వ్యవస్థీకృతమైన సంరక్షణ ఇది ఓ తల్లి ఆలోచన

వ్యవస్థీకృతమైన సంరక్షణ ఇది ఓ తల్లి ఆలోచన


మహిళా విజయం: రేష్మా పుట్టిల్లు బెంగళూరు... అత్తిల్లు హైదరాబాద్. యూఎస్‌లో ఉద్యోగం చేస్తూ ఓ పాపాయికి తల్లయ్యారు...  ఇండియాకి వచ్చిన తర్వాత... రెండో బిడ్డను కన్నప్పుడు... ఆమె ముందు ఓ సవాల్ నిలిచింది. ఫలితంగా... ‘వియ్ కేర్’ ఆవిర్భవించింది.

 

‘‘నేను పుట్టి పెరిగింది బెంగళూరులో. నాన్న డెంటిస్ట్, అమ్మ స్పెషల్ ఎడ్యుకేటర్(ప్రత్యేకమైన పిల్లలకు శిక్షణనిచ్చే టీచర్). నేను ‘వియ్ కేర్ లెర్నింగ్ ప్రైవేట్ లిమిటెడ్’ ను ప్రారంభించడానికి నా స్వీయానుభవమే కారణం. నేను పెళ్లి చేసుకుని అమెరికాలో ఐటీ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నప్పుడు పాప పుట్టింది. తనను డే కేర్ సెంటర్‌లో వదిలి ఉద్యోగం చేసుకున్నాను. బాబు పుట్టే నాటికి ఇండియాకి వచ్చేశాం. సత్యంలో సీనియర్ బిజినెస్ లీడర్‌గా ఉద్యోగం. మెటర్నిటీ లీవ్ పూర్తయిన తర్వాత బాబును డే కేర్‌లో ఉంచడానికి అనువైన సెంటర్ కనిపించలేదు. ఆఫీసులో ఉన్నా ఇంటి గురించి, బిడ్డ గురించే ఆలోచన. బాబు కోసం ఉద్యోగంలో విరామం తీసుకోవాల్సి వచ్చింది. నాలాగ ఎందరో మహిళలు పిల్లల గురించి కెరీర్‌ను కోల్పోతున్నారనిపించింది.

 

  పిల్లలు పెద్దయిన తర్వాత మళ్లీ ఉద్యోగంలో చేరినా కెరీర్ గ్రాఫ్‌లో పెద్ద గ్యాప్ కనిపిస్తుంది. ఎదుగుదల, ప్రమోషన్ వంటి వాటికి దూరమవుతుంటారు. మహిళల్లో ఎక్కువ మంది పెద్ద స్థాయికి వెళ్లకపోవడానికి వారిలో నైపుణ్యం లేకపోవడం కాదు. పిల్లల కోసం తీసుకునే గ్యాప్ పెద్ద అగాధంగా మారుతోందనిపించింది. దాంతో అంతర్జాతీయ ప్రమాణాలతో ‘వియ్ కేర్’ను ప్రారంభించాను. ఐటీ ఉద్యోగాల్లో ఒత్తిడి, ఎక్కువ పని గంటలు ఉంటాయి కాబట్టి వారి మీదనే దృష్టి పెట్టాను. హైదరాబాద్‌లో తొలి సెంటర్‌ని గచ్చిబౌలిలో ఈ నెల ఆరవ తేదీన ప్రారంభించాను.

 - రేష్మా శ్రీనివాస్, ఎం.డి,

 వియ్‌కేర్ లెర్నింగ్ ప్రైవేట్ లిమిటెడ్


 

 నాణ్యమైన సర్వీసే నా సక్సెస్!

 మొదటి సెంటర్‌ని బెంగళూరులో 2008లో హరిణి అనే పాపాయితో ప్రారంభించాను. ఆ ఏడాదిలోనే 60 మందికి చేరింది. డే కేర్‌తోపాటు ప్రీస్కూల్ కూడా నిర్వహించడంతో ఎక్కువ మందికి ఉపయుక్తంగా ఉంటోంది. ప్రస్తుతం ఆరు వారాల నుంచి పన్నెండేళ్ల వయసున్న పిల్లలు దాదాపుగా వెయ్యి మందికి పైగా మా సెంటర్లలో పెరుగుతున్నారు. మూడు వందల మంది ఉద్యోగులు పని చేస్తున్నారు. తల్లిదండ్రులు పిల్లలను ఉదయం ఎనిమిది గంటలకంతా వదిలేసి వెళ్తారు. వారికి పాలు, బ్రేక్‌ఫాస్ట్, మధ్యాహ్న భోజనం, సాయంత్రం చిరుతిండ్లు, రాత్రి భోజనం అన్నీ పరిశుభ్రమైన వాతావరణంలో పిల్లల డాక్టర్లు సూచించిన విధంగా ఇస్తాం. స్కూలు నుంచి వచ్చిన వారికి రిఫ్రెష్‌మెంట్, తినిపించడం, హోమ్ వర్క్ కూడా ఇక్కడే. దాంతో పేరెంట్స్ పిల్లలతో గడిపే కొద్ది సమయం కూడా క్వాలిటీగా గడుపుతున్నారు. హైదరాబాద్‌లో మరికొన్ని సెంటర్లను పెట్టిన తర్వాత వియ్‌కేర్ సేవలను చెన్నైకి విస్తరించాలనుకుంటున్నాను.

 

 ఆరు వారాలనే నియమం...

 పిల్లలు పుట్టిన తర్వాత ఆరు వారాల వరకు తల్లి స్పర్శను ఆస్వాదిస్తే ఇక వారు తల్లిని మర్చిపోరని నిపుణులు నిర్ధారించారు. ఆయాలు, నర్సుల చేతిలో ఎంతకాలం పెరిగినా తల్లి స్పర్శను గుర్తించగలగడానికే ఈ నియమం.

  రిపోర్టింగ్: వాకా మంజులారెడ్డి

 manjula.features@sakshi.com

Read latest Funday News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top