కూలీ... ఊరి తలరాతే మార్చాడు!

కూలీ... ఊరి తలరాతే మార్చాడు! - Sakshi


అర్థవంతం: ఒక విదేశీ జంట అతడి వద్దకు వచ్చి డజను ఆరెంజ్ పళ్లు అడిగింది. కన్నడ మాత్రమే వచ్చిన హజప్ప వారికి వాటి ధర చెప్పలేకపోయాడు. మనిషికి దేవుడు జీవితమనే ఒక బ్లాంక్ చెక్ ఇస్తాడు. మనిషి దానిమీద ఏం రాసుకుంటాడో అతనికి అది దక్కుతుంది. ఈ ప్రపంచంలో అందరి జీవితాలు ఒకేలా ఉండకపోవడానికి ఇదే కారణం. ఇంత ఇంటెన్సిటీ ఉన్న విషయాన్ని ఇపుడు చెప్పడానికి ఒక బలమైన కారణం.. హజప్పా అనే ఒక స్ట్రీట్ వెండర్. తప్పకుండా తెలుసుకోవాల్సిన ఒక వ్యక్తి!

 

 కొందరు కారణ జన్ములు. వారిలో ఒకరు హజప్పా. అతను సామాన్యుడే. రోడ్డు పక్కన పళ్లు అమ్ముకుని బతికే ఓ చిరు వ్యాపారి. పనిచేస్తే కడుపు నిండుతుంది. చిన్నపుడు బీడీలు చుట్టి పెరిగాడు. పెద్దయ్యాక పెళ్లయ్యాక ఆ ఆదాయం చాలక రోజూ మార్కెట్లో పళ్లు కొనుక్కుని గంపలో నెత్తిమీద పెట్టుకుని మంగళూరులో అమ్మేవాడు. ప్రతిరోజూ తన స్వగ్రామం నెవపాడు హరేకళ నుంచి మంగళూరు (కర్ణాటక) వెళ్లొచ్చేవాడు. ఈ క్రమంలో కొన్నేళ్లుగా అతను ఒక విషయాన్ని గమనించాడు.

 

 తన ఊరు పిల్లలు ఊర్లో బడిలేక మూడు నాలుగు కిలోమీటర్ల దూరంలోని బడికి వెళ్లి చదువుకుంటున్నారు. బస్సుల్లేక అంతదూరం నడిచి వెళ్లడం రోజూ చూస్తున్న హజప్పకు అది అస్సలు నచ్చలేదు. ఆ పిల్లలు, తల్లిదండ్రులకు అలవాటైనా హజప్పలో మాత్రం... బడికోసం పిల్లలు ఎందుకు నడవాలి? అని ప్రశ్నించుకున్నాడు. ఓ సంపన్నుడు స్పందిస్తే అనుకున్న పది రోజుల్లో బడి కట్టేయగలడు. కానీ దిన సరి వ్యాపారి అయిన హజప్ప ఏం చేయగలడు? ఎవరిని ఒప్పించగలడు. అయినా తన కల మానలేదు. తన దారిన తాను పోలేదు. తన పని తాను చూసుకోలేదు. ఈ ఆలోచనలో ఉన్న అతనికి ఒక రోజు ఒక విచిత్రమైన పరిస్థితి ఎదురైంది.

 

