పరిశుద్ధ లేఖనాల్లోని ప్రవచనాల సమాహారం

పరిశుద్ధ లేఖనాల్లోని ప్రవచనాల సమాహారం - Sakshi


ప్రేమ



దేవుడు ప్రేమ స్వరూపి, మనం దేవుని ప్రేమించామని కాదు, ఆయనే మనలను మొదట ప్రేమించారు. అందుకే మన పాపాలకు ప్రాయశ్చిత్తంగా ఆయన తన కుమారుని పంపారు. మనలను ప్రేమించిన వాని ద్వారా మనము అన్నిటిలో అత్యధిక విజయమును పొందుతున్నాం. ఈ లోకంలో మరణమైనా, జీవమైనా, దేవదూతలైనా, ప్రధానులైనా, ఉన్నవైనా, రాబోయేవైనా, అధికారులైనా, ఎల్తైనా, లోతైనా, సృష్టింపబడినదేదైనా మన ప్రభువునైన క్రీస్తు యేసునందలి ప్రేమ నుంచి మనలను దూరం చేయవు. దేవుడికి ఏ ఒక్కరూ నశించిపోవుట ఇష్టం కాదు. నశించిన దానిని వెదికి రక్షించటానికే మనుష్య కుమారుడు వచ్చాడు. ఎందుకంటే దైవత్వం సర్వ సంపూర్ణ శరీరంగా క్రీస్తులో నివసిస్తోంది. ఆయన శిలువ మీద మన పాపాలన్నింటినీ మోసి వెల చెల్లించాడు. దేవునికి మానవునికి సంధి చేశాడు. దేవుడు తన సొంత కుమారుని అనుగ్ర హించటానికి వెనుకదీయకుండా మన అందరి కోసం ఆయనను అప్పగించాడు. అదీ... ఆయనకు మనమీద ఉన్న ప్రేమ!



పాప క్షమాపణ

యేసు రక్తము జయము. అపవాది క్రియలకు లయము. పాపము చేయని మనిషంటూ ఉండడు. తెలిసో తెలియకో ఏదో ఒక పాపం మనవల్ల జరుగుతూనే ఉంటుంది. అందుకే మన కోసం ఆ ప్రభువు తన కుమారుడిని ఈ లోకానికి పంపించాడు. మన పాపాల నుంచి మనకు విముక్తి కలిగించడానికే దైవ కుమారుడు ఈ లోకానికి వచ్చాడు. మన కోసం ప్రాణత్యాగం చేశాడు. రక్తం చిందించకపోతే పాప క్షమాపణ కలుగదు కనుక, మన పాపాల కోసం క్రీస్తు శిలువ మీద తన రక్తాన్ని చిందించాడు. ఆయన రక్తం మనలను కడిగి పరిశుద్ధ పరచడానికి సిద్ధంగా ఉన్నది. కాబట్టి ఆయన మీద విశ్వాసం ఉంచితే... ఆయన నామం మూలంగా మనం తప్పకుండా పాప క్షమాపణను పొందుతాం. మనం పాప క్షమాపణ పొందినప్పుడే అపవాదిని జయించగలుగుతాం. ఆ విజయాన్ని సొంతం చేసుకోవాలంటే మన పాపాలకు క్షమాపణను మనం పొంది తీరాలి. అది క్రీస్తును విశ్వసించి, ఆయన మార్గంలో నడవడం ద్వారానే సాధ్యపడుతుంది.



తగ్గించుకుంటే హెచ్చిస్తాడు!

