జయం తనదిరా!

జయం తనదిరా!


చెన్నైకి చెందిన  22 సంవత్సరాల జయవేల్‌కు కేంబ్రిడ్జి యూనివర్సిటీలో ‘ఆటో మొబైల్‌ ఇంజనీరింగ్‌’ చేసే అవకాశం రావడం అతిపెద్ద ఘనత కాకపోవచ్చు. అయితే ఒకప్పుడు యాచకవృత్తిలో ఉన్న ఈ కుర్రాడు, చదువులో రాణిస్తూ కేంబ్రిడ్జి వరకు వెళ్లడం కచ్చితంగా అరుదైన ఘనతే.



జయవేలు చిన్న వయసులో ఉన్నప్పుడే అతని తండ్రి చనిపోయాడు. తల్లి మద్యానికి బానిసైపోయింది. కొడుకును తీసుకొని నెల్లూరు నుంచి చెన్నైకి చేరుకుంది. కొడుకును యాచక వృత్తిలోకి దించింది. పేవ్‌మెంటే వారి ఇల్లుగా మారింది. ఏ అర్ధరాత్రో పోలీసులు అక్కడి నుంచి తరిమేసేవారు. ఇక వాన కురిస్తే...షెల్టర్‌ కోసం నానా తిప్పలు పడాల్సి వచ్చేది.

ఉమ, ముత్తురామన్‌ దంపతులు చెన్నైలోని వీధిబాలల సంక్షేమం కోసం పని చేస్తున్నారు. ‘పేవ్‌మెంట్‌ ఫ్లవర్‌’ పేరుతో వీధిబాలలపై ఒక వీడియో చిత్రాన్ని కూడా తీశారు.



తమ ప్రాజెక్ట్‌లో భాగంగా ఒకసారి చెన్నైలోని కిల్‌పాక్‌ వాటర్‌ ట్యాంక్‌  ఏరియాలోకి వెళ్లారు ఈ దంపతులు. అక్కడ యాచన చేస్తున్న ఏడుసంవత్సరాల జయవేలు కనిపించాడు.

తోటి పిల్లలతో కలసి రోజూ ట్రాఫిక్‌ సిగ్నల్స్‌ దగ్గర, ఇతర చోట్ల యాచన చేసేవాడు జయవేలు. ‘‘నువ్వు  ఈ యాచన మానేసి... బడిలో చదువుకుంటే బాగుంటుంది. నీకు మేము అన్ని విధాల అండగా ఉంటాం’’ అని హామీ ఇచ్చారు ఉమ, ముత్తురామన్‌ దంపతులు. అయితే ఈ మాటలను జయవేలు తల్లి మాత్రమే కాదు... యాచన చేసే పిల్లల తల్లిదండ్రులెవరూ నమ్మలేదు.



‘‘మన పేరు చెప్పుకొని గవర్నమెంటు వాళ్ల దగ్గర డబ్బులు వసూలు చేసి తింటారు’’ అని తిట్టుకున్నారు. అయితే  ఉమ, ముత్తురామన్‌ దంపతులు ఒకటికి రెండుసార్లు చెప్పడంతో ‘వీళ్లు నా గురించి తపన పడుతున్నారు’ అని సానుకూలంగా ఆలోచించాడు జయవేలు. బడికి వెళ్లి చదువుకోవడానికి సిద్ధమయ్యాడు. యాచనకు గుడ్‌బై చెప్పాడు. ఉమ, ముత్తురామన్‌ దంపతులు జయవేలును తమ సంరక్షణలోకి తీసుకొని తమ ‘సుయం చారిటబుల్‌ ట్రస్ట్‌’ తరఫున చదువు చెప్పించారు.



‘సుయం చారిటబుల్‌ ట్రస్ట్‌’ నిరుపేద బాలల కోసం నిర్వహిస్తున్న మోంటిస్సోరి స్కూల్‌లో జయవేలు చదువుకున్నాడు. 12 స్టాండర్డ్‌లో మంచిమార్కులతో పాసైన వేలును ఉన్నత చదువులు చదివించడానికి దాతలు ముందుకు వచ్చారు. కేంబ్రిడ్జి యూనివర్సిటీ ప్రవేశ పరీక్ష రాసి ‘పెర్‌ఫార్మెన్స్‌ కార్‌ ఎన్హాన్స్‌మెంట్‌ టెక్నాలజీ ఇంజనీరింగ్‌’లో సీటు తెచ్చుకున్నాడు జయవేలు.



‘‘నేను ఏ నేపథ్యం నుంచి వచ్చానో నాతో చదువుకునే పిల్లలందరికీ తెలుసు. పేవ్‌మెంట్‌ మీద కూర్చోవలసిన వాడిని బడిలో ఒక మూలకు కూర్చోవలసి వచ్చేది. మొదట్లో బడికి వెళ్లాలనిపించేది కాదు. అయితే చదువు వల్ల ఎంతో మంది జీవితాల్లో వచ్చిన మార్పు గురించి తెలుసుకున్న తరువాత...బడికి వెళ్లడానికి ఎప్పుడూ వెనుకంజ వేయలేదు’’ అంటాడు జయవేలు తన గతాన్ని తలచుకుంటూ.



గ్లెండూర్, వేల్స్‌ యూనివర్సిటీలో(యూకే)  ఇంజనీరింగ్‌ పూర్తి చేసిన జయవేలుకు ఆ తరువాత చదువులకు ఇటలీలోని యూనివర్సిటీ ఆఫ్‌ టురీలో సీటు వచ్చింది. జయవేలు విజయం ఎందరో వీధిబాలలకు స్ఫూర్తిగా నిలిచింది. యాచనను వదిలి కల కనడానికి ఒక అవకాశం ఏర్పడింది. జయవేలు విజయగాథ విన్న పిల్లల్లో కొద్దిమంది యాచన మానేసి చదువుకుందామనుకుంటున్నారు. పైలట్‌ కావాలని, ఇంజనీరింగ్‌ చేయాలని, డాక్టర్‌ కావాలని...ఇలా రకరకాల కలలు కంటున్నారు.



‘‘ఇక మా జీవితం ఇంతే అనుకొని యాచనకే పరిమితమయ్యే వారికి జయవేలును రోల్‌ మోడల్‌గా చూపాలనుకుంటున్నాం. కష్ట పడే వారికి మంచి భవిష్యత్తు ఉంటుందని జయవేలు విజయం నిరూపించింది’’ అంటారు ముత్తురామన్‌.తన చదువు పూర్తయిన తరువాత చెన్నైకి తిరిగి వచ్చి... ఉమ, ముత్తురామన్‌ దంపతులకు సహాయంగా ఉంటూ వీధిబాలల జీవితాల్లో వెలుగులు నింపడానికి తన వంతుగా పాటుపడాలనుకుంటున్నాడు జయవేలు.

Read latest Funday News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top