ఆ రోజు వాళ్లు నన్ను కొడతారనుకున్నా!

ఆ రోజు వాళ్లు నన్ను కొడతారనుకున్నా!


సంభాషణం: సినిమాల్లో నెగిటివ్‌రోల్స్ చేసేవాళ్లకు తక్కువేమీ లేదు. కానీ చూడగానే గుండె ఝల్లుమనిపించేలా నటించేవాళ్లు కొందరే ఉంటారు. అమిత్‌కుమార్ తివారీ ఆ కోవకు చెందిన నటుడే. సూపర్, అనుకోకుండా ఒకరోజు, యువసేన, రాఖీ, విక్రమార్కుడు తదితర చిత్రాల్లో క్రూరమైన పాత్రల్లో నటించి మెప్పించిన అమిత్ తన గురించి, తన కెరీర్ గురించి చెబుతోన్న విశేషాలు...

 

 సినిమాల్లో ఆడపిల్లలను వేధిస్తుంటాను కదా, అందుకే నా భార్య ఎలా ఉంటుందో తెలుసుకోవాలనుకుంటారు చాలామంది. నేను సినిమాల్లోనే శాడిస్ట్‌ని. బయట చాలా సాఫ్ట్, కూల్. ఆ విషయం పూజకి బాగా తెలుసు. అందుకే నన్ను ప్రేమించింది. తను ముంబై అమ్మాయి. పెళ్లికి పదేళ్ల ముందు నుంచే మాకు పరిచయం ఉంది. ఇష్టపడి పెళ్లి చేసుకున్నాం. మాకిప్పుడో బాబు... విరాన్ష్ (2). అర్థం చేసుకునే భార్య, ముద్దొచ్చే కొడుకు... లైఫ్ హ్యాపీగా ఉంది!

 

  మీ సినీ ప్రయాణం ఎలా మొదలైంది?

 చిన్నప్పట్నుంచీ సినిమాలంటే పిచ్చి. కానీ నాన్నేమో... ముందు చదువు, తర్వాతే సినిమాలు అన్నారు. దాంతో డిగ్రీ అయ్యేవరకూ ఓపిక పట్టాను. ఆ తర్వాత ‘కల’ సినిమా కోసం ఆడిషన్స్ జరుగుతున్నాయని తెలిసి ఫొటోలు పంపించాను. అవి నచ్చడంతో డెరైక్టర్ నన్ను ముంబై నుంచి హైదరాబాద్ రప్పించారు. సెలెక్ట్ అవడంతో నటుడినైపోయాను.



ముంబై అంటున్నారు... మీరు తెలుగువారు కాదా?

అచ్చమైన తెలుగువాడినే. కాకపోతే నాన్నగారి చిన్నప్పుడే మా కుటుంబం ముంబై వెళ్లి స్థిరపడింది. దాంతో నేను అక్కడే పుట్టాను, అక్కడే పెరిగాను.



నెగిటివ్ రోల్స్ ఎందుకెంచుకున్నారు?

నేను ఎంచుకోలేదు. ‘కల’ సెలెక్షన్స్ అప్పుడు నా పొడవాటి జుత్తు, గడ్డం చూసి నెగిటివ్ రోల్‌కి తీసుకున్నారు. ఆ తర్వాత అలాంటి పాత్రలే వచ్చాయి.



 బ్రేక్ ఇచ్చిన సినిమా?

 విక్రమార్కుడు. మొదటి సినిమా తర్వాత మూడేళ్లపాటు చాలా సినిమాలు చేశాను. గుర్తింపు వచ్చింది కానీ బ్రేక్ రాలేదు. కానీ ‘విక్రమార్కుడు’ నా కెరీర్‌నే మార్చేసింది.



మిమ్మల్ని ప్రతినాయకుడిలా చూసినప్పుడు మీ ఇంట్లోవాళ్ల రియాక్షన్?

 మొదట షాకైపోయారు. అమ్మయితే... అదేంట్రా అలా చేశావ్ అంటూ బాధపడిపోయింది. సర్ది చెప్పడంతో ఊరుకుంది. తర్వాత అందరూ అలవాటు పడ్డారు. కానీ హీరో నన్ను అంతం చేసే సీన్ చూసినప్పుడు మాత్రం ఏడ్చేస్తుంటారు.



బయటికెళ్లినప్పుడు జనాల స్పందన..?

