ఆకాశమంత!

ఆకాశమంత! - Sakshi


ఆదర్శం

కొందరు... ఆకాశమంత అవకాశం ఉన్నా... అణువంతైనా ఆత్మవిశ్వాసం లేక వెన్ను చూపుతారు.

 మరికొందరు... అణువంత అవకాశం దొరికినా...

 ఆకాశమంత ఆత్మవిశ్వాసంతో ముందుకు దూసుకెళతారు


 

ఢిల్లీలోని లజ్‌పత్ నగర్.

ఎర్రటి ఎండలో ఒక అమ్మాయి బెలూన్లు పట్టుకొని ఒక మూల నిల్చుంది. ఆమె ముఖంపై యాసిడ్ మచ్చలు కనిపిస్తున్నాయి. ఆ కళ్లలో ఏదో అవ్యక్త బాధ కొట్టవచ్చినట్లు కనిపిస్తుంది.

  ఆ దారిన వెళుతున్న ఆకాశ్ భరద్వాజ్ ఆమెను చూసి ఆగిపోయాడు.

 ‘‘ఏం జరిగింది?’’ అని ఆమెను అడిగాడు.

 బాధలో ఉన్నవారి దగ్గరికి ఎవరో వచ్చి ‘ఏమైంది?’ ‘ముఖం మీద ఆ  మచ్చలు ఏమిటి?’లాంటి ప్రశ్నలు వేస్తే చిరాకుగా ఉంటుంది. అయితే ఆమె అలా చిరాకు పడలేదు. ఆకాశ్‌ను చూస్తే తోబుట్టువును చూసినట్లు అనిపించింది. అందుకే మనసు విప్పి   మాట్లాడింది....

 

కొంతకాలం క్రితం...పొరుగింటి కుర్రాడు ఆమెపై యాసిడ్ దాడి చేశాడు. కంటికి రెప్పలా చూసుకోవాల్సిన భర్త ఇదే అదనుగా భార్యను విడిచి ఎక్కడికో పారిపోయాడు.

 ఆమెకు ఇద్దరు పిల్లలు. యాసిడ్ దాడికి ముందు ఆమె ఒక మాల్‌లో సెక్యూరిటీ ఇన్‌చార్జీగా పని చేసేది. అయితే యాసిడ్ దాడి తరువాత ఈ మాల్‌లోనే కాదు... ఎక్కడా ఆమెకు ఉద్యోగం దొరకలేదు. తాను చేసిన పాపం ఏమిటి? తోడు నీడగా ఉండాల్సిన భర్త ఎందుకు పారిపోయాడు?

 ఊరడించాల్సిన ఇరుగు పొరుగు ఎందుకు ముఖం చాటేస్తున్నారు?

 

అన్ని ప్రశ్నలే... ఏ ప్రశ్నకు తన దగ్గర స్పష్టమైన సమాధానం లేదు. బతకడానికి ఏ దారీ కనిపించడం లేదు. ఈ పరిస్థితుల్లోనే తన  ఇద్దరు పిల్లల్ని పోషించడం కోసం ఇల్లు విడిచి వీధిలో బెలూన్లు అమ్మడం మొదలుపెట్టింది.

 ‘‘పని ముఖ్యం కాదు...అందరికీ ఫేస్‌వాల్యూ ముఖ్యం’’ అని ఆమె కళ్లనీళ్ల పర్యంతం అయింది.

  ఆమె కథ విన్నాక ఆకాశ్ మనసు కదిలిపోయింది. జాలి ఎవరైనా చూపిస్తారు. కానీ మార్గం కొందరే చూపెడతారు. ఆ కొద్దిమందిలో ఆకాశ్ కూడా ఉన్నాడు.

 ఇలాంటి బాధితులకు ఉపాధి కలిగించడానికి తన వంతుగా సహాయం చేయాలని దృఢంగా నిర్ణయించుకున్నాడు 32 ఏళ్ల ఆకాశ్.

 

ఆకాశ్‌కు ‘ఖాస్’ (ప్రత్యేకం) అనే ట్రావెల్ కంపెనీ ఉంది. ఇప్పుడు ఆ కంపెనీలో ఉన్న ఆరు మందిలో చూపులేనివాళ్లు, యాసిడ్ బాధితులు ఉన్నారు. చూపులేని వాళ్లు ‘జాబ్ యాక్సెస్ విత్ స్పీచ్’ ప్రోగ్రాం సహాయంతో  పీసిని ఆపరేట్ చేస్తారు.

 ఉద్యోగులకు రెండు నెలల పాటు తానే స్వయంగా శిక్షణ ఇస్తాడు ఆకాష్.

 ‘‘సానుభూతితోనో, జాలిపడో  నా కంపెనీలో వారికి ఉద్యోగం ఇవ్వడం లేదు. ప్రతిభలో వారు ఎవరికీ తీసిపోరు. సిబ్బంది పనితీరు గురించి క్లయింట్స్ నుంచి వస్తున్న ప్రశంసలే దీనికి సాక్ష్యం’’ అంటారు ఆకాశ్.

 

తాము చేస్తున్న పనిపట్ల సిబ్బంది ఎంత ఉత్సాహంగా ఉన్నారు అంటే... సెలవు దినాల్లో కూడా పని చేయడానికి ఉత్సాహం చూపిస్తున్నారు. ఈ ఉద్యోగుల్లో కొందరు సొంత ఇంటి నుంచి వస్తారు. కొందరు హాస్టల్ నుంచి వస్తారు. ఎవరు ఎక్కడి నుంచి వచ్చినా వీరికి ఆఫీసే ఇల్లుగా మారింది. గతంలో నీడలా ఉన్న విషాదభరిత ఒంటరితనం దూరమైంది. ఉత్సాహవంతమైన కొత్త ప్రపంచంలోకి అడుగుపెట్టినట్లు అనిపించింది.

 ‘‘నేను చేస్తున్న ఉద్యోగాన్ని హృదయపూర్వకంగా అభిమానిస్తున్నాను. ఉద్యోగం వల్ల ఎన్నో కొత్త విషయాలు నేర్చుకోగలిగాను. ఆత్మవిశ్వాసం పెరిగింది’’ అంటుంది దీప్తి అనే ఉద్యోగి.

    

ఇ-మెయిల్స్ పంపడం నుంచి టూర్ ప్యాకేజీలు రూపొందించడం వరకు ప్రతి పనీ శ్రద్ధగా చేస్తున్నారు ఉద్యోగులు.

‘ఖాస్’లో ఉద్యోగానికి ముందు ఒకప్పుడు  ఎటూ చూసినా నిరాదరణ  ఎదురయ్యేది. ఇప్పుడు...ఆ పరిస్థితి లేదు. ఒక బలమైన ధీమా ఏదో వారిలో కనిపిస్తుంది. ‘వీరికి పని చేయడం చేతనవుతుందా?’ అనుకునే పరిస్థితి నుంచి ‘అన్ని పనులు సమర్థవంతంగా చేయగలరు’ అని నిరూపించుకున్నారు.

 ‘‘మిగిలిన ట్రావెలో కంపెనీలతో పోల్చితే నా కంపెనీ భిన్నమైనదేమీ కాదు. అయితే నా పునాది బలం మాత్రం... ఖచ్చితంగా నా సిబ్బందే’’ అని గర్వంగా చెబుతున్నాడు ఆకాశ్.

Read latest Funday News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top