చాలామంది తమను తాము అధికులుగానే భావిస్తారు. ఇతరులు తమను అలాగే చూడాలని హెచ్చులకు పోతుంటారు. అది ప్రభువుకి ఏమాత్రం నచ్చని విషయం. అందుకే ఆయన తగ్గించుకుని బతకమని ఆదేశించాడు. తన్ను తాను హెచ్చించు కొనువాడు తగ్గించబడతాడని, తన్ను తాను తగ్గించుకొనేవాడు హెచ్చింపబడతాడని ఆయన చెప్పాడు. అలా తగ్గించుకోవడం ద్వారానే మనం దేవుని కృపను పొందగలుగుతాం. నిజానికి దైవ కుమారుడే ఎంతో తగ్గించుకున్నాడు. మన కోసం ఓ సాధారణ మనిషిలా పశువుల పాకలో జన్మించాడు. ఈ లోకములోనే పెరిగి, పాపుల మధ్యన మసిలి, తన నిరాడంబరతను చాటుకున్నాడు. సిలువ మరణాన్ని పొందాడు. తాను చేసిన ప్రతి పనిలోనూ తనను తాను ఎంత తగ్గించుకున్నాడో మనకు అర్థమవుతుంది. కాబట్టి దేవుని పోలికతో పుట్టిన నరులమైన మనం కూడా మనలను మనం తగ్గించుకోవాలి. అప్పుడే దేవుడు మనలను హెచ్చిస్తాడు.  



విశ్వాసం!

దేవునిపై విశ్వాసం ఉన్ననాడే దేవుని అడుగు జాడల్లో నడవగలుగుతాం. అందుకే మనం కచ్చితంగా ఉత్తమ విశ్వాసిగా ఉండి తీరాలని ఆయన కోరుకుంటున్నాడు. ప్రతి ఒక్కరూ విశ్వాస వీరులుగా ఉండాలి. పరిశుద్ధులు విశ్వాసం ద్వారా గొప్ప సాహసోపేతమైన కార్యాలు చేశారని పరిశుద్ధ లేఖనాలు చెబుతున్నాయి. వాళ్లందరూ ఘనపరచబడ్డారు. పరిశుద్ధ గ్రంథంలో వాళ్లు ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు. వారి గురించి పాత నిబంధన ఎంతో స్పష్టంగా తెలియజేస్తోంది. మనమూ అటువంటి విశ్వాసులమై ఉండాలి. అప్పుడే మనం మనలను బలహీనపరిచే దురాత్మలతో పోరాడగలం. ఆ పోరాటంలో విజయమూ సాధించగలం. కాబట్టి దేవునియందు విశ్వాసం కలిగి జీవిద్దాం. ఆ విశ్వాసం మనకు జయాన్ని తెస్తుంది. మనలను విజేతలుగా నిలబెడుతుంది. ఆ విజయం ఎంతో గొప్పది. అది లోక సంబంధితమైన విజయం కాదు. పరలోకంలో మనకు స్థానం కల్పించే గొప్ప విజయం!



ఇచ్చేవారు ధన్యులు!

‘పుచ్చుకొనుట కంటె ఇచ్చుట ధన్యము’ అన్నాడు ప్రభువు. దేవుడు మనకి ఎన్నో ఇచ్చాడు. మన అవసరతలన్నీ తీర్చాడు. అవి లేనివాళ్లు మన చుట్టూ ఎందరో ఉన్నారు. వారికి మనకున్నదానిలో కాస్తయినా ఇస్తే చాలు. ఆకలితో ఉన్నవారికి అన్నం పెడితే నాకు పెట్టినట్టే, బట్టలు లేనివారికి బట్టలిస్తే నాకు ఇచ్చినట్టే, అవసరంలో ఉన్నవారికి మీరు చేసే ప్రతి సాయం నాకు చేసినట్టే అని ప్రభువు చెప్పాడు. నీ దగ్గర సొమ్ము ఉన్నప్పుడు, ఎవరైనా వచ్చి అడిగితే లేదని అనవద్దు అని కూడా లేఖనాల్లో స్పష్టం చేశాడు. తన బిడ్డలకు దాతృత్వం ఉండి తీరాలి అన్నదే ఆయన అన్న మాటలకు అర్థం. మనకన్నీ ఇచ్చే మన ప్రభువు మనలో దాతృత్వాన్ని చూడాలని కోరుకుంటున్నాడు. అది మనలో ఉంటే మనం ధన్యులమైనట్టే!



స్వస్థపరచువాడు!

