పొడవు బూరలు

పొడవు బూరలు


వర్ణం

ఇంత పొడుగ్గా ఉన్న ఈ సంగీతవాద్యాన్ని ఆల్పెన్‌హార్న్ అంటారు. దక్షిణ జర్మనీలోని ఒయ్‌మిటెల్‌బర్గ్‌లోని గడ్డిమైదానంలో జరిగిన ఒక ప్రదర్శనకు ముందరి ఫొటో ఇది. ఐరోపా ఖండంలో, మరీ ముఖ్యంగా స్విట్జర్లాండ్ పర్వత ప్రాంతాల్లో వీటిని ఎక్కువగా ఉపయోగిస్తారు. కలపతో తయారయ్యే ఈ వాద్యమే ఆధునిక హారన్‌లకు ప్రేరణ. ఈ గాలివాద్యాన్ని పూర్వకాలంలో దూరంలో ఉన్నవాళ్లకు సంకేతాన్ని చేరవేసే సాధనంగా వాడేవారు.





 

ఆరుకాళ్ల తిండి

ఫొటోలో కనబడుతున్నవి వేయించిన మిడతలు! థాయిలాండ్‌లోని నఖోన్ రచ్చసీమ రాష్ట్రంలోని ఒక దుకాణం ఇది. మిడతలతోపాటు ఇంకా ఎన్నో రకాల కీటకాలు అక్కడ భోజనంగా ఆవురుమంటున్నాయి. ఆరుకాళ్ల జీవధనంగా వీటిని ఐక్యరాజ్యసమితి అభివర్ణిస్తోంది. ఎందుకంటే, సుమారుగా ఒక అరకిలో పశుమాంసాన్ని ఉత్పత్తి చేయడానికి 11,000 లీటర్ల నీరు, 11 కిలోల దాణా, అధిక భూవిస్తీర్ణం అవసరమైన చోట... అదే అరకిలో కీటకమాంసపు దిగుబడికి 4 లీటర్ల నీరు, 1 కిలో దాణా, చిన్న జాగా సరిపోతున్నాయి కాబట్టి.

 

ప్రతిరోజూ పండగే!


ఇండోనేషియాలోని బాలి ప్రత్యేకత ఏమంటే, అక్కడ పండగ జరగని రోజు ఉండదంటారు అతిశయోక్తిగా. దేవుళ్ల ద్వీపంగా పిలిచే బాలిలో వేలాది ఆలయాలు ఉన్నాయి. సంవత్సరం పొడవునా ఏదో ఒక ఉత్సవం జరుగుతూనే ఉంటుంది. మెలాస్తి పండగ అందులో ఒకటి. ఇందులో భాగంగా స్థానికులు భక్తిశ్రద్ధలతో ఆలయ ప్రతిమలను నెత్తిన మోసుకెళ్లి, దగ్గరిలోని నీటివనరులో స్నానం చేయిస్తారు. సముద్రతీరాన ఊరేగింపుగా వెళ్తున్న బాలినీయుల్ని ఫొటోలో చూడవచ్చు.

Read latest Funday News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top