కారులో మంటలు ఎందుకు వస్తాయి?

కారులో మంటలు ఎందుకు వస్తాయి? - Sakshi


కారులోపల మంటలు చెలరేగి అగ్నిప్రమాదం జరిగిన సంఘటనలు ఇటీవల కాలంలో బాగా ఎక్కువయ్యాయి. లాంగ్‌ జర్నీ చేస్తే చాలు కారు కొత్తదైనా పాతదైనా నిప్పు రవ్వలు లేచి మంటలు వ్యాపిస్తున్నాయి.   దాంతో కారులో ప్రయాణించేవారు  సజీవ దహనం అవుతున్నారు. ఈ మధ్య కాలంలో అనుకోని విధంగా ఇటువంటి ప్రమాదాలు అనేకం జరిగాయి.   లక్షలు పోసి కారుకొనుక్కొని హాయిగా ఫ్యామిలీతో ప్రయాణం చేయాలంటే భయపడే పరిస్థితి ఏర్పడింది.   



కారు నిర్వహణలో తగిన జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్లే ఇటువంటి సంఘటనలు జరుగుతున్నాయి. పూర్తి స్ధాయి కారు మేయింటెనెన్స్‌ లేకపోవడం, సర్వీసింగ్‌ చేయకుండానే వేల కిలోమీటర్లు నడపడం కూడా ఇటువంటి ఘటనలకు కారణం.  ఇక ఎంటర్‌టైన్‌మెంట్‌ కోసం ఉపయోగించే సౌండ్‌ సిస్టమ్‌ అమరిక సరిగాలేకపోవడం వల్ల కూడా కారులో మంటలు  వస్తాయి. వాటికి అదనపు పవర్‌ కోసం బ్యాటరీకి నేరుగా కనెక్ట్‌ చేయడం వల్ల బ్యాటరీపై లోడ్‌ పడి మెరుపులు వచ్చి మంటలు చేలరేగుతున్నాయని ఆటోమోబైల్‌ నిపుణులు చెబుతున్నారు.



అంతేకాకుండా కారులో హెడ్‌ల్యాంప్స్‌ కారుతోపాటు  ఇచ్చినవికాకుండా ఎక్స్‌ట్రా  పవర్‌ ఫుల్‌వి పెట్టడం వల్ల వాటి నుంచి వచ్చే వేడి,  ఇంజిన్‌ వేడి కలిసి మంటలు చెలరేగిన సంఘటనలు కూడా ఉన్నాయి. కారుతో వచ్చిన వైరింగ్‌ కాకుండా లోపల తక్కువ నాణ్యత గల వైర్లను అదనంగా వాడటం వల్ల కూడా కార్లు ప్రమాదాలకు గురవుతున్నాయి.  ఇక కూలెంట్‌కు సంబంధించి కూడా తగి జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. కూలెంట్‌ లెవల్‌ సరిగ్గాలేనపుడు కూడా కారు ఇంజిన్‌ వేడెక్కి కారులో మంటలు చెలరేగుతాయి.



లాంగ్‌ డ్రైవ్‌ విషయానికొచ్చేసరికి టైర్లు సరిగ్గా లేకపోవడం, అరిగిపోయిన టైర్లతో ఎక్కువ దూరం ప్రయాణం చేసినప్పుడు  టైర్లకు రోడ్డుకు మధ్య స్కార్క్స్‌ ఏర్పడి కూడా మంటలు వ్యాపించడానికి అవకాశం ఉంది. వేసవి కాలంలో ఇటువంటి ప్రమాదాలు ఎక్కువగా జరిగే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. అందువల్ల కారు కొనే ముందు, కొన్న తరువాత దాని నిర్వహణ విషయంలో తగిన జాగ్రత్తలు పాటించవలసిన అవసరం ఉంది. లేకపోతే నిండు జీవితాలు సజీవదహనం అయ్యే ప్రమాదం ఉంది.

Read latest Features News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Tags: 



 

Read also in:
Back to Top