్ టు పెవిలియన్ అని డిసైడ్ అయ్యారు. లెక్కల మాస్టారుగా పిల్లలకు పాఠాలు చెప్పుకుంటున్నారు.

 ఆ తరువాత కొద్ది కాలానికి...

వెంకటేష్ ‘ప్రేమించుకుందాం రా’ సినిమాకు విలన్ కోసం వెదుకుతున్నారు. బాలీవుడ్‌లో ఎవరైనా ఉన్నారా? అని కూడా వెదుకుతున్నారు. రామానాయుడు మాత్రం జయప్రకాష్‌రెడ్డి పేరు చాలా గట్టిగా సూచించారు. అప్పటికి జయప్రకాష్ స్టార్ విలన్ కాదు... ఇండస్ట్రీకి దూరంగా ఉన్నారు. టైమ్ అంటే ఇదేనేమో!

 ‘‘పొరపాటున కూడా కామెడీ కనిపించకూడదు. ఔట్ అండ్ ఔట్ సీరియస్‌గా చేయాలి’’ అని చెప్పాడు డెరైక్టర్ జయంత్.

 సీరియస్‌గా కాదు... ప్రేక్షకులు వణికిపోయేలా విలనిజాన్ని ప్రదర్శించి ‘ఉత్తమ విలన్’ అనిపించుకున్నారు జయప్రకాష్. ఇక వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. అంత ఎత్తు, భారీ కాయం, పెద్ద మీసాలు... అమ్మో జయప్రకాష్‌రెడ్డి! తూ...చ్ అని తెగ నవ్వించిన జయప్రకాష్‌రెడ్డి ఎంత పెద్ద విలన్‌గా ఎదిగారు... ఎంతలా భయపెట్టారు!!

Read latest Funday News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top