టచ్ లెస్సన్

టచ్ లెస్సన్


ఇక్కడ గుండెకాయను చే తుల్తో తాకొచ్చు.. నోట్లో మన తల దూర్చి కొండనాలుక కథ తెలుసుకోవచ్చు. ఇంకా చెప్పాలంటే మానవ శరీరంలోని ప్రతి భాగాన్ని చూస్తూ, తాకుతూ.. క్షుణ్ణంగా అధ్యయనం చేయవచ్చు. సైన్స్ రహస్యాల్ని సరదాగా చూసేయొచ్చు. ఇవన్నీ smartur3d.com వింతలు. ఇటీవల ఢిల్లీలో జరిగిన ప్రపంచ విద్యా సదస్సులో ‘ఉత్తమ స్టార్ట్ క్లాస్ ప్రొడక్ట్’ అవార్డును గెలుచుకున్న మన హైదరాబాదీ నీరజ్ జువెల్కర్ ఆవిష్కర ణ ఇది. అమెరికాలోని అట్లాంటాలో జరిగిన ఇంటర్నేషనల్ సొసైటీ ఫర్ టెక్నాలజీ ఇన్ ఎడ్యుకేషన్ (ఐఎస్‌టీఈ) సదస్సులో ఈ సాఫ్ట్‌వేర్ ప్రారంభమైంది. ఈ సందర్భంగా smartur3d.com విశేషాలను నీరజ్ ‘సిటీప్లస్’తో పంచుకున్నారు.

 

 సైన్స్ పాఠమంటే ప్రయోగాలు, బొమ్మలు. అందులోనూ జీవశాస్త్రం అంటే అన్నీ బొమ్మలే. గతంలో విద్యార్థులకు నల్లబల్లపై బొమ్మలు గీసి పాఠాలు చెప్పేవారు. కాలం టెక్నాలజీ టర్న్ తీసుకోవడంతో కంప్యూటర్ల ద్వారా బోధించడం మొదలైంది. పాఠాలు నల్లబల్లపై చెప్పినా, కంప్యూటర్‌లో చూపించినా విద్యార్థుల మస్తిష్కాలకు నేరుగా చేరుకోవు. ఏదైనా ప్రాక్టికల్‌గా ఒక్కసారి చూపిస్తే.. మైండ్‌లో బ్లైండ్‌గా ఫిక్సయిపోతాయి. అందుకే అధునాతన టెక్నాలజీ ఆగ్యుమేటెడ్ రియాల్టీతో smartur3d.com ను రూపొందించాం. దీంతో మనం నేర్చుకోవాల్సిన అంశాన్ని నేరుగా మన చేతుల్లో తీసుకొని ప్రాక్టికల్‌గా చదువుకోవచ్చు. ఒక్కముక్కలో చెప్పాలంటే యానిమేషన్ ఎడ్యుకేషన్ అన్నమాట. ఇప్పటివరకు ఆగ్మెంటెడ్ రియాలిటీని విమానాలు, శాస్త్ర సాంకేతిక రంగాల్లో శిక్షణ కోసం వినియోగించారు. కానీ,  దేశంలోనే తొలిసారిగా విద్యా రంగంలో కూడా ఉపయోగించాం.

 

 కొడుకు కోసం వెళ్తే..

 2011లో మా అబ్బాయిని జాయిన్ చేయడానికి ఓ స్కూల్‌కు వెళ్లాను. అక్కడ బోధన చూసి నాకు ఆశ్చర్యమైంది. ఎప్పుడో ముప్పయ్ ఏళ్ల కిందట నేను చదువుకున్న రోజుల్లోని పద్ధతులే ఫాలో అవుతున్నారు. అందుబాటులో ఉన్న టెక్నాలజీకి విద్యారంగం ఆమడ దూరంలో ఉందనిపించింది. కొన్ని కార్పొరేట్ స్కూల్స్ మాత్రం కంప్యూటర్‌లో బోధన పేరుతో పెద్దమొత్తంలో ఫీజులు వసూలు చేస్తున్నాయి. అందరికీ అందుబాటులో ఉంటూ, ఆధునికంగా ఏదైనా టెక్నాలజీ తయారు చేయాలనుకున్నా.

 

 ఈ సాఫ్ట్‌వేర్ ఓ పాఠశాల..