 బయటికెళ్తే నన్ను చూసి అందరూ ఎలా రియాక్టవుతారో అన్న ఫీలింగ్ మొదట్లో ఉండేది. టీమ్‌తో కలిసి థియేటర్లో ‘విక్రమార్కుడు’ చూడ్డానికి వెళ్లా.  సినిమాలో నేను చచ్చిపోగానే పక్కనే ఉన్న పదిమంది కుర్రాళ్లు లేచి చప్పట్లు కొడుతూ, నా పాత్రను బూతులు తిడుతూ ఉన్నారు. దాంతో భయమేసి ముఖం కప్పుకున్నాను. ఏమయ్యిందని రాజమౌళి అడిగితే, బయటికెళ్లాక వాళ్లు నన్ను కొడతారేమో సార్ అన్నాను. అప్పుడాయన... ‘వాళ్లు తిట్టేది నీ పాత్రని. అంతగా రియాక్ట్ అవుతున్నారంటే నువ్వంత బాగా నటించావని అర్థం. బయటికెళ్లాక వాళ్లే ఆ మాట చెప్తారు చూడు’ అన్నారు. నిజంగా అలానే జరిగింది. అందరూ వచ్చి చాలా బాగా చేశానని చెబుతుంటే సంతోషమేసింది. మేం చేసేది నటన అని, సినిమాకే పరి మితమనే విజ్ఞత ప్రేక్షకులకు ఉంది.



కానీ సినిమాల్లో ఇంతటి క్రూరత్వాన్ని చూపించడం అవసరమా? అలాంటి పాత్రలు ప్రేక్షకుల మీద చెడు ప్రభావాన్ని చూపించవంటారా?

 అలా ఎందుకనుకోవాలి! ‘రాఖీ’లో నేను చేసిన పాత్రనే తీసుకోండి. అది కల్పిత పాత్ర కాదు. విజయవాడలో ఒకడు ఒకమ్మాయి పట్ల అంత దారుణానికి ఒడిగట్టాడు. దానినే సినిమాలో పెట్టారు కృష్ణవంశీ. ఎందుకని! ఇలాంటివాళ్లు సమాజంలో ఉన్నారు, జాగ్రత్తగా ఉండండి అని చెప్పడానికి. ఇలా జరిగే ప్రమాదం ఉంది జాగ్రత్త అని చెప్పడానికి మా పాత్రలు ఉపయోగపడుతున్నందుకు నాకు ఆనందంగానే ఉంటుంది.



కానీ అవే చేసి చేసి బోర్ కొట్టట్లేదా?

 ఒక్కోసారి అదే అనిపిస్తుంది. కానీ అందరూ నాకు అలాంటివే ఇస్తున్నారు. నాకేమో పాజిటివ్ రోల్స్ కూడా చేయాలని ఉంది. నేను కామెడీని కూడా పండించగలనని నా నమ్మకం. కానీ ఎవ్వరూ అలా ఆలోచించడం లేదు. త్రివిక్రమ్‌గారు మాత్రం తన ప్రతి సినిమాలోనూ నన్ను కాస్త కొత్తగా చూపించాలని ప్రయత్నిస్తుంటారు. అందుకాయనకు థ్యాంక్స్ చెప్పాలి.



నెగిటివ్ రోల్స్ చేసేవాళ్లు చాలామంది ఉన్నారు. పోటీ పెరిగిపోలేదా?

 ఎవరి టాలెంట్‌కి తగ్గ పాత్రలు వారికి వస్తాయి. పోటీ పడాల్సిన అవసరం లేదు. అయినా నేనెవరితోనూ పోటీ పడను. నాకు నేనే పోటీ. దాదాపుగా ఒకేలాంటి పాత్రలొచ్చినా ప్రతి సినిమాలోనూ ఏదైనా కొత్తగా చేద్దామని ప్రయత్నిస్తుంటాను.



నటన కాకుండా ఇంకేమైనా...?

 మ్యూజిక్ అంటే నాకు చాలా ఇష్టం. బాగా పాడతాను కూడా. నా ఫ్రెండ్సందరూ సినిమాల్లో పాడొచ్చు కదా అంటుంటారు. అవకాశం వస్తే తప్పక ట్రై చేస్తాను.



భవిష్యత్ ప్రణాళికలు...?

 ప్రస్తుతానికి మనసంతా నటన మీదే. చాలెంజింగ్ రోల్స్ చేసి మెప్పించాలి.  సమాజానికి కూడా ఏదైనా చేయాలని ఉంది. ముఖ్యంగా బాల కార్మికుల్ని చూస్తే బాధేస్తుంది. అలాంటి పిల్లలకు సాయపడాలి. కాకపోతే దానికి కాస్త టైమ్ పడుతుంది. కెరీర్‌లో అనుకున్నది సాధించాక... దానిమీద దృష్టి పెడతాను!

 - సమీర నేలపూడి

Read latest Funday News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top