వాయనం: ఫర్నిచర్ కొంటున్నారా?

వాయనం:  ఫర్నిచర్ కొంటున్నారా?


ఒంటికి వాడే వి కొనేటప్పుడు మన ఇష్టానికే ప్రాధాన్యం ఇస్తాం కానీ ఇంటికి సంబంధించినవి కొనేటప్పుడు మాత్రం ఇష్టాయిష్టాలతో పాటు మరికొన్ని విషయాలు కూడా గుర్తు పెట్టుకోవాలి. ముఖ్యంగా ఫర్నిచర్ విషయంలో!   సొంత ఇల్లు అయితే ఫర్వాలేదు... ఫర్నిచర్‌ని కదల్చాల్సిన పని ఉండదు. కానీ అద్దె ఇల్లు అయితే మారినప్పుడు కష్టమవుతుంది. అందుకే అద్దె ఇళ్లలో ఉండేవారయితే కాస్త తేలికపాటివి కొనుక్కోవడమే మంచిది.  కలపవి కొనేట్లయితే అది ఎలాంటి కలప, ఎంతవరకు మన్నుతుంది వంటివి తెలుసుకోవాలి. ఇనుము తదితర లోహాలతో చేసినవి అయితే... అది ఏ లోహం, తుప్పు పడుతుందా వంటివి చూసుకోవాలి. కాలం గడిచేకొద్దీ వాటిలో ఎలాంటి మార్పులు రావచ్చో తెలుసుకోవడం మంచిది.

 

  ఫర్నిచర్ మెటీరియల్‌ని బట్టి... వాటిని శుభ్రం చేసే విధానాన్ని అడగడం మర్చిపోకూడదు.   ఏ వస్తువు కొన్నా, ఒక్కచోట చూసి కొనేయకుండా, నాలుగైదు చోట్ల రేట్లు వాకబు చేసి కొనుక్కోవడం లాభకరం!   ఫర్నిచర్‌ని ఆన్‌లైన్‌లో కొనకపోవడం మంచిది. ఎందుకంటే... పొరపాటున ఏదైనా తేడా ఉంటే దాన్ని తిప్పి పంపడం, మళ్లీ మరో సెట్ వచ్చేవరకూ ఎదురు చూడటం... వీటన్నిటికీ బోలెడంత టైమ్ వేస్టవుతుంది. అదేదో షాపుకెళ్లి మనకి నచ్చింది సెలెక్ట్ చేసుకుంటే ఒక్కసారికి పనైపోతుంది.

 

 మొక్కజొన్న... ఒలవండిలా!

 ప్రపంచమే మెచ్చిన పౌష్టికాహారం... మొక్కజొన్న. దీనిలో ఉండే ఫైబర్ ఆరోగ్యానికి ఎంతో మంచిది. కొలెస్ట్రాల్ పెరగకుండా చేస్తుంది. మధుమేహం, గుండె జబ్బులు రాకుండా కాపాడుతుంది. ఇన్ని ఉపయోగాలున్నాయి కాబట్టే మొక్కజొన్నని వీలైనంత ఎక్కువగా తినమని వైద్యులు చెబుతుంటారు. తినడం మనకూ ఇష్టమే. కానీ దాన్ని ఒలుచుకోవడమే పెద్ద పని. ఈ మధ్య ఒలిచిన గింజలు కూడా దొరుకుతున్నాయి గానీ ప్రతిసారీ అవి అందుబాటులో ఉండాలి కదా! అందుకే ‘కార్న్ స్ట్రిప్పర్’ని కొనుక్కోవడం బెటర్. కంప్యూటర్ మౌస్‌లా ఉండే ఈ చిన్ని యంత్రం... మొక్కజొన్న గింజల్ని ఇదిగో, ఇంత తేలిగ్గా ఒలిచి పెట్టేస్తుంది మనకి. అసలు ధర 500 రూపాయలు. ఆన్‌లైన్‌లో అయితే రెండు మూడొంద ల్లో కూడా వచ్చేస్తోంది!

 

 ప్లాస్టిక్ సీసాతో ఫ్లవర్‌వాజ్!

 ఇంటిని అందంగా అలంకరించుకోవాలని అందరికీ ఉంటుంది. కానీ ఫ్లవర్‌వాజులు, ప్లాస్టిక్ పూలు, వాల్ హ్యాంగింగ్స్ అంటూ ఖర్చు పెట్టడం కాస్త తలకు మించిన భారమే. అలాంటప్పుడు ఇంట్లో ఉండే పనికిరాని వస్తువులతో అలంకరణ సామగ్రిని తయారు చేసుకోవచ్చు కదా! అదేం పెద్ద కష్టం కూడా కాదు. కావాలంటే ప్లాస్టిక్ సీసాతో ఇలా ఫ్లవర్‌వాజ్ చేసి చూడండి... మీకే అర్థమైపోతుంది ఎంత ఈజీయో!

 

 ఖాళీ అయిపోయిన అర లీటరు కూల్‌డ్రింక్ బాటిల్‌ను శుభ్రంగా కడిగి ఆరబెట్టుకోవాలి. తరువాత దాన్ని మధ్యకు కట్ చేయాలి. అడుగున కొంతమేర వదిలేసి, మిగిలిన భాగాన్ని పొడవుగా కత్తిరించుకోవాలి (ఫొటో చూడండి). ఇప్పుడు బాటిల్‌ని తిరగేసి, నేలమీద పెట్టి గట్టిగా నొక్కితే, కత్తిరించిన ముక్కలన్నీ వెనక్కి వంగి పువ్వులా అవుతాయి. ఆపైన ఒక్కో ముక్కనీ ఫొటోలో చూపినట్టుగా క్రాస్‌గా సగానికి మడవాలి. అంతే... అందమైన ఫ్లవర్‌వాజ్ రెడీ. ఇందులో మీకు నచ్చిన పూలను అమర్చి టేబుల్ మీద పెడితే సూపర్‌గా ఉంటుంది!

Read latest Funday News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top