మరో ప్రపంచం!

మరో ప్రపంచం! - Sakshi


ఇంటికి రంగు అందరూ వేసుకుంటారు. కాకపోతే ఏ ఊళ్లోనూ అందరి ఇళ్లూ ఒకే రంగులో ఉండవు. కానీ ‘టైబెలె’ గ్రామంలో అలా కాదు. అన్ని ఇళ్లకీ ఒకేలాంటి రంగులు వేస్తారు. ఒకే డిజైన్ వేస్తారు. ఇళ్లకే కాదు... దుకాణాలకి, నూతులకి, చప్టాలకి... అన్నిటికీ అవే రంగులు, అదే డిజైన్. దాంతో ఆ ఊరు ఓ పెద్ద వర్ణచిత్రంలా ఉంటుంది. అదే దాన్ని ప్రముఖ టూరిస్టు ప్రాంతంగా మార్చింది. పశ్చిమ ఆఫ్రికాలోని ఓ బుల్లి దేశం బకీనా ఫాసో. పేదరికం తాండవించే ఈ దేశం సాంస్కృతికంగా మాత్రం సంపన్న దేశం. ఈ దేశంలో మౌఖిక సాహిత్యానికి ఉన్న గుర్తింపు అంతా ఇంతా కాదు. లిటరేచర్  పుస్తకాల్లో కాదు, అక్కడివారి నాలుకల మీదే ఉంటుంది. ఏ వ్యక్తిని కదిలించినా ఒక పాటో, కథో వినిపిస్తారు.

 

 గతంలో ఈ దేశం పేరు ‘వుప్పర్ వోల్టో’. 1980లో ‘బకీనా ఫాసో’గా మారింది. అంటే ‘గౌరవనీయ వ్యక్తుల దేశం’ అని అర్థం. అలాంటి బకీనా ఫాసో బహుముఖ సాంస్కృతిక వికాసానికి పట్టుకొమ్మ... ‘టైబెలె’ గ్రామం!‘బకీనా ఫాసో’లోని ‘పో’ పట్టణానికి ఈశాన్యంగా 30 కిలోమీటర్లు పయనిస్తే టైబెలె అనే ఊరికి  చేరుకుంటాం. ఆ ఊరిలో ప్రతి ఇల్లూ ఒక కాన్వాసే! ప్రతి గృహమూ ఒక కళాక్షేత్రమే!టైబెలెలో కసెన తెగ ప్రజలు నివసిస్తారు. వీరు సంప్రదాయ కళలు, నిర్మాణ విజ్ఞానానికి పేరుగాంచినవాళ్లు. అందుకే వారి ఇళ్ల గోడలు... నిలువెత్తు కళాదృశ్యాలుగా మారిపోయాయి.



ప్రతి ఇంటి గోడ మీదా చక్కని రంగులతో వేసిన డిజైన్ కనిపిస్తుంది. ఇది కళ్లకు ఎంతో అందంగాను, మనసుకు ఆహ్లాదం గాను అనిపిస్తుంది. ఇలా ఇంటిని  కళామయం చేసే సంప్రదాయానికి 16వ శతాబ్దంలోనే అక్కడ పునాది పడింది. స్థానికంగా దొరికే మట్టి, పేడ, కలప, గడ్డి మొదలైన వాటితో ఇళ్లను అందమైన చిత్రాలుగా మారుస్తున్నారు కసెన తెగ మహిళలు. ఇలా రంగులు వేయడం వల్ల దుష్టశక్తులు దరిచేరవని వారి నమ్మకం!

 

 నడిపేది నమ్మకాలే!

కసెన తెగవారికి నమ్మకాలు చాలా ఎక్కువ. మనకు అవి కాస్త వింతగా అనిపించవచ్చు కాని వాళ్లు వాటిని ఎంతో నిష్టగా ఫాలో అవుతారు. వాళ్లు మూడు రకాల ఇళ్లు కడతారు. భార్యాభర్తలు వారి పిల్లల కోసం కట్టుకొనే ఇళ్లు, పెళ్లి కాని వారి కోసం కట్టిన ఇళ్లు, వృద్ధులకు  మరో రకమైన ఇళ్లు. మొదట తల్లిదండ్రులు, పిల్లలు కలిసి జీవిస్తారు. యవ్వనంలోకి వచ్చాక పిల్లలకు వేరే ఇల్లు కట్టి పంపేస్తారు. పెళ్లిళ్లు అయ్యేవరకూ వాళ్లు అలానే ఉండాలి. వయసు మీద పడిన తర్వాత వృద్ధుల నివాసంలోకి వెళ్లాలి.  

 అలాగే వీరు కొత్తగా ఇల్లు కట్టి, దాన్ని కళాత్మకంగా ముస్తాబు చేయగానే అందు లోకి వెళ్లరు. బయట కొన్ని రోజులు నిరీక్షి స్తారు. తమ ఇంటికి దేవుడి ఆశీస్సులు  ఉన్నాయో లేదో తెలుసుకోవడానికే ఈ నిరీక్షణ.

 


ఒక బల్లి రావాలి. ఆ ఇంటి గోడల మీద పాకాలి. అప్పుడు దైవం ఆశీస్సులు లభించినట్లు భావించి, గృహప్రవేశం చేస్తారు. ఎన్ని రోజులు గడిచినా బల్లి కనిపించకపోతే ఆ ఇంటిని కూల్చివేస్తారు తప్ప, అందులో నివసించరు.అక్కడ పర్యాటకులకూ కొన్ని షరతులుంటాయి. ఎవరూ ఎరుపు రంగు దుస్తులు ధరించడం కానీ, గొడుగు పట్టు కోవడంగానీ చేయకూడదు. అవి ఆ ఊరి పెద్దమనుషులు మాత్రమే వాడాలి.ఇవీ టైబెలె ప్రత్యేకతలు. బతకడం వేరు, కళాత్మకంగా బతకడం వేరు. రెండో దానికి పరిపూర్ణ న్యాయం చేసింది టైబెలె. అందుకే యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ లిస్ట్‌లో చోటు సంపాదించుకుంది.      

Read latest Funday News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top