  ఒక విదేశీ జంట అతడి వద్దకు వచ్చి డజను ఆరెంజ్ పళ్లు అడిగింది. కన్నడ మాత్రమే వచ్చిన హజప్ప వారికి వాటి ధర చెప్పలేకపోయాడు. అసలే మథనంలో ఉన్న అతన్ని ఈ ఘటన ఇంకా తీవ్రమైన ఆలోచనలో పడేసింది. నేను చదువుకుని ఉంటే ఈ పరిస్థితి వచ్చేదా? అసలు మా ఊర్లో గవర్నమెంటు బడి ఉంటే నేను కూడా చదువుకునే వాడిని కదా, అని అనుకున్నాడు. బడి ఊర్లో లేకపోవడం వల్ల  కొందరసలు బడే మానేశారు. దీంతో ఆరోజు నుంచే తన ఊళ్లో బడి కట్టాలని డిసైడయ్యాడు. మంగళూరు కలెక్టరేటుకు బడికోసం అర్జీ పెట్టాడు. కానీ, బడి మంజూరు అవడం అంటే నిధులతో పని కాబట్టి అంత సులువు కాదు. అయినా అతను ఆపలేదు. వారం వారం అదేపని. అక్కడున్న కొందరు ‘ఎందుకయ్యా ఊరికే నీ ప్రయత్నం, నీ పని నువ్వు చూసుకోక. బడి పెట్టాలంటే బిల్డింగు ఉండాలి కదా, ఇపుడది అయ్యేపనేనా’ అని కసిరేశారు.

 

 ఇది ఇంకో మలుపు. అతను ఆరోజు నుంచి తన ఆదాయంలో కొంత బడికోసం దాచడం మొదలుపెట్టాడు. అతడి భార్య నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. నీకు వచ్చేదే 100-150. అందులో ‘బడికి దాస్తావా బుద్ధి లేకపోతే సరి’ అంటూ ఆమె తిట్టే తిట్లకు అతను రోజూ అలవాటు పడ్డాడే కానీ తన ఆలోచన మార్చుకోలేదు. అలా తీవ్రంగా ప్రయత్నించి కొన్ని సంవత్సరాల పాటు శ్రమించాక కాళ్లరిగేలా తిరిగాక గవర్నమెంటు బడి మంజూరు చేసింది. కానీ దానికి బిల్డింగ్ లేదు. దీంతో తను దాచుకున్న డబ్బుకు తోడు విరాళాలు సేకరించి ఒక చిన్న గది కట్టించాడు. అది కొందరికి పిచ్చి అనిపిస్తే ఇంకొందరికి ఆశ్చర్యం అనిపించింది. ఈ విషయం తెలిసిన కన్నడ దినపత్రిక అతనిని మ్యాన్ ఆఫ్ ద ఇయర్‌గా ప్రకటించడంతో అభినందనలతో పాటు విరాళాలు వచ్చాయి. ప్రభుత్వం కూడా రూ.లక్ష విడుదల చేసింది.

 

  హజప్పలో ఉత్సాహం రెట్టించి ఆ డబ్బులతో హైస్కూలు కూడా కట్టించేశాడు. అక్కడితో ఆపలేదు. మా ఊరికి కాలేజీ కూడా కావాల్సిందే అని పట్టబట్టేశాడు హజప్ప. ఇపుడదే ప్రయత్నంలో ఉన్నాడు. ఇది వన్ మాన్ షో. ఫలితం దక్కాలంటే అడ్డంకులు దాటాలి, తీవ్రంగా శ్రమించాలి... అది ఎంతకాలమైనా పట్టొచ్చు. ఏడేళ్ల పాటు ఇంట్లో వారితో తిట్లు, ఊర్లో వాళ్లతో చీవాట్లు తిన్న హజప్పపై అతని ప్రయత్నం ఫలించాక అవార్డుల వర్షం, రివార్డుల వరద కురిసింది. విచిత్రం ఏంటంటే... ఆయన ఇంకా పళ్లు అమ్ముతూనే తన ఇంటిని పోషిస్తున్నాడు. పొట్టకూటి కోసం కాదు, అది తన వృత్తి. ఆ ఊరు మాత్రం సరస్వతీ క్షేత్రం అయ్యింది. ఆయన ఒక రియల్ హీరో. హజప్ప జీవితం సమాజాన్ని తీర్చిదిద్దాలనుకున్న వారికే కాదు, తమ జీవితాలు మార్చుకోవాలనుకున్న వారికీ పనికొస్తుంది. అందుకే మీ జీవితం మీకు నచ్చినట్లు తీర్చిదిద్దుకోవాల్సింది మీరే!

 - ప్రకాష్ చిమ్మల

Read latest Funday News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top