ఊహలకు రెక్కలు

ఊహలకు రెక్కలు


ఈ ప్రపంచంలో మోస్ట్ కామన్ ఎంటర్‌టైనర్ సినిమా! ఆ అందాల లోకంలో లీనమైపోయేవారు కొందరు... తమను తాము అందులో ఊహించుకొంటూ తేలిపోయేవారు ఇంకొందరు. కానీ... దాన్నే కెరీర్‌గా మలుచుకోవాలని పట్టు వదలక ప్రయత్నించేవారు కోకొల్లలు. అందుకు సరైన దారులు దొరక్క... తమ టాలెంట్‌కు వేదిక లేక ఇబ్బందులు పడేవారికి చక్కని ప్లాట్‌ఫాం ‘షార్ట్ ఫిల్మ్’.



‘బిగ్ స్క్రీన్’కు ఎదిగేందుకు దాన్నే సాధనంగా చేసుకుని ఇప్పుడు కుర్రకారు క్రియేటివిటీని కొత్త పుంతలు తొక్కిస్తున్నారు. చక్కటి లఘు చిత్రాలు రూపొందించి యూట్యూబ్‌లో మాంచి ‘హిట్స్’ కొడుతున్నారు. తమ ఊహలకు రెక్కలు తొడిగిన అలాంటి వారిలో ఓ ముగ్గురు ఔత్సాహికుల ‘షార్ట్ సినిమా’ల పరిచయం ఈ వారం...  

 ఓ మధు

 

ఐ హేట్ యూ...

ఓ అమ్మాయి... అబ్బాయి... వారి గ్యాంగ్. అనుకోకుండా ఓ రోజు లవ్ ప్రపోజ్. ఆ తరువాత సక్సెస్... లేదంటే బ్రేకప్! ఇవన్నీ రొటీన్ కథలే. దీనికి కాస్త భిన్నంగా ‘ఐ హేట్ యూ... బికాజ్ ఐ లవ్ యూ’ చిత్రాన్ని మలిచాడు దర్శకుడు పవన్ రాచేపల్లి. గతంలో కొన్ని షార్ట్ ఫిలింస్‌కు రైటర్‌గా పనిచేసిన ఈ యువకుడు తొలి ప్రయత్నంలోనే సక్సెస్ అయ్యాడని చెప్పవచ్చు. ప్రేమించిన అమ్మాయి దూరమైతే తట్టుకోవడం అబ్బాయిలకు కష్టమే. ‘ఐ హేట్ యూ... బికాజ్ ఐ లవ్ యూ’ అని ప్రేయసి చెబితే ప్రియుడి పరిస్థితేమిటి! దాన్ని ఎలా అర్థం చేసుకోవాలనేది డిఫరెంట్‌గా చూపించాడు పవన్.



52 నిమిషాల నిడివితో సాగే ఈ ఇండిపెండెంట్ మూవీ ఫీచర్ ఫిల్మ్‌ను తలపిస్తుంది. కథ విషయానికొస్తే... అందరిలో ఉంటూనే సర్వం కోల్పోయినట్టు ఒంటరితనాన్ని అనుభవిస్తుంటాడు శ్రీ. కానీ ఎవరితోనూ తన బాధ పంచుకోడు. ఆఫీసులో రోజువారీ సమస్యలు తన ప్రేమ జ్ఞాపకాల్లోకి నడిపిస్తాయి. నిడివి తక్కువే అయినా... చిత్రీకరణ, కథనం ఆసక్తికరంగా ఉంటుంది. స్క్రీన్‌పై రాఘవ, నిత్యశ్రీ పెర్‌ఫార్మెన్స్ ఆకట్టుకుంటుంది.   

 

ట్యాంక్‌బండ్

సిటీలో హాట్ స్పాట్ ట్యాంక్‌బండ్. హుస్సేన్‌సాగర్, బుద్ధుడు... ఇవే కాదు ట్యాంక్‌బండ్ అంటే. అసలు దానికి ఆ పేరు ఎలా వచ్చిందో తెలుసా! ఈ తరం కుర్రకారును అడిగితే జుత్తు పీక్కుంటారు. ఈ చారిత్రక ప్రాముఖ్యతను చెప్పే ప్రయత్నమే ‘ట్యాంక్‌బండ్’. సోల్జర్స్ విక్టరీకి గుర్తుగా, స్ఫూర్తి నింపే చోటుగా నేటితరానికి కావల్సిన అసలైన పాయింట్లను టచ్ చేస్తుందీ చిత్రం. ట్యాంక్ బండ్ మనిషి జీవితంలా విశాలమైంది. మనసులా లోతైనది.



చిన్న చిన్న సమస్యలను ప్రతిబింబించే రణగొణ ధ్వనులు. ఇబ్బందులు, కష్టాలు వచ్చినప్పుడు ధైర్యంగా నిలబడాలని చెప్పినట్టుండే బుద్ధ విగ్రహం. ఇలా ట్యాంక్‌బండ్‌ను ఎంతో ప్రత్యేకంగా, కొత్తగా పరిచయం చేశాడు దర్శకుడు ప్రీతమ్ లాజరస్. అనేక సమస్యలతో సతమతమయ్యే సాఫ్ట్‌వేర్ ఉద్యోగి సుబ్బు ఆత్మహత్య చేసుకొనేందుకు ట్యాంక్‌బండ్ వద్దకు వెళతాడు. అక్కడున్న ఆర్మీ అధికారి సుబ్బును పలుకరిస్తాడు.



సమస్యలున్నప్పుడు ట్యాంక్‌బండ్ మీదకు వచ్చి ఆ పరిసరాలు గమనిస్తే ఎంతో స్ఫూర్తి కలుగుతుందంటూ... ఆ ప్రాంతం ప్రాముఖ్యతను వివరిస్తాడు. పాకిస్థాన్‌తో యుద్ధంలో లెఫ్టినెంట్ అరుణ్ కెత్రపాల్ పది పాకిస్థానీ ట్యాంకర్లను మట్టుపెట్టి వీరమరణం పొందారు. ఆయన సాహసానికి చిహ్నంగా పెట్టిందే ట్యాంక్‌బండ్‌పైన ఉన్న ప్యాటన్ ట్యాంకు. ఇది మనకు నిత్యం స్ఫూర్తినిస్తుందని చెప్పిన ఆర్మీ అధికారి... ఆత్మహత్య చేసుకోవాలనుకున్న సుబ్బు మైండ్ సెట్ మారుస్తాడు.

Read latest Features News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top