పెళ్లాం చెబితే వినాలి

పెళ్లాం చెబితే వినాలి


విన్నట్టే ఉంటారు.. వినరు. చెప్పేది అర్థం చేసుకున్నట్టే కనిపిస్తారు. కానీ, తమకు అనుకూలంగా దాన్ని అన్వయించుకుంటారు. అంతా విని.. చివరిలో ఏం చెప్పావ్? అంటూ మొదటికొస్తారు. అమెరికా టు జింబాబ్వే.. ఈ భూమ్మీద ఇదీ మగవాళ్ల వరుస అంటున్నారు మహిళలు. ఈ ఇష్యూనే కాన్సెప్ట్‌గా తీసుకుని స్టాండప్ కామెడీ షో రూపొందించింది లైవ్ లాఫ్టర్ క్లబ్. ‘ఉమెన్స్ డే’ పురస్కరించుకుని ‘వై మెన్ డోంట్ లిజన్’ పేరుతో ప్రదర్శించనున్న ఈ స్టాండప్ కామెడీ షో గురించి దాని రూపకర్తలు ఏమంటున్నారంటే..

 - ఓ మధు

 

 ‘‘డార్లింగ్.. సిక్స్‌కి డాగీని వాక్‌కి తీసుకెళ్లి, గ్రాసరీ తీసుకువచ్చి, డిన్నర్ చేసి, టీవి షో చూద్దాం..’’  ఓ భార్య తన భర్తతో చెప్పిన మాటలివి. కానీ, ఈ మాటలు భర్త చెవులకు ‘డార్లింగ్.. బ్లా బ్లా బ్లా.... బ్లా..’ అని వినిపించాయి. ఆ మాటలు అతనికి ఇంకోలా కూడా అనిపించాయి. ఇలా మగవారు ఏం వినాలనుకుంటున్నారో, ఎలాంటి మాటలు వినాలనుకుంటారో అది మాత్రమే వింటారు. ఒకవేళ భార్యలు చెప్పింది విన్నా దానిని వాళ్లకు అనుకూలంగానే అర్థం చేసుకుంటారు కానీ భార్య చెప్పిన కోణంలో బుర్రకెక్కించుకోరు. ఇలాంటి సందర్భాలు ఇండియన్ కపుల్ మధ్యే కాదు వరల్డ్ వైడ్ కపుల్స్ మధ్యా చాలా కామన్. ఈ సబ్జెక్ట్‌నే ప్రధానాంశంగా తీసుకుని స్టాండప్ కామెడీ షో

 నిర్వహిస్తోంది లైవ్ లాఫ్టర్ క్లబ్.

 

 మీరెందుకు వినరు?

 ‘డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ.వాట్‌విమెన్‌వాంట్’ అనేది మిలియన్ డాలర్ ప్రశ్న అని ప్రపంచవ్యాప్తంగా మగవాళ్లు వాదిస్తుంటారు. దాన్నే ప్రచారం చేస్తుంటారు. అసలు విషయానికొస్తే- ‘నిజానికి తమకేం కావాలో స్త్రీలకు చాలా క్లారిటీ ఉంటుంది. కానీ, మగవాళ్లే.. స్త్రీలు చెప్పేది సరిగా వినిపించుకోరు. సమస్యంతా మగవాళ్లు వినిపించుకోకపోవడంలోనే ఉంది. అంతేతప్ప స్త్రీలకు స్పష్టత లేదనేది వాస్తవం కాదు’ అంటారు ఈ షో రూపకర్తలు. అందుకే ‘వై మెన్ డోంట్ లిజన్’ అనేదే నిజమైన మిలియన్ డాలర్ ప్రశ్న అంటున్నారు వీరు.    

 

 వినండి ప్లీజ్..

 ‘మా ఆయన నా మాట వింటున్నట్టే ఉంటారు. కానీ వినిపించుకోరు. పద్నాలుగేళ్లుగా ఇదే వరస. మా వారే కాదు, మా నాన్నా వినిపించుకోరు మా అమ్మ మాటను. అత్తయ్య, ఆడపడుచు, తోటికోడలు ఇలా యూనివర్సల్‌గా ఆడవాళ్ల ప్రాబ్లమ్ ఇది’ అని చెప్పారు లైవ్ లాఫ్టర్ క్లబ్ ఫౌండర్ రాధా కృష్ణవేణి. ‘నేను హనీమూన్‌కి వెళుతున్నప్పుడు నా భర్త ఫ్రెండ్ ‘వై మెన్ డోంట్ లిజన్- విమెన్ కాంట్ రీడ్ మ్యాప్’ బుక్‌ని గిఫ్ట్‌గా ఇచ్చారు. అప్పటి నుంచి నేటి వరకు సమాధానం లేని ఈ ప్రశ్ననే స్టోరీలైన్‌గా తీసుకుని స్టాండప్ కామెడీగా తీసుకువస్తున్నాం’ అన్నారామె. ‘ఓ స్త్రీగా, మహిళా పారిశ్రామికవేత్తగా మహిళా దినోత్సవం కోసం ప్రత్యేకంగా ఏమైనా చేయాలి అనుకున్నప్పుడు.. భార్యల మాట భర్తలు వినకపోవటం ఎంతటి సమస్యో గుర్తొచ్చింది. 99.9 శాతం స్త్రీలు దీన్ని తమ జీవితాలతో రిలేట్ చేసుకోగలుగుతారు. అందుకే ఈ కాన్సెప్ట్ బెటర్ అనిపించింది’ అని వివరించారు ఆమె.

