భ్రమణం

భ్రమణం - Sakshi


ఒంటి స్తంభం మేడ మీద అందాల యువతి. ఆనందంగా పాటలు పాడుకుంటున్న ఆమె గొంతు విని ఎలాగైనా ఆమెను చూడాలనుకుంటాడు ఓ రాకుమారుడు.  అక్కడే మాటువేసి ఉంటాడు. ఇంతలో మాంత్రికుడు వచ్చి మంత్రం చదవగానే బారెడు జడ కిందకు వస్తుంది. దాన్ని పట్టుకుని మాంత్రికుడు పైకి ఎక్కడం గమనిస్తాడు. మాంత్రికుడు వెళ్లి పోయాక అదే విధంగా పైకి వెళ్లి ఆ యువతిని కలుసుకుంటాడు రాకుమారుడు. యవ్వనవతి, సౌందర్యవతి అయిన ఆ చక్కటి చుక్క ఆ ఒంటి స్తంభం మేడనే ప్రపంచం అనుకుంటుంది.



తనలాగే యవ్వనంలోకి వచ్చిన వారంతా ఇలాగే ఉంటారనే భ్రమలో బతుకుతుంటుంది. చిన్నప్పుడు చదివిన ఫెయిరీటేల్ రపుంజెల్‌లాగే సాగిన ‘సంపంగి’ నాటకంలో బలమైన ఆలోచన ఉంది.



సమాజాన్ని...

ఒక మంత్రగాడిగా చూపిస్తూ ప్రపంచాన్ని తెలుసుకునే అవకాశం లేకుండా టీనేజర్స్‌ని కూపస్త మండూకాల్లా కట్టిపడేస్తున్నారు పేరెంట్స్. సమాజంలో జరుగుతున్న అనేక విషయాలను చూపించి భయపెడుతూ వారిని సమాజం నుంచి వేరు చెయ్యటం వల్ల యువత రెండు రకాల ప్రపంచాలను, రెండు వ్యక్తిత్వాలను సృష్టించుకుంటున్నారు. ఫ్యామిలీలో ఒకలా ప్రవర్తిస్తూ... తమకు నచ్చిన పని చెయ్యటానికి, తమకు ఆసక్తిగల విషయాలను తెలుసుకోవటానికి మరో రకమైన యాటిట్యూడ్‌ని అలవర్చుకుంటున్నారు. దాని వల్ల వాళ్లు ఏం కోల్పోతున్నారనే విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పే ప్రయత్నం చేశామంటున్నారు ఈ ప్లే దర్శకుడు, నటుడు కృష్ణప్రసాద్.

 

తాదామ్య విచ్ఛేదం..

హీరో హీరోయిన్, మాంత్రికుడు పాత్రలతో నాటకం సాగుతుండగా అందులో సూత్రధారుడు ఆ సన్నివేశాన్ని ఆపి.. ఇది ఎందుకు ఇలా ఉండాలి, ఆమెను మాంత్రికుడు ఎందుకు బాధిస్తున్నాడు? వంటి ప్రశ్నలు వేస్తాడు. బాధ పెట్టే మాంత్రికుడికి శిక్షపడాలని సూచిస్తాడు. ఈ ప్రక్రియ గురించి అక్కడికి ప్రేక్షకుడిగా వచ్చిన తణికెళ్ల భరణి మాట్లాడుతూ ‘ఇది ఎలియనేషన్ ప్రక్రియ. తాదామ్య విచ్ఛేదం అంటారు. ఒక విషయం నాటకం ద్వారా ప్రెజంట్ చేస్తున్నప్పుడు, ఆడియెన్స్ మదిలో మెదిలే ప్రశ్నలను.. సూత్రధారుడే చెప్పి మళ్లీ నాటకాన్ని కొనసాగిస్తాడు.



ఎలా అంటే.. రామాయణ కథ తెలిసిందే అయినా సీతను ఎత్తుకుపోతున్నప్పుడు ఆడియెన్స్ బాధ పడుతుంటారు. అప్పడు సూత్రధారుడు నాటకాన్ని ఆపి ‘ఆ సీత ఎవరో కాదు నీ చెల్లెలు, నీ భార్య జాగ్రత్త!’ అంటూ మళ్లీ చెప్పటం మొదలుపెడతాడు. అంటే ఒక విషయాన్ని రియాలిటికీ కనెక్ట్ చెయ్యటం. ఈ టెక్నిక్‌ని ఇక్కడ బాగా అడాప్ట్ చేసి ప్రదర్శించారు. సరదా స్క్రీన్‌ప్లేతో చాలా స్ట్రాంగ్ మెసేజ్‌ని అందించారు’ అని వివరించారు.

 

జెర్మన్ నాటకాన్ని సంపంగి పేరుతో తెలుగు ఆడియెన్స్‌కు నచ్చే విధంగా, కొత్తగా ఆలోచించే విధంగా రాశారు ఉదయభాను గరికపాటి. ఆంధ్ర, తెలంగాణ, రాయలసీమ మాండలికాల్లో, హాస్య సంభాషణలతో సాగిన ఈ నాటకాన్ని భూమిక థియేటర్ గ్రూప్ ఇటీవల లామకాన్‌లో ప్రదర్శించింది.

- ఓ మధు

Read latest Features News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top