మన దేవుడు స్వస్థపరుచువాడు. అంతే కాదు, ఐగుప్తీయులకు కలుగజేసిన రోగాలలో ఏదీ కూడా మనకు రానివ్వనని ఆనాడే ఆయన వాగ్దానం చేసివున్నాడు. ఆయనే మనకు రక్ష. ఆయన వ్యాధిని తొలగించువాడు మాత్రమే కాదు. మంచి ఆరోగ్యము ఇచ్చేవాడు కూడా! మన ప్రభువు మన పాపములను క్షమించువాడు. శాపములను తొలగించువాడు. వ్యాధులను స్వస్థపరుచువాడు. చేదైన జీవితమును మధురమైనదిగా మార్చువాడు. ‘‘మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను. మన దోషములను బట్టి నలుగగొట్టబడెను. అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది ’’  అని పరిశుద్ధ లేఖనం మనకు స్పష్టం చేస్తోంది. కేవలం మన కోసమే ఆయన శిక్షను అనుభవించాడు. మన జీవితాలను బాగు చేసేందుకే తన జీవితాన్ని త్యాగం చేశాడు. ఆయనే మనలను కాపాడువాడు. ఆయనే మనకు నిత్యజీవాన్ని అనుగ్రహించువాడు.



సమస్తం అనుగ్రహించువాడు!

దేవుడు తన సొంత కుమారుడినే మన కోసం బలి చేశాడు. మరి మనం ఆయన మార్గంలో నడిస్తే మనకు సమస్తం ఎందుకు అనుగ్రహించడు! ఎంత గొప్ప ప్రేమ ఆయనది! యేసయ్య తన రక్తమాంసములను మాత్రమే కాక లోకము ఇవ్వలేని తీసుకోలేని దైవిక సమాధానాన్ని, రక్షణను మనకు అనుగ్రహించాడు. జీవకిరీటాన్ని, నిత్య నివాస స్థలాన్ని మనకు ఇచ్చాడు. మనం చేయవలసినదంతా కేవలం మన హృదయాన్ని ఆయనకు ఇవ్వడమే! ‘కుమారుడా, కుమార్తే... నీ హృదయమును నాకిమ్ము’ అని ఆయన నోరు తెరిచి మనల్ని అడుగుతున్నాడు. యేసు తన రక్తము ద్వారా మనలో నిబంధన చేసుకున్నాడు. పాపాలను క్షమించడమే కాకుండా, శాప ప్రభావాన్ని కూడా తొలగించి దేవుని ఉగ్రత నుండి కాపాడాడు. సాతాను తలను చితక త్రొక్కి మన వ్యాధిని స్వస్థపరిచియున్నాడు. మన కోసం సమస్తం చేసిన మన ప్రభువుకు మనల్ని మనం అప్పగించుకుని తీరాలి.



ఆదరణ

కనికరము చూపు తండ్రి, సమస్తమైన ఆదరణ అనుగ్రహించు దేవుడు. ఈ లోకంలో ఎటు చూసినా దుఃఖమే కనిపిస్తోంది. కానీ ఆయన సన్నిధి మనల్ని కాపాడుతోంది. లోకులు మన çహృదయాన్ని గాయపరుస్తుంటే... ఆయన మనల్ని ఓదార్చి బలపరుస్తున్నాడు. ఆయన హస్తములు మనల్ని ప్రేమతో దగ్గరకు తీసుకుంటున్నాయి. ప్రభువు కన్నీటిని తుడుచువాడు, రోగ పీడితులను స్వస్థపరుచువాడు, చనిపోయినవారిని లేవనెత్తువాడు. సమస్తమైన ఆదరణను అనుగ్రహించువాడు అన్న విషయం ఎప్పుడో నిరూపణ అయ్యింది. ఎలాంటి శ్రమలో ఉన్నా, దాన్ని తొలగించి ఆయన శక్తిని ఇస్తున్నాడు. ఆదరించి అక్కున చేర్చుకుంటున్నాడు. కష్టాలు చుట్టుముట్టిన సమయంలో కావలి ఉంటున్నాడు. కంటికి రెప్పలా కాపాడి కొత్త జీవితాన్ని ఇస్తున్నాడు. ఆ ఆదరణ ఎంతో గొప్పది. ఆయన ఆదరణే మనల్ని ఈ లోక సంబంధిత శ్రమల నుంచి, అపనిందలు అష్టకష్టాల నుంచి విముక్తుల్ని చేస్తున్నది.



