దేవన్‌...ఒక కూల్‌ విలన్‌!

దేవన్‌...ఒక కూల్‌ విలన్‌!


విలన్‌లు మూడు విధములు...

1. బాడీతో భయపెట్టించే విలన్‌లు.

2. గొంతుతోనే భయపెట్టించే విలన్‌లు.

3. భయపెట్టకుండానే భయపెట్టే విలన్‌లు.




మొదటి రెండు సరే, భయపెట్టకుండానే భయపెట్టే విలన్‌ ఏమిటి? ఈ విలన్‌ను చూస్తే...భయపడ్డానికి పెద్దగా ఏమీ ఉండదు. పక్కా పెద్ద మనిషి తరహాలోనే ఉంటారు. మర్యాదను తు.చ తప్పకుండా పాటిస్తారు. కానీ చేయాల్సిన దుర్మార్గాలన్నీ చేస్తారు. చాప కింద పెట్రోలన్న మాట!‘శుభాకాంక్షలు’ సినిమాలో బలరామయ్యను చూడండి...కుటుంబసభ్యులతో ఎంత ఆప్యాయంగా ఉంటాడో! కానీ ఆ ఆప్యాయత ఎప్పటి వరకు? తన మాట వినేంత వరకే.  ఎప్పుడైనా ఎవరైనా అంతకుమించి ఆలోచిస్తే....‘చిన్నపిల్లలకు నీతికథలు చెప్పాలి తప్ప నీతి తప్పిన వాళ్ల కథలు చెప్పొద్దు’ అని కన్నెర్ర చేస్తాడు.ఇక్కడ ‘నీతి తప్పిన వాళ్లు’ అంటే నిజంగానే నీతి తప్పిన వాళ్లు కాదు. తనకు నచ్చని వాళ్లు.



అలాంటి వాళ్లను దగ్గరికి తీస్తే ‘ఈ ఇల్లు ఆరు శవాలున్న స్మశానం కాగలదు’ అని హెచ్చరించగలడు.  ఇదే  విలన్‌ ‘కాశీ’ సినిమాలో ప్రేమతో సహా ప్రతి విషయాన్ని కరెన్సీతో కొలిచే పారిశ్రామికవేత్తగా భయపెట్టించగలడు. ఇక ‘బాషా’ సినిమాలో పొగుడుతూనే వెన్నుపోటు పొడిచే కేశవ పాత్రతో భయపెట్టించగలడు.కూల్‌గా కనిపిస్తూనే వేడి పుట్టించే విలన్‌ పాత్రలకు ప్రసిద్ధుడైన దేవన్‌ డబ్బింగ్‌ సినిమాలతోనే కాదు స్ట్రెయిట్‌ చిత్రాలతో కూడా తెలుగు ప్రేక్షకులకు చేరువయ్యారు. నటులు నిర్మాతలు కావడం చూస్తుంటాం.



నిర్మాతలు నటులు కావడం అనేది మాత్రం అరుదుగానే జరుగుతుంది. దేవన్‌ మొదట నిర్మాత. ప్రేమ్‌నజీర్, మధు ప్రధాన పాత్రధారులుగా మలయాళంలో ఆయన తీసిన సినిమా ‘వెల్లమ’ బాక్సాఫీసు దగ్గర చతికిలపడటమే కాదు...ఆయన్ను ఆర్థిక సంక్షోభంలోకి నెట్టింది. దీని నుంచి బయటపడటానికి సినిమాల్లో నటించడం మొదలుపెట్టారు. కొద్దికాలం తరువాత ‘ఓజమ్‌’ అనే మలయాళం  సినిమాలో హీరోగా నటించే ఛాన్సు వచ్చింది. ఆ తరువాత అయిదారు సినిమాల్లోనూ హీరోగా నటించారు. అయితే వీటిలో  ఎక్కువ సినిమాలు విజయవంతం కాకపోవడంతో విలన్‌గా నటించడం ప్రారంభించారు. కేవలం మలయాళంలోనే కాదు తమిళ, తెలుగు సినిమాల్లోనూ ఆయన రకరకాల పాత్రలు పోషిస్తున్నారు.నటుడిగానే కాదు ‘కేరళ పీపుల్స్‌ పార్టీ’ నాయకుడిగా కూడా దేవన్‌ కేరళ రాష్ట్రంలో  ప్రసిద్ధుడు.

Read latest Funday News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top