విషం

విషం


పట్టుకోండి చూద్దాం



కొందరు కాలంతో కలిసి ముందుంటారు.కొందరు కాలంతో పాటు ప్రయాణించ లేరు. ఎక్కడో ఆగిపోతారు. అది చాదస్తంగా కనిపించవచ్చు. అయితే... వారి వాదన వింటే మాత్రం... అందులోనూ ఎంతో కొంత సత్యం ఉందనిపిస్తుంది.‘గత కాలము మేలు వచ్చు కాలము కంటెన్‌..’ అని కూడా అనిపిస్తుంది.అరవై రెండు సంవత్సరాల సుందరానికి ఆస్తిపాస్తులకు కొదవ లేదు. అయితే ఆత్మశాంతికి మాత్రం తీవ్రమైన కొరత ఉంది.ఆ లోటు భర్తీ చేసుకోవడానికి పుస్తకాలు బాగా చదివే వాడు. మిత్రులతో ఉత్తర ప్రత్యుత్తరాలు ఎక్కువగా జరిపేవాడు. సుదీర్ఘమైన లేఖలు రాస్తూ పోస్ట్‌ చేస్తుండేవాడు.‘‘ఫోన్‌ చేసి మాట్లాడవచ్చు కదా’’ అని ఎవరైనా అంటే...‘‘అక్షరాల్లో పలికే భావాలు... మాటల్లో పలకవు’’ అనేవాడు.ఆయన మాటలు అందరికీ విచిత్రంగా అనిపించేవి.



సుందరం ఇంట్లో పని చేసే వంటవాళ్లు తరచుగా మారుతుంటారు. దీనికి రకరకాల కారణాలు ఉన్నాయి.జీతం సరిపోలేదని కొందరు...సుందరం చాదస్తం సరిపడక కొందరు...సుందరం లెక్చర్లు వినలేక కొందరు... పని మానేసేవాళ్లు.‘వంట చేయుటకు వ్యక్తి కావలెను’ అనే ప్రకటన కూడా పేపర్లో ఇచ్చేవాడు సుందరం.దీంతో... ఎక్కడెక్కడి నుంచో వంటవాళ్లు వచ్చి చేరేవారు.శీనయ్య అనే వంటగాడు కొత్తగా పనిలో చేరాడు.శీనయ్య ఏ వంట అయినా సరే... అద్భుతంగా చేస్తాడు. ‘ఆహా’ అనిపిస్తాడు. మరో విశేషం ఏమిటంటే... శీనయ్యకు పద్యాల మీద మంచి పట్టు ఉంది. తాత తనకు చిన్నప్పుడు ఎన్నో పద్యాలు నేర్పించాడు.సాహిత్యం అంటే ఇష్టపడే సుందరానికి శీనయ్య చేసే వంటతో పాటు పద్యాలు కూడా ఇష్టం.గంటలకు గంటలు పద్యాల గురించి వాళ్లు మాట్లాడుకునేవాళ్లు.‘‘అబ్బ... ఇన్నాళ్లకు సుందరాన్ని తట్టుకొనే వ్యక్తి దొరికాడు’’ అనుకున్నారు చుట్టుపక్కల వాళ్లు.



సుందరానికి ఆస్తి తగాదాలు కూడా ఉండడంతో తరచుగా కోర్టుల చుట్టూ తిరుగుతుండేవాడు.‘నా వాళ్లే నన్ను మోసం చేస్తున్నారు’‘నా అనుకునేవాళ్లే నన్ను శవంగా మార్చడానికి ప్రయత్నిస్తున్నారు’ శీనయ్యతో అంటూ బాధ పడేవాడు సుందరం.కానీ వివరాలేమీ చెప్పేవాడు కాదు.‘అయ్యా... ఈ ఆస్తి తగాదాలేమిటి? మీకు ఎవరితో శతృత్వం ఉంది?’లాంటి ప్రశ్నలేమీ అడిగేవాడు కాదు శీనయ్య.‘బాధపడకండయ్యా... అన్నీ సర్దుకుంటాయి’ అని మాత్రం ధైర్యం చెప్పేవాడు.‘నిన్ను ఆ దేవుడే నా దగ్గరకు పంపిచాడురా’ అంటుండేవాడు సుందరం.



సుందరయ్య చనిపోయాడనే వార్త గుప్పుమంది. సుందరంపై విషప్రయోగం జరిగిందని చెప్పారు వైద్యులు. ఇన్‌స్పెక్టర్‌ నరసింహ, శీనయ్యను విచారించాడు.ఆ విచారణలో శీనయ్య చెప్పిన విషయాలు...లంచ్‌ తరువాత సుందరంగారు ఒక పెద్ద ఉత్తరం రాశారు. ∙కవర్‌పై అంటించడానికి స్టాంపులు కావాలంటే తెచ్చి ఇచ్చాను. ∙కవర్‌కు స్టాంపులు అంటించిన తరువాత... పోస్టాఫీసులో ఉన్న పెద్ద పోస్ట్‌బాక్స్‌లో వేసి రమ్మన్నారు. ∙పోస్టాఫీసు నుంచి తిరిగి వచ్చిన తరువాత చూస్తే... సుందరంగారు చనిపోయి ఉన్నారు.సుందరం తీసుకున్న ఆహారం, నీళ్లు... ఎక్కడా కూడా విషం జాడ కనిపించలేదు. పాయిజన్‌ బాటిల్‌ కూడా ఎక్కడా కనిపించలేదు. మరోవైపు చూస్తే... విషప్రభావం వల్లే సుందరం చనిపోయాడని వైద్యులు చెబుతున్నారు.



అసలేం జరిగింది? అద్దంలో ఆన్సర్‌

విషం పూసిన స్టాంపులను సుందరానికి ఇచ్చాడు శీనయ్య.  ఆ స్టాంపులను అంటించడానికి తడి కోసం నాలుకకు తగిలించుకున్నాడు సుందరం. కొద్దిసేపట్లోనే... విషం ఒంట్లో చేరింది. సుందరం చనిపోయాడు. సుందరం శత్రువులే శీనయ్యతో ఈ పని చేయించారు.

Read latest Funday News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top