క్షమాపణ

మీ ఋణస్తులను మేము క్షమించియున్న ప్రకారము మా ఋణములను క్షమించుము (మత్తయి 6:12) అంటూ పరలోక ప్రార్థనలో మనకు నేర్పించాడు యేసయ్య. మేము మాకచ్చియున్న ప్రతిదానిని క్షమించియున్నాము గనుక మా పాపములను క్షమింపుము అని లూకా సువార్తలో కూడా ఉంది. అయితే కొందరు దేవుడు మా ప్రార్థన ఆలకించట్లేదు, జవాబు ఇవ్వడం లేదు, ముఖం తిప్పుకున్నాడు అని బాధ పడుతూ ఉంటారు. కానీ ఆయన మన ప్రార్థన ఆలకించకపోవడానికి కారణం మనలో ఉన్న క్షమించలేని గుణమే. మన హృదయంలో కోపం, వైరాగ్యం ఉన్నప్పుడు మన పట్ల దేవుని ప్రసన్నత ఉండదు. ఎదుటివారిని మనఃపూర్వకముగా క్షమించని యెడల మనమూ క్షమాపణ పొందలేం. మీకు విరోధమేమైన యున్నయెడల, మీరు నిలువబడి ప్రార్థన చేయునప్పుడెల్లా వానిని క్షమించుడి. అప్పుడు పరలోకమందున్న మీ తండ్రియు మీ పాపములను క్షమించును’’ అన్నాడు ప్రభువు. కాబట్టి దేవుడు మనల్ని క్షమించాలంటే, ముందు మనం ఇతరుల్ని క్షమించాలి.



భయం

పరిశుద్ధ గ్రంథంలో ‘భయపడకుము’ అన్న మాట 366 సార్లు రాయబడివుంది. మనము ప్రతిదినం ప్రభువును నమ్ముకొనుట వలన భయాన్ని జయిస్తాము. భయపడవద్దు, నేను నీకు తోడుగా ఉన్నాను అని దేవుడు చెబుతున్నాడు. ధైర్యం చెప్పి మనలను బలపరుస్తున్నాడు. కాబట్టి ‘‘భూమి మార్పు నొందినను నడి సముద్రములో పర్వతములు మునిగినను, వాటి జలములు ఘోషించుచు నురుగు కట్టినను ఆ పొంగునకు పర్వతములు కదిలినను మనము భయపడము’’ (కీర్తన 46:2–3). దేవుడు మనల్ని ఎంతో ప్రేమిస్తున్నాడు. ప్రేమలో భయముండదు. అంతేకాదు పరిపూర్ణ ప్రేమ భయమును వెళ్లగొడుతుంది (1 యోహాను 4:18). లోక రక్షకుడు మనకు అండగా ఉండగా మనకేమి భయము? కాకపోతే భయమును జయించు విశ్వాసము మనలో ఉండాలి. యుగసమాప్తి వరకు సదాకాలము మనతో ఉంటానని ఆయన వాగ్దానం చేసి ఉన్నాడు కాబట్టి భయాన్ని వీడి ధైర్యంగా జీవించాలి.



విజ్ఞాపన ప్రార్థన

మనం ఇతరుల కోసం ప్రార్థించినప్పుడు దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. యోబు విషయంలో అదే జరిగింది. అతడు ఎన్నో కష్టాలు పడుతూ కూడా తన కోసం ప్రార్థించలేదు. తన స్నేహితుల కోసం, తనను అవహేళన చేస్తున్నవారి కోసం కూడా ప్రార్థన చేశాడు. అలాంటి ప్రార్థనే దేవునికి ఇష్టం. స్వార్థపూరితమైన ప్రార్థన దేవుని చెవులను చేరదు. దీన మనస్సుతో చేసిన ప్రార్థన అత్యంత వేగంగా ఆయన వద్దకు చేరుతుంది. అంతే వేగంగా ఆయన ఆశీర్వాద ఫలము కూడా మనలను వెతుక్కుంటూ వస్తుంది. కాబట్టి ఇతరుల కోసం ప్రార్థించాలి. ఇతరుల సంతోషం కోసం, వారి సుఖ సౌఖ్యాల కోసం ప్రార్థన చేయాలి.





వై.ఎస్‌. విజయలక్ష్మి

Read latest Funday News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top