వెల్ రన్

వెల్ రన్ - Sakshi


ఎముకలు కొరికే చలి. బలమైన గాలులు. కుండపోత వర్షం. క్రూర మృగాలు సంచరించే అడవులు. ఇలాంటి భిన్న వాతావరణమున్న ఏడు దేశాల్లో చిరుతల్లా పరుగులు తీశారా ఇద్దరు. 148 కిలోమీటర్ల ఏడు మారథాన్‌లను 21 గంటల్లో పూర్తిచేసి ‘వరల్డ్ మారథాన్ ఛాలెంజ్’లో భారత్ జెండాను రెపరెపలాడించారు నగరానికి చెందిన చిగురపాటి ఉమ, కృష్ణప్రసాద్ దంపతులు. యాభైఏళ్లు పైబడిన వీరు ఏడు ఖండాల్లో, ఏడు రోజుల్లో, ఏడు మారథాన్‌లను విజయవంతంగా పూర్తి చేసిన ఫస్ట్ ఇండియన్ కపుల్‌గా రికార్డుల్లోకెక్కారు. ఈ సందర్భంగా నగరానికి వచ్చిన ఉమ, కృష్ణ ప్రసాద్‌లను శనివారం ‘సిటీప్లస్’ పలకరించింది...

 

 ‘మాది గుంటూరు. చిన్నప్పటి నుంచే ఏదైనా డిఫరెంట్‌గా చేయాలనే ఆలోచన  ఉండేది. 15 ఏళ్లప్పుడే కెమెరా పట్టుకున్నా. నాన్నకు తెలియకుండా పెళ్లి ఫొటోలు తీసి పాకెట్ మనీ సంపాదించుకున్నా. 20వ ఏటవైన్ తయారుచేశా. తర్వాత హైదరాబాద్ వచ్చి బిజినెస్‌మేన్‌గా మారా. ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొని భార్య ఉమ సహకారంతో సక్సెస్ సాధించాన’నంటున్నారు గ్రాన్యుల్స్ ఇండియా లిమిటెడ్ సీఈవో కృష్ణప్రసాద్.

 

 ఫిట్‌నెస్ కోసం...


 ‘నాకు 30. మా వారికి 40 ఏళ్లున్నప్పుడు రన్నింగ్ ప్రారంభించాం. కొన్నాళ్ల పాటు ఫిట్‌నెస్ కోసమే రన్నింగ్ చేసేవాళ్లం. తొలినాళ్లలో కృష్ణ హాఫ్ కిలోమీటర్ కూడా ఉరకలేకపోయేవారు. రెగ్యులర్ ప్రాక్టీస్‌తో మార్పొచ్చింది. ఐదు, పది కిలోమీటర్ల నుంచి హాఫ్ మారథాన్, ఫుల్ మారథాన్‌లో పాల్గొనే స్థాయికి చేరుకున్నా’మన్నారు క్రిష్మ వైనారిస్ అధినేత ఉమ.

 

 యోగా ఈజ్ మై సీక్రెట్...

 ‘ప్రపంచంలోని వివిధ నగరాల్లో జరిగిన హాఫ్, ఫుల్ మారథాన్‌ల్లోనూ పాల్గొన్నాం. ఏడు ఖండాల్లో ఏడు నెలల్లో ఏడు మారథాన్‌లను 2010 డిసెంబర్‌లో దిగ్విజయంగా పూర్తి చేశాం. అదే స్ఫూర్తితో గతేడాది అక్టోబర్‌లో అనుకుంటా వరల్డ్ మారథాన్ చాలెంజ్‌లో పాల్గొందామని ఉమకు చెప్పా. ‘అబ్బో ఏడు రోజుల్లో ఏడు దేశాల్లో ఏడు మారథాన్‌లు.. ఈ వయస్సులో సాధ్యమా?’ అని అనుమానం వెలిబుచ్చింది. అయితే, మర్నాడే ఓకే అంది. అప్పటి నుంచి రోజూ ఉదయం 3.30 గంటలకే లేచి 21 కిలోమీటర్లు రన్నింగ్, గంట పాటు యోగా ప్రాక్టీసు చేసేవాళ్లం. యోగానే మారథాన్‌లో ముందుకు నడిపించింది’ అని తమ సీక్రెట్ ఆఫ్ సక్సెస్‌ను వెల్లడించారు కృష్ణప్రసాద్. ఏడు ఖండాల్లో ఏడు రోజుల్లో మారథాన్ చేయడానికి దాదాపు 38 వేల కిలోమీటర్లు, 59 గంటల పాటు విమానంలో ప్రయాణించాల్సి వచ్చింది. ఆ ప్రయాణ బడలికను సైతం లెక్క చేయకుండా... పట్టుదలతో అనుకున్న లక్ష్యాన్ని చేరుకోగలిగారు కృష్ణ ప్రసాద్ దంపతులు.

