గాజుల గలగల

గాజుల గలగల


మీరే పారిశ్రామికవేత్త

‘బంగారు గాజులు, బ్లాక్ మెటల్ గాజులు, రబ్బరు గాజులు, మట్టి గాజులు, లక్కగాజులు... ఎన్నో. కొంచెం కళాహృదయం ఉండాలే కానీ గాజులకే హారాలు అలంకరించవచ్చు. కళాపోషకులైన మహిళల మదిని ఇట్టే దోచేయవచ్చు. ఆ పని మాత్రం ఇంత వరకు మగవాళ్ల చేతిలోనే ఉండిపోయింది. కానీ మీరు తలుచుకుంటే మీ ఇంట్లోనే లక్క గాజుల తయారీ పరిశ్రమ పెట్టొచ్చు.

 

ఏమేం కావాలి: సాధారణంగా పరిశ్రమల స్థాపనకు యంత్రసామగ్రి వంటి మౌలిక వసతులు అవసరం. లక్క గాజుల పరిశ్రమకు ప్లక్కర్, కట్టర్ వంటి చిన్న సాధనాలు, ఇంట్లో ఉపయోగించే పాత్రలు ఐదారు, గాజులు ఆరబెట్టడానికి స్టాండులు, నలుగురు మహిళలు కూర్చోవడానికి వీలుగా ఉండే చిన్న గది చాలు.

 

ముడి సరుకు: అల్యూమినియం రింగులు, లెపాక్స్ ఆర్, లెపాక్స్ ఎక్స్ రసాయనాలు, వెల్‌కమ్ పౌడర్, స్టోన్స్, కుందన్స్, చమ్కీలు, చైనులు, రంగులు అవసరం.రెండు నెలలపాటు గాజులు చేయాలంటే కనీసంగా కొంత ముడిసరుకుని సిద్ధం చేసుకోవాలి. ఎంతెంత పరిమాణంలో ఉండాలో, ఎంతెంత ధరల్లో దొరుకుతాయో చూద్దాం.

 వెల్‌కమ్ పౌడర్ - 25 కిలోలు (కిలో రూ.400)

 లెపాక్స్ ఆర్ - 2 కిలోలు (కిలో 350-400)

 లెపాక్స్ ఎక్స్ - 2 కిలోలు (కిలో 350-400)

 ఐదారు రంగులు (యాభై గ్రాముల ప్యాకెట్ 50 రూపాయలు)

 

స్టోన్స్ - మూడు నాలుగు సైజులైనా తీసుకోవాలి. వాటిలో పదిరంగులుండేలా చూసుకోవాలి. ఒక్కొక్క రంగులో వంద గ్రాముల స్టోన్స్ తీసుకోవచ్చు. ధర స్టోన్ క్వాలిటీని బట్టి వందగ్రాముల ప్యాకెట్ 80 నుంచి 700 రూపాయలుంటుంది.

 చమ్కీలు - ఇవి కూడా పది రంగుల్లోవి తీసుకోవాలి. వంద గ్రాముల చమ్కీల ధర 50 రూపాయలుంటుంది.



చైన్స్ - గోల్డ్ కలర్, సిల్వర్ కలర్‌తోపాటు ఇతర రంగులలో కూడా ఉంటాయి. వీటిని కిలోల చొప్పున కొనాలి. కిలో రూ. 200 ఉంటుంది. ఒక్కో రంగు చైన్ ఒక్కో కిలో చొప్పున తీసుకోవచ్చు. గాజుల తయారీలో చైన్లు తప్పనిసరి కాదు. గాజులు మరింత ఆకర్షణీయంగా కనిపించడం కోసమే.

 

అల్యూమినియం రింగులు - సైజుల వారీగా ఒక్కొక్క సెట్. ఒక సెట్‌కి 60- 70 రింగులుంటాయి. ఒక రింగు రెండు నుంచి ఇరవై రూపాయల వరకు ఉంటుంది. ఈ రింగుల సైజ్ గాజుల సైజుల్లాగే 2.4, 2.6, 2.8 అనే మూడు సైజుల్లో ఉంటాయి.

 

ఎంత ఖర్చవుతుంది: యాభై వేల నుంచి లక్ష రూపాయల ఖర్చుతో పరిశ్రమ ప్రారంభించవచ్చు. ఈ పరిశ్రమకు కరెంటు, నిర్వహణ ఖర్చులు ఉండవు. ఈ రసాయనాలు చర్మానికిగానీ, కళ్లకుగానీ ఎలాంటి ఇబ్బందిని కలిగించవు.

 

శిక్షణ ఎలా?: రెండు నెలల పాటు శిక్షణ తీసుకోవాల్సి ఉంటుంది. ముడి సరుకు ఎక్కడ దొరుకుతుంది, అమ్మకం కేంద్రాలు,  సెట్ తయారీకి ఎంత ఖర్చు అవుతుందనే అంచనా వంటివన్నీ శిక్షణలో తెలుస్తాయి. శిక్షణ, రిజిస్ట్రేషన్ వివరాలకు 1800 123 2388 టోల్ ఫ్రీ నంబరులో సంప్రదించవచ్చు.

 ‘ఎలీప్’ సౌజన్యంతో...

 

 తయారీ ఇలా!

 లెపాక్స్ ఆర్, లెపాక్స్ ఎక్స్ రసాయనాలు బంకలాగ జిగురుగా ఉంటాయి. ఈ రెండింటినీ (వేటికవి విడిగా) వెల్‌కమ్ పౌడర్‌లో కలపాలి. కిలో లెపాక్స్‌కి నాలుగు కిలోల వెల్‌కమ్ పౌడర్ కావాల్సి ఉంటుంది. వీటిని చపాతీల పిండిలా కలుపుకోవాలి. ఈ రెండు మిశ్రమాలను (వెల్‌కమ్ పౌడర్‌లో కలిపిన లెపాక్స్ ఎక్స్, లెపాక్స్ ఆర్) కలిపి అల్యూమినియం రింగుకు అతికిస్తే గాజు తయారవుతుంది. వెంటనే (లక్క ఆరి గట్టిపడే లోపు) గాజు మీద కావల్సిన డిజైన్లలో రాళ్లు, కుందన్లు, చమ్కీలు, చైన్లు అతికించుకోవాలి.



ఇరవై నిమిషాలకు జిగురు కొంత వరకు ఆరిపోతుంది. ఆ తర్వాత కుందన్స్ వంటివి అతికించే ప్రయత్నం చేస్తే అతుకుతాయిగానీ గాజు ఆకారం చెడిపోతుంది. అందుకే పది, పదిహేను నిమిషాల లోపే పని పూర్తి చేయాలి. కుందన్స్ అతికించడం వంటి అలంకరణ అంతా అయిన తర్వాత గాజుల స్టాండుకు తగిలించి ఆరు గంటల సేపు ఆరనివ్వాలి. లక్క గట్టి పడి రాయిలా మారుతుంది. ఇక ఆ గాజు పగలదు, విరగదు. 2009 నుంచి యూనిట్ నిర్వహిస్తున్నాను, ఆసక్తి ఉన్న వారికి శిక్షణనిస్తున్నాను.

 - ఎస్.ఎమ్.జబీన్, నంద్యాల

 ఫోన్:
  9492943006

 రిపోర్టింగ్: వాకా మంజులారెడ్డి

Read latest Funday News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top