 పాఠాలను ప్రయోగాత్మకంగా చెబితే విద్యార్థులు ఇంట్రెస్టింగ్‌గా నేర్చుకుంటారు. విద్యార్థుల కోసం రూపొందించిన ఈ సాఫ్ట్‌వేర్ ఒక పాఠశాల లాంటిది. కానీ నేర్పించే తీరు కాస్త డిఫరెంట్‌గా ఉంటుంది. smartur3d.com సాఫ్ట్‌వేర్ వాడేందుకు ఏడాదికి రూ.6 వేలు చెల్లించాల్సి ఉంటుంది. దీన్ని కంప్యూటర్‌లో, ఆండ్రాయిడ్ మొబైల్స్‌లో ఎందులోనైనా వేసి సులభంగా విద్యార్థులకు పాఠాలు బోధించవచ్చు, నేర్చుకోవచ్చు. ఇందులో ప్రధానంగా మూడు విభాగాలుంటాయి. 1. Interactive 3d, 2. Augmented reality, 3. Stereoscopic 3d అమీబా నుంచి మనిషి దాకా.. smartur3d.com లో ఏక కణ జీవి అమీబా మొదలు సూక్ష్మజీవులు, క్రిమికీటకాలు, చెట్లు, జంతువులు.. మానవ శరీరంలోని బాహ్య, అంతర్భాగాలు 3డీలో ఉంటాయి. వీటికి Interactive 3d ద్వారా విద్యార్థులకు బోధించవచ్చు. అదే Augmented reality  ద్వారా అయితే టెక్నాలజీ సహాయంతో నేరుగా చేతుల్లోకి తీసుకోవచ్చు.

 

 అదే Stereoscopic 3d ద్వారా అయితే గూగుల్ కళ్లద్దాలను పెట్టుకుని మన కళ్లముందు కదలాడుతున్నట్లు చూస్తూ.. శరీర భాగాల లోపలికి వెళ్లి అధ్యయనం చేయవచ్చు. ఈ సాఫ్ట్‌వేర్‌తో వీడియోనే కాదు.. ఆడియో కూడా ఆగ్మెంటెడ్ రియాలిటీ ద్వారా రూపొందించిందే. దీని ప్రత్యేకత ఏంటంటే.. మిగతా సాఫ్ట్‌వేర్స్‌లో అయితే సంబంధిత కంపెనీ రూపొందించిన లాంగ్వేజ్‌లో మాత్రమే వినాలి. ఉదాహరణకు ఇంగ్లిష్ భాషలో సబ్జెక్ట్‌ను రూపొందిస్తే.. అన్ని ప్రాంతాల విద్యార్థులకు ఈజీగా అర్థం కాదు. మనకు కావాల్సిన విషయాన్ని కావాల్సిన భాషలో రికార్డు చేసుకుంటే చాలు.. అదే భాషలో మనం వినొచ్చు. అంతేకాదండోయ్.. తరగతులు, విద్యార్థుల పరిజ్ఞాన స్థాయిని బట్టి శరీర భాగాల్లోని కొన్ని పార్ట్‌లను తొలగించవచ్చు.

 

 హైదరాబాద్‌లో 15 పాఠశాలల్లో..

 ప్రస్తుతం హైదరాబాద్‌లోని సెయింట్ ఆన్స్, హైదరాబాద్ పబ్లిక్ స్కూల్, స్టాన్లీ వంటి సుమారు 15 పాఠశాలల్లో smartur3d.com ద్వారా విద్యా బోధన జరుగుతోంది. అమెరికాలో దాదాపు 500 పాఠశాలల్లో.. యూకే, కెనడా, ఇటలీ, ఉగాండా, దక్షిణాఫ్రికా వంటి సుమారు 20 దేశాల్లోని పాఠశాలల్లో ఈ సాఫ్ట్‌వేర్ ద్వారా పాఠాలు బోధిస్తున్నారు.

 

 తయారీకి రెండున్నరేళ్లు..

 సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెంకడరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్‌ఈ), నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ (ఎన్ సీఈఆర్టీ), రాష్ట్రస్థాయి ఎడ్యుకేషన్‌లతో పాటు అన్ని దేశాల్లోని విద్యా వ్యవస్థను అధ్యయనం చేశాను. అన్ని సిలబస్‌లలో కామన్‌గా ఉన్న పాఠ్యాంశాలను తీసుకుని ఈ Ssmartur3d.com ను రూపొందించాం. అందుకే ఈ సాఫ్ట్‌వేర్ తయారీకి రెండున్నరేళ్లు పట్టింది. ప్రస్తుతం 3 నుంచి 10వ తరగతి వరకు బయాలజీ సబ్జెక్ట్ మాత్రమే అందుబాటులో ఉంది. మరో రెండు నెలల్లో ఫిజిక్స్, కెమిస్ట్రీ సబ్జెక్టుల్లో కూడా ఈ సాఫ్ట్‌వేర్‌ను తీసుకొస్తాం. ఆ తర్వాత మ్యాథ్స్, జాగ్రఫీ వంటి అన్ని సబ్జెక్టుల్లోనూ రూపొందిస్తాం.

  - ఆడెపు శ్రీనాథ్

Read latest Features News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top