నాయకత్వానికి నిలువెత్తు రూపం!

వైఎస్ రాజశేఖర రెడ్డి - Sakshi


చెదరిపోని గుండె బలం... నాయకత్వానికి నిలువెత్తు రూపం.. మేరునగ ధీరుడు  దివంగత మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి. ఆ పాదం అడుగిడిన నేలంతా అయ్యింది సస్యశ్యామలం.. మాట తప్పని ఆయన తీరు పేదల జీవితాల్లో వెలుగులు నింపింది.  మడమతిప్పని ఆయన నైజం ప్రత్యర్థులకు సింహస్వప్నం అయింది. ఎందరికో అసాధ్యమయిన అనేక అభ్యుదయ పథకాలను సుసాధ్యం చేసి సంక్షేమ రథసారథిగా తెలుగు రాజకీయ యవనికపై తనకంటూ ఓ సుస్థిర స్థానాన్ని ఏర్పరచుకున్నారు.



ఉద్యమాలే ఆయన ఊపిరి. జనమే ఆయన హృదయ స్పందన. జనం కోసం అహరహం శ్రమించారు. జనం కోసమే అనుక్షణం పరితపించారు. మండే ఎండల్లో సుదీర్ఘకాలం పాటు రాష్ట్రంలో ఆ చివరి నుంచి ఈ చివరి వరకు పాదయాత్ర చేసి, కాళ్లు బొబ్బలెక్కినా ఏ మాత్రం లెక్కచేయకుండా ప్రజల కష్టాలను కళ్లారా చూశారు. ఇతర రాజకీయ పార్టీల నాయకులలా రాజకీయ ఎజెండాతో కాకుండా ప్రజల ఎజెండాతో ఎన్నికల్లో పోరాడారు. ప్రజల కష్టనష్టాలు తీర్చాలంటే ఏం చేయాలో తెలుసుకుని మరీ ఆయా అంశాలతోనే ఎన్నికల మేనిఫెస్టో రూపొందించారు. రైతులకు ఉచిత విద్యుత్, పేదలకు ఇందిరమ్మ ఇళ్లు, నిరుపేదలకు కార్పొరేట్ చికిత్స అందించడానికి ఆరోగ్యశ్రీ, పేద విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్...ఇలా ఒకటి కాదు, రెండు కాదు, అనేక పథకాలను ఆయన తీసుకొచ్చారు.



ఆయన ప్రజల నాడి తెలిసిన డాక్టర్. ఆయన పాలన ప్రజలకు తెలుసు. అందుకే ఒకసారి కాదు.. వరుసగా రెండోసారి కూడా ఆయనకే పట్టంగట్టారు. కాంగ్రెస్ పార్టీ అధిష్ఠానం సైతం వైఎస్సార్ చేపట్టిన పథకాలకు ఏనాడూ అభ్యంతరం  చెప్పలేకపోయిందంటే అది ఆయన గొప్పతనమే. ప్రభుత్వ ఆస్పత్రులలో అంబులెన్సులు మూలపడిన విషయాన్ని గమనించి 108 లాంటి వాహనాలను ప్రవేశపెట్టారు. పూర్తిగా ప్రభుత్వరంగంలోనే అయితే వాటి నిర్వహణ ఎలా ఉంటుందో తెలియబట్టే ఓ ప్రత్యేక సంస్థను దాని కోసం ఏర్పాటు  చేశారు. అత్యవసర పరిస్థితుల్లో కేవలం ఆస్పత్రికి చేర్చడమే కాదు, మార్గమధ్యంలోనే ప్రథమ చికిత్స అందించడం ద్వారా రోగుల ప్రాణాలను కాపాడేందుకు ఈ అంబులెన్సులు ఎంతగా ఉపయోగపడ్డాయో ఇప్పటికీ రెండు తెలుగు రాష్ట్రాలలోని  పల్లెలవాసులను అడిగితే వెంటనే చెబుతారు.



ఆయన పేదల పక్షపాతి. అందుకే డబ్బులు లేవన్న కారణంగా ఏ ఒక్కరూ వైద్యం అందకుండా మిగిలిపోకూడదన్న పవిత్ర లక్ష్యంతో ఆయన ప్రవేశపెట్టిన ఆరోగ్యశ్రీ పథకం ఇప్పటికీ లక్షలాది మందిని ఆపన్న హస్తంలా ఆదుకుంటోంది. గుండె జబ్బుల దగ్గర నుంచి కేన్సర్ వరకు ఎంత పెద్ద ఆరోగ్య సమస్య వచ్చినా చేతిలో పైసా అవసరం లేకుండా నేరుగా కార్పొరేట్ ఆస్పత్రులకు సైతం వెళ్లి వైద్యం చేయించుకోగల ధీమా ఇప్పుడు ఈ రాష్ట్రాలలో ప్రతి ఒక్క పేదవాడికి ఉంది.



స్వయంగా వైద్యుడు కావడం, ప్రజల కష్టాలు, కన్నీళ్లను చూడటం వల్లనే ఆయన ఇంత గొప్ప పథకాన్ని ప్రవేశపెట్టగలిగారు. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలు చాలా ఉన్నప్పటికీ వాటిలో ఎక్కడా కూడా ఇలాంటి పథకాలు లేకపోవడం వైఎస్సార్ మార్కు పాలనలోనే ఇవి సాధ్యమన్న విషయం స్పష్టమైంది. అభివృద్ధి, సంక్షేమం తన రెండు కళ్లుగా వైఎస్ రాజశేఖరరెడ్డి పాలించారు.  తన ప్రభుత్వంలో ఎన్నారైల కోసం ఓ ప్రత్యేక మంత్రిత్వ శాఖను కూడా ఏర్పాటుచేసిన ఘనత ఆయనదే.



కానీ, ఇప్పుడు ఆయన లేరు. ఆయన ఆశయాలు ఉన్నాయి. దేశదేశాల్లో ప్రశంసలు పొందిన ఆరోగ్యశ్రీ ఆవిరైపోవడం మొదలైంది. కార్పొరేట్ల కట్టడిలో, ఖరీదు ఫీజుల ముట్టడిలో ఉన్న ఉన్నత విద్యను సామాన్యుడి సమక్షాన నిలబెట్టిన ఫీజు రీయింబర్స్ మెంట్ కొన ఊపిరితో కొట్టుమిట్టాడటం మొదలైంది. నేలకు జలకళ పంచేందుకు జలయజ్ఞం చేసేందుకు భగీరథ యత్నం చేశారు. ఆ మహానేత హయాంలో పండుగలా మారిన వ్యవసాయం మళ్లీ నష్టాల "వ్యయ"సాయం అయిపోయింది. ఒక్క వైఎస్ఆర్ లేకపోవడంతో రాష్ట్రం లో పరిస్థితులు ఏ పరిణామాలకు దారి తీశాయో అందరికి తెలిసిందే. అలాంటి మహానుభావుడి గురించి ఎంత చెప్పుకొన్నా తక్కువే. ఆయనను స్మరించుకుంటూ ఆయన ఆశయాల సాధనకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముందుకు సాగిపోతోంది.

Read latest Features News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top