 

 దారితప్పినా.. సమయానికి లక్ష్యం


 ‘జనవరి 17న అంటార్కిటికాలోని యూనియన్ గ్లాసియర్ చేరుకున్నాం. అక్కడ మైనస్ 15 డిగ్రీల ఉష్ణోగ్రతలో ఎముకలు కొరికే చలిలో పరుగులు తీశాం. మర్నాడు దక్షిణ అమెరికాలోని పుంటా అరెనస్ ప్రాంతానికి చేరుకొని మారథాన్‌లో పాల్గొన్నాం. ఆరు డిగ్రీల ఉష్ణగ్రతతో పాటు బలమైన గాలులు మమ్మల్ని ముందుకు సాగనివ్వలేదు. చాలా కష్టపడాల్సి వచ్చింది. జనవరి 20న నార్త్ అమెరికాలోని మియామిలో వాతావరణం కాస్త అనుకూలించింది. మరుసటి రోజు మొరాకో.. ఆఫ్రికాలోని మర్రాకెచ్‌లో పరుగులు తీస్తుండగా కుండపోత వాన.. తడుస్తూ, వణుకుతూనే లక్ష్యాన్ని చేరుకున్నాం. 22న దుబాయ్ చేరుకున్నాం. అక్కడ వాతావరణం అనుకూలంగానే ఉండటంతో మారథాన్ పూర్తి చేసుకొని, ఆఖరున 24న సిడ్నీలో పరుగు తీశాం. రాత్రి పది గంటలకు మొదలైన ఈ మారథాన్‌లో సహాయకుడు అవసరమయ్యాడు. వారి డెరైక్షన్‌లోనే ముందుకెళుతుండగా నేను దారితప్పాను.

 

 మాకు ఇచ్చిన మ్యాప్ కాకుండా వేరే ప్రాంతాల మీదుగా వెళుతుండగా ఓ పెట్రోల్ బంక్ వచ్చింది. అక్కడ ఓ కారు డ్రైవర్‌ని అడిగితే.... నన్ను మళ్లీ స్టార్టింగ్ పాయింట్ వాటర్ ఫౌంట్‌కు తీసుకెళ్లారు. నా పరుగు మళ్లీ మొదలు. ఎలాగైతేనేం గమ్యాన్ని చేరుకోగలిగా. భారతీయుడిలా కనిపించిన ఆ డ్రైవర్ హెల్ప్‌వల్లే... అనుకున్న సమయానికి లక్ష్యాన్ని చేరుకోగలిగాన’ని ఉమ తన అనుభవాలను పంచుకున్నారు. ఈ మారథాన్‌లో ఎనిమిది దేశాలకు చెందిన 10 మంది పాల్గొన్నారు. హైదరాబాద్ వాసుల్లోనూ ఫిట్‌నెస్ పెంచాలనే ఉద్దేశంతో 2003లో 10కే రన్ ఫౌండేషన్ ప్రారంభించారు ఉమ. భవిష్యత్‌లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లలోని ప్రధాన నగరాల్లోనూ నిర్వహించేందుకు ప్రయత్నిస్తామంటున్నారామె.

 - వాంకె శ్రీనివాస్

Read latest Features News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top