అసలేం జరిగింది! ఏం జరగబోతోంది?

అసలేం జరిగింది! ఏం జరగబోతోంది?


కామెడీ సీన్

రమణ, గిరి... ఎన్నో ఏళ్ల తర్వాత ఇంటికి వచ్చిన పార్ధూని కలుసుకుంటారు.  

పలకరింపులయ్యాక కొద్దిసేపు బాల్యస్మృతులను గుర్తు చేసుకుంటారు.

తెలిసీ తెలియని వయసులో జరిగిన ఒక పొరపాటుకు చింతిస్తారు.

పార్థుకి మాట్లాడే అవకాశం ఇవ్వకుండా గిరి, రమణ ఇద్దరే అంతా మాట్లాడేస్తారు.

ఆ సందర్భంగా ఒక సరదా సంఘటన ఇది.

 

గిరి: అలా బయటకు వెళ్లి, కాఫీ తాగి దమ్ము కొడదాం రారా!(పార్ధూతో)

పార్ధు: ఒక్క నిమిషం అత్తయ్యకు చెప్పి వస్తా!

 రమణ: ఇప్పుడు సిగరెట్లు గురించి ఆవిడకెందుకు? అనవసరం కదా!

పార్ధు: కాఫీ వరకూ చెప్పొస్తా

రమణ: అయితే ఓకే

కట్ చేస్తే...!



(చిన్న హోటల్ )

(ఈ సీన్‌లోకి ఎమ్మెస్ నారాయణ కూడా ఎంటరవుతారు. ఆ సినిమాలో ఆయన పాత్రకు పేరు లేదు. అందుకే ఈ సందర్భంగా ఆ పాత్రకు ఎంకట్రావ్ అని పేరు పెట్టాం)

 అక్కడ ఎంకట్రావ్ అప్పుడే మినపట్టు తెప్పించుకుంటాడు.

 మినపట్టు ముక్కను సాంబారులో నంచుకుని తింటూంటాడు

 ఎంకట్రావ్: (అమాయకంగా)  సాంబారు చప్పగా ఉంది!

 సర్వర్: ఒరేయ్ గ్లాస్ మార్చండి. సాంబార్ అనుకొని మంచి నీళ్లలో ముంచుకు తినేస్తున్నాడు.

 (ఇంతలో అదే హోటల్లోకి పార్ధూ, గిరి, రమణ వస్తారు...)

 గిరి: చాన్నాళ్లయిందిరా ఇక్కడకు వచ్చి

 రమణ: ఏ అప్పున్నావా..?

 

(వాళ్లు ముగ్గురూ వచ్చి ఎమ్మెస్ వెనుక టేబుల్ దగ్గర కూర్చుంటారు)

 రమణ: (పార్ధూతో) బావా!  నీకెప్పుడూ మన శేఖర్‌గాడి విషయంలో బాధనిపించలేదా?

 నాకు మాత్రం చాలా సార్లు తప్పు చేశాం అనిపించింది.

 గిరి: ఇప్పుడవన్నీ ఎందుకురా!

 (ఎంకట్రావ్ తినడం ఆపేసి మరీ వీళ్ల మాటలు వింటూ ఉంటాడు)

 రమణ: ఎందుకంటావ్ ఏంట్రా! వీడు చేసింది తప్పు కదా!

 (దోశె నోట్లో పెట్టుకోబోతూ టెన్షన్‌లో తినడం మర్చిపోతాడు)

 గిరి: మరప్పుడు చెప్పచ్చు కదా!

 రమణ: అప్పుడు నా వయసు పదేళ్లు

 గిరి: అప్పుడు ఆడి వయసూ పదేళ్లే!

 రమణ: ఎన్నయినా చెప్పరా... నువ్ అలా చేయడం మాత్రం తప్పే!

 ఎంకట్రావ్: (మధ్యలో తగులుకుంటూ) ఎలా చేయడం?

 (రమణ, గిరి వింతగా ఒకళ్ల మొహాలు, ఒకళ్లు చూసుకుంటారు)

 జీవితంతో పందెం కాయడం, అదీ పదేళ్ల వయసులో... కరెక్ట్ అంటారా?

 ఎంకట్రావ్: ఎవరి జీవితం? ఎవరు పందెం కాశారు. ఎవరి వయసు పదేళ్లు?

 రమణ: నేను ఇన్‌ఫర్మేషన్ గురించి చెప్పట్లేదు. ఫీలింగ్ గురించి చెబుతున్నా

 ఎంకట్రావ్: ఎందుకు ఫీల్ అవుతున్నావ్?

 రమణ: ఫీల్ అవ్వాల్సిన సంఘటన కాబట్టి!

 ఎంకట్రావ్: ఏంటా సంఘటన?

 గిరి: ఎందుకు సార్! పాత గాయాన్ని మళ్లీ రేపుతారు?

 ఎంకట్రావ్: ఎవరు రేపిందీ?. ఏంటా గాయం?

 రమణ: ఎప్పుడో పన్నెండు సంవత్సరాల క్రితం జరిగిన విషయం సార్ అది!

 ఎంకట్రావ్: అదే ఏంటా విషయం?

 రమణ: చెప్తే చెరిగిపోయే తప్పు కాదు సార్ అది!

 ఎంకట్రావ్: (కోపంతో ఊగిపోతూ) ఒరేయ్ అలాంటప్పుడు ఎందుకు మొదలెట్టార్రా??

 నా మానాన నేను మాడిపోయిన మసాల దోశె తింటూంటే... జ్యోతిలక్ష్మి డాన్స్ చేసినట్టు వినిపించీ వినిపించ కుండా, కనిపించీ కనిపించకుండా, చూపించీ చూపించకుండా మాట్లాడింది ఎవరు?... అసలు ఏం జరిగింది? ఏం జరుగుతోంది? ఏం జరగబోతోంది

 తెలియాలి... తెలియాలి... తెలియాలి... తెలిసి తీరాలి!

 (త్రివిక్రమ్ పంచ్ డైలాగ్స్‌కు బాగా విజిల్స్ పడటం ఈ ‘అతడు’ సినిమా నుంచే మొదలైంది. పార్ధుగా మహేశ్‌బాబు, గిరి, రమణ పాత్రల్లో గిరి, సునీల్  నటించారు.  ఇక ఎమ్మెస్ కనిపించింది ఒక్క సీన్ అయినా ఆయన చెప్పిన ఈ డైలాగ్ అందరి నోళ్లల్లో ఇప్పటికీ నానుతోంది)

 - శశాంక్ బి

Read latest Funday News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top