 

 షో హైలైట్స్

 ఆడవాళ్లు మాట్లాడుతున్నప్పుడు మగవాళ్లు వినిపించుకోకుండా ఉన్న చాలా ఫొటోలు, వీడియోలు, కార్టూన్లు సేకరించి ‘ఏవీ’లుగా ప్రదర్శిస్తున్నాం. ఈ కాన్సెప్ట్‌ను రాధ రూపొందించినా స్క్రిప్ట్‌ని మాత్రం ఆమెతో సహా మరో ఇద్దరు మహిళలు కలిసి తయారు చేశారు. ఇంకో విశేషం ఏమిటంటే, ఈ షోలో అప్పటికప్పుడు ఆడియన్స్ కూడా పాల్గొనవచ్చు. తమ మాట వినని భర్తల గురించి, అటువంటి ఫన్నీ ఇన్సిడెంట్స్‌ని ఓపెన్ మైక్ ద్వారా అందరితో పంచుకోవచ్చు. ఇలాంటి పరిస్థితుల్లో మీరేం చేస్తారని సందర్భానుసారం షో ప్రెజెంటర్స్ ప్రశ్నలు సంధిస్తారు కూడా. ఎంటీవీ- కలర్స్ ఫేమ్, బిట్స్ పిలానీ స్టూడెంట్ గర్వ్ మాలిక్ సోలోగా ఈ షోని హోస్ట్ చేస్తున్నాడు. ‘అంతా గంట పాటు హాయిగా నవ్వుకునేలా ఈ షోని ప్లాన్ చేస్తున్నాం’ అని చెప్పారు లైవ్ లాఫ్టర్ క్లబ్ భాగస్వామి మల్లికా రాజ్‌కుమార్.

 

 ఫన్నీగా.. డిఫరెంట్‌గా..

‘మగవాళ్లు చేసే కొన్ని పనులు, అలవాట్లు ఆడవాళ్లను చికాకు పెడుతుంటాయి. అలాంటి పనులు వాళ్లెందుకు చేస్తారో తప్పకుండా తెలుసుకోవాలి. ఈ షో చేస్తున్నప్పుడు అబ్బాయిల వెర్షన్ నుంచి కాక అన్ని వైపుల నుంచీ ఇందులోని అంశాలను అర్థం చేసుకున్నాను. వీటిని ఫన్నీగా ఆడియన్స్ ముందుంచుతున్నాం. ఫైనల్లీ ఆడవాళ్లకి నచ్చని గుణాన్ని మగవాళ్లు మార్చుకోగలరా, లేదా అని ఆలోచిస్తే.. దేవుడు బయోలాజికల్‌గా మనని తయారు చేసిన విధానమే దీనికి కారణం అనిపిస్తుంది. కామెడీ కోసమే నేనీ షో చేస్తున్నా.. కొంత రీసెర్చ్ వర్కూ చేశాం. కొన్ని పరిస్థితుల్లో మగవాళ్ల మెదడు, ఆడవాళ్ల మెదడు పనిచేసే తీరులో వ్యత్యాసం ఉంటుంది. ఇది బయోలాజికల్ కెమికల్స్ వల్ల జరిగే పరిణామమని చాలా మెడికల్ రీసెర్చెస్‌లో చదివాను. ఈ వైవిధ్యం నుంచి పుట్టే కామెడీని ఈ షోలో చూడవచ్చు’ అంటారు గర్వ్ మాలిక్.

 

 వై మెన్ డోంట్ లిజన్

 (ఉమెన్స్ డే కామెడీ స్పెషల్)

 తేదీ: మార్చి 8, సమయం: రాత్రి 8 గంటలకు

 సమర్పణ: లైవ్ లాఫ్టర్ క్లబ్, వెన్యూ: లెమన్‌ట్రీ, హైటెక్ సిటీ

Read latest Features News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top