సామాన్లు మోస్తుంది

సామాన్లు  మోస్తుంది - Sakshi


ఫ్యూచర్ టెక్

యుద్ధావసరాల్లో నిఘా కోసం ఉపయోగపడుతున్న డ్రోన్స్‌ను మానవాళికి సౌకర్యాలుగా, సదుపాయాలుగా  ఉపయోగించుకొనే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ‘అన్‌మ్యాన్డ్ ఏరియల్ వెహికల్స్’ లేదా ‘డ్రోన్స్’అనే ఈ రోబోటిక్ టెక్నాలజీ సామాజిక జీవనానికి అనుసంధానం కాబోతోంది.ఇటీవల బ్రెజిల్ వేదికగా జరిగిన ఫిఫా వరల్డ్‌క్‌ప్ పోటీల్లో  కెమెరాలను అటాచ్ చేసిన డ్రోన్స్ మైదానాల్లో విహరించాయి.



ఇవి ప్రేక్షకులకు కొత్త అనుభూతినిచ్చాయి. డ్రోన్స్ ప్రస్థానం ఇంతటితో ఆగిపోవడం లేదు. ఇ-కామర్స్ దిగ్గజం అమెజాన్‌డాట్‌కామ్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్ ఏడాది కిందట డ్రోన్స్ ద్వారా వస్తువులను డెలివరీ చేస్తామని ప్రకటించారు. ఆన్‌లైన్‌లో అర్డర్ చేసే వస్తువులను ఈ ఏరియల్ సర్వీస్ ద్వారా డెలివరీ చేస్తామని వివరించారు. టెక్ జెయింట్స్ గూగుల్, ఫేస్‌బుక్ కూడా డ్రోన్స్ ద్వారా ఇంటర్నెట్ సేవలు విస్తృతపరిచే ఆలోచనలో ఉన్నాయి.



ఇంట్లో ఒక మూలనున్న రౌటర్ కొంత పరిధిలో ఉన్న డివైజ్‌లకు వైఫై మాధ్యమంగా ఇంటర్నెట్‌ను అందించినట్టుగా... ఆకాశంలో కొంతపైన విహరించే డ్రోన్‌ల నుంచి ఇంటర్నెట్ సిగ్నల్స్‌ను అందించాలనే లక్ష్యంతో ఈ సంస్థల ఆధ్వర్యంలో పరిశోధనలు జరుగుతున్నాయి. ఇప్పటి వరకూ ప్రపంచంలో చాలా ప్రాంతాలకు అధునాతనతరం ఇంటర్నెట్ సేవలు అందుబాటులో లేవు. ఈ సమస్యకు డ్రోన్స్ మంచి పరిష్కారం కాగలవు. ఫేస్‌బుక్ డ్రోన్స్ మొదటగా భారత్‌లోనే అందుబాటులోకి వచ్చేలా భారత్, ఫేస్‌బుక్‌ల మధ్య ఒప్పందం కూడా కుదిరింది.

 

జపాన్‌లో పంటలకు క్రిమిసంహారక మందులను స్ప్రే చేయడానికి యమహా మోటార్ కార్పొరేషన్ హెలికాప్టర్ స్టైల్ డ్రోన్స్‌ను తయారు చేసింది. ఆర్కియాలజీ రంగంలో కూడా వీటి ప్రాధాన్యతను గుర్తించారు. మనిషి ప్రవేశించలేని చోటికి డ్రోన్స్‌ను పంపి పరిశోధనలను పూర్తి చేసుకొనే అవకాశం ఉంటుంది. గాల్లో విహరిస్తూ వచ్చే డ్రోన్స్ వల్ల ట్రాఫిక్, ప్రయాణ ప్రయాసలు తగ్గిపోతాయి. ఇంటర్నెట్ సేవలను విస్తృతం చేయడం వల్ల మారుమూల ప్రాంతాలకు కూడా సదుపాయం కలుగుతుంది. ఇలా భవిష్యత్తులో డ్రోన్స్ తమ సేవలతో చాలా ప్రాధాన్యతను సంతరించుకొనేలా ఉన్నాయి.

Read latest Funday News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top