అల్లరి నరేష్ పరిస్థితి ఏంటి?

అల్లరి నరేష్ - Sakshi


హీరో అల్లరి నరేష్ ఈ మధ్య  అభిమానులను అంతగా ఆకట్టకుకోలేక పోతున్నాడు. ఈ సుడిగాడి సుడి అస్సలు బాగోనట్లుంది. ఈ నవ్వుల రేడు ఇటీవల  నటించిన చిత్రాలన్నీ వరుసగా ఫ్లాపవుతున్నాయి. హీరో రాజేంద్ర ప్రసాద్ తరువాత ఆ స్థాయిలో వరుసగా హాస్య చిత్రాలలో నటించి, ప్రేక్షకులను నవ్వించి మంచి పేరు సంపాదించాడు.  వరుస ఫ్లాపులతో బెండైపోయిన నరేష్ హిట్ కోసం తెగ ప్రయత్నిస్తున్నాడు.  మళ్ళీ ఫామ్‌లోకి రావలని చేసే ప్రయత్నాలన్నీ బెడిసికొడుతున్నాయి.  ఆ బెండు అప్పారావు కథల ఎంపికలో విఫలమవుతున్నట్లు టాలీవుడ్ వర్గాలు భావిస్తున్నాయి. టైటిల్స్లోనే వెరైటీ ఉందిగానీ, కథలలో, పాత్రల విషయంలో వెరైటీ చూపించలేకపోతున్నాడని అంటున్నారు.



సుడిగాడు సినిమా తరువాత ఎన్ని ప్రయోగాలు చేస్తున్నా  నరేష్కు కలసి రాకపోవడంతో ప్రస్తుతం అతని కెరీర్‌ ప్రశ్నార్ధకంగా మారింది. తాజా ప్రయోగాలు ఏవీ ఈ అల్లరోడుకి అంతగా కలిసి రాకటంలేదు. అయినా  పట్టు వదలని విక్రమార్కుడులా హిట్ కోసం ప్రయత్నిస్తూనే ఉన్నాడు. గతంలో అత్తిలి స‌త్తిబాబు, సీమ‌ట‌పాకాయ్‌, బెండు అప్పారావు, కితకితలు వంటి వరుస హిట్స్‌తో టాలీవుడ్లో  మినమం గ్యారంటీ హీరోగా నిలిచాడు. అయితే ఈ మధ్య ఆ ట్రాక్ తప్పడంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. అంతేకాకుండా మరో ముఖ్య విషయం ఏమిటంటే తెలుగు సినిమాల సరళి చాలావరకు మారిపోయింది. ఇప్పుడు ప్రముఖ హీరోలు కూడా కామిడీగా నటించేస్తున్నారు. అది కూడా నరేష్ కు పెద్ద దెబ్బ.. ఈ నేపధ్యంలో నరేష్ నటనలో మార్పు రావలసి ఉందని అంటున్నారు.



నరేష్ చిత్రాల టైటిల్స్ అన్నీ వెరైటీగా ఉంటాయి. గమ్మత్తయిన టైటిల్స్తో ప్రేక్షకులను థియేటర్లకు రప్పించడంతో ఇతగాడు దిట్ట. ఇప్పుడు ఇంకో సరికొత్త టైటిల్‌తో నరేష్ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఈ అల్లరోడు నటిస్తున్న చిత్రానికి గతంలో 'నాటుబాంబు' అని టైటిల్ పెడదామనుకున్నారు. చిన్నికృష్ణ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి ప్రస్తుతం  'బ్రదరాఫ్ బొమ్మాళీ' అనే టైటిల్‌ని ఫిక్స్ చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అల్లరి న‌రేష్, మోనాల్ గజ్జర్  జంటగా నటిస్తున్న ఈ సినిమాలో  హీరోయిన్ రాధ కూతురు కార్తీక కీల‌క  పాత్ర పోషిస్తోంది. బొమ్మాళీ లాంటి చెల్లాయి ఉంటే, ఆ అన్నయ్య ప‌రిస్థితి ఏమిట‌న్నదే ఈ చిత్ర కథ. ఆ బొమ్మాళీ పాత్రననే కార్తీక పోషిస్తోంది.  ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే అధికారికంగా ప్రకటిస్తారు.  



 ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలో 'బందిపోటు' అనే చిత్రంలో కూడా అల్లరి నరేష్ నటిస్తున్నాడు. ప్రస్తుత పరిస్థితులలో ఈ రెండు సినిమాలు అల్లరి నరేష్కు పెద్ద పరీక్ష లాంటివి అనడంలో ఎటువంటి సందేహంలేదు. ఈ చిత్రాలపై నరేష్ ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు. అతని ఆశలు ఫలించాలని ఆశిద్దాం.

-శిసూర్య

Read latest Features News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top