మీ ఎదుట కథ

మీ ఎదుట కథ - Sakshi


పాడనా తెనుగు పాట అంటూ.. ఓ అమెరికా అమ్మాయి రాగం అందుకుంటే.. పరవశించి విన్నాం. అదే ఒరవడిని కాస్త మార్చి మన పౌరాణిక కథను, చారిత్రక గాథలను కళ్లకు కట్టేలా చెబుతున్నారు ఓ విదేశీ వనిత. ఆమె రామాయణం చెబితే.. రాముడి పదహారు గుణాలను అభినయించి చూపిస్తారు. సీతమ్మ హృదయాన్ని అంతే హృద్యంగా ఆవిష్కరిస్తారు. ప్రహ్లాద చరిత విడమరచి చెప్పేటప్పుడు బాలభక్తుడిగా, నారసింహిగా మారిపోతారు. తన మాటకు హావభావాలు జోడించి పురాణ కాలక్షేపం చేస్తున్న ఆ మహిళ పేరు ఏమిలీ ఫర్రీష్, బ్రిటిష్ కౌన్సిల్ ఆధ్వర్యంలో నగరంలోని బ్రిటిష్ లైబ్రరీలో ఆదివారం జరిగిన ఆర్ట్ ఆఫ్ స్టోరీ టెల్లింగ్‌లో పలు కథలు వినిపించిన ఆమెను ‘సిటీప్లస్’ పలకరించింది. ఆ విశేషాలు ఆమె మాటల్లోనే..

 ..:: వాంకె శ్రీనివాస్

 

పుట్టింది, పెరిగింది ఇంగ్లండ్‌లోనే. చిన్నప్పటి నుంచే నాటికలంటే ఎంతో ఇష్టం. ఈ ఆసక్తితోనే కెంట్ యూనివర్సిటీలో డ్రామా కోర్స్‌లో చేరాను. ఇదే టైంలో ఇండియాకు చెందిన స్టోరీటెల్లర్ వాయునాయుడు కథలు నన్ను కదిలించాయి. కథలతో ఎందరిలోనో మార్పు తీసుకురావొచ్చని అర్థమైంది. గ్రాడ్యుయేషన్ పూర్తికాగానే వాయునాయుడు కంపెనీలోనే ఎడ్యుకేషన్ ఆఫీసర్‌గా చేరాను. భారతదేశానికి చెందిన జానపద కళారూపం పండ్వాణి ప్రదర్శకురాలు రితూవర్మ దగ్గర ప్రత్యేకంగా శిక్షణ తీసుకున్నా. తర్వాత ‘స్టోరీ కలెక్టర్’ పరిశోధనలో భాగంగా ప్రపంచాన్ని చుట్టొచ్చాను.

 

మైండ్‌లో ఫిక్స్..



కథ, కథనం గురించి తెలుసుకోవడానికి భారత్‌లోని గ్రామీణ ప్రాంతాల్లో ఎనిమిది నెలలు పర్యటించాను. తమిళనాడులోని కట్టైకుట్టు స్కూల్ విద్యార్థులతో ఎక్కువ కాలం పనిచేశాను. ఈ థియేటర్ స్కూల్‌లో మ్యూజిక్, డ్యాన్స్, పాటల ద్వారా రామాయణ, మహాభారతాలు నేర్పిస్తారు. ప్రస్తుతం యూకేలో స్కాండల్ మోంగర్స్ (స్టోరీటెల్లింగ్ థియేటర్ కంపెనీ) డెరైక్టర్‌గా వ్యవహరిస్తున్నా.



విద్యార్థులకు కథలు చెబుతుంటాను. మనం చెప్పే కథలు పిల్లల మస్తిష్కాల్లో చిరకాలం నిలిచి పోవాలంటే కథనంలో హావభావాలు చూపించగలగాలి, సందర్భోచితంగా కంఠ స్వరం మార్చాలి, ఐ కాంటాక్ట్ ముఖ్యం. అప్పుడే కథలు వారి మైండ్‌లో ఫిక్సవుతాయి. చిన్నప్పడు పౌరాణిక కథలు చెప్పడం ద్వారా విద్యార్థుల్లో ఆలోచన శక్తి పెరుగుతుంది. మంచి చెడూ తెలుస్తాయి. ఊహించే శక్తి పెరుగుతుంది. ఇతరుల మనస్తత్వాన్ని పసిగట్టగలరు. ఒక్క మాటలో చెప్పాలంటే మంచి క్యారెక్టర్ బిల్డ్ అవుతుంది.

 

మరింత ఆదరించాలి..



భారతీయ సంస్కృతి, ఇక్కడి ఆచార వ్యవహారాలు ఎంతో ఇష్టం. హిందూ దేవుళ్ల గురించి కూడా తెలుసుకున్నాను. రామాయణ, భారతాల్లోని అంశాలను తీసుకుని కథలు చెబుతుంటా. ఇంతకు ముందు దిల్లీ, ముంబైలలో స్టోరీ టెల్లింగ్ సెషన్‌లు నిర్వహించాను. హైదరాబాద్‌కు రావడం ఇదే తొలిసారి. గోల్కొండ, చార్మినార్ తెగ నచ్చేశాయి. ఇక్కడి గ్రామీణ ప్రాంతాల్లో జానపద కళారూపాలైన బుర్రకథ, హరికథ ఇంకా ప్రాచుర్యంలో ఉన్నాయని తెలిసి సంతోషపడ్డాను. భారతీయత ప్రాభవానికి ఇవే మూలాలు. వీటికి ఆదరణ కల్పించాలని కోరుకుంటున్నాను. రానున్న రోజుల్లో స్టోరీటెల్లింగ్ ట్రెండ్ మరింత పెరుగుతుందని ఆశిస్తున్నాను.

Read latest Features News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top