రోప్ తేరా మస్తానా!

రోప్ తేరా మస్తానా!


అంతకంతకూ ఆధునికులకు చేరువైపోతూ.. నిత్య జీవితంలో భాగంగా మారిపోతున్న యోగా.. సమకాలీన పోకడలకు తగ్గట్టు పలు రూపాలను సంతరించుకుంటోంది. అదే బాటలో నగరానికి తాజాగా పరిచయమైంది రోప్ యోగా. యోగ సాధకులకు కొత్త ఉత్సాహాన్నందిస్తూ అందరినీ ఆకట్టుకుంటోంది.

 ..:: ఎస్.సత్యబాబు

 

పై నుంచి కిందకు, పక్కలకు వేలాడుతూ చూడ్డానికి విచిత్రంగా అనిపించే ఈ ఆసనాల సాధన పేరు.. రోప్ వాల్ యోగా. అయ్యంగార్ల యోగాశైలి నుంచి ఈ నవీన యోగ జీవం పోసుకుందంటారు. యోగా గురువు బీకేఎస్ అయ్యంగార్ డిజైన్ చేశారని చెబుతున్న ఈ పద్ధతిలో తాడు, గోడలను ఆధారం చేసుకుని ఆసనాలు వేయడం ద్వారా మరింత ప్రయోజనం పొందవచ్చని చెబుతారు. అయ్యంగార్లు దీనిని యోగా కరుంట లేదా యోగా పప్పెట్రీ అని పిలిచేవారట. ఇప్పటిదాకా బాగా అనుభవజ్ఞులైన యోగా గురువులకు, యోగా చరిత్ర ఔపోసన పట్టిన వారికి మాత్రమే తెలిసిన ఈ విశేష ఆసన శైలి.. కొందరు యోగా గురువుల ద్వారా ఇటీవలే సిటీలో అరంగేట్రం చేసింది.

ఆరోగ్యాభిలాషులకు చేరువవుతోంది.



తాడు, గోడే ఆధారంగా..



రోప్ యోగా చేసేందుకు పూర్తిస్థాయి రోప్‌వాల్‌ను సెటప్ చేస్తారు. ఆ వాల్‌కు రోప్స్‌ను హుక్స్‌తో బిగిస్తారు. ట్రెక్కింగ్ వంటి వాటికి ఉపయోగించే బలమైన తాడును ఉపయోగిస్తారు. ఈ తాడు ఆధారంగా ఎంత బరువు, వయసు ఉన్న వారైనా ఆసనాలు వేయొచ్చు. గోడ, తాడులను ఆధారం చేసుకోవడం వల్ల మామూలు విధానంలో వేయడం కష్టమైన కొన్ని రకాల ఆసనాలను సులువుగా వేయవచ్చు. ప్రస్తుతం సిటీలోని కొన్ని యోగా స్టూడియోలలో బిగినర్స్ కోసం ఒకరకమైన తాళ్లను, యోగాసనాల్లో నైపుణ్యం కలిగిన వారి కోసం మరో రకమైన రోప్స్‌ను అమరుస్తున్నారు. మిగిలిన యోగాసనాలను సాధన చేస్తూ ఈ రోప్ యోగాను వారంలో రెండ్రోజులు వేస్తే సరిపోతుందని నిపుణులు సూచిస్తున్నారు.



నో పెయిన్స్.. ఓన్లీ గెయిన్స్..



రోప్‌యోగాతో రిజల్ట్స్ ఫుల్ అంటున్నారు రినా హిందోచా. నగరంలోని తిరుమలగిరిలో రోప్‌వాల్ యోగా స్టూడియోను ఆమె నెలకొల్పారు. ‘ఐదేళ్ల సాధనతో గాని సాధ్యం కాని విలోమాసనం వంటివి రోప్స్ ద్వారా స్వల్పకాలంలోనే వేయవచ్చు. ఈ శైలిలో వేసే ఆసనాల వల్ల వెన్నెముక పటిష్టమవుతుంది. టైట్ మజిల్స్‌ను రిలాక్స్ చేస్తుంది. బ్యాక్‌పెయిన్‌కి మంత్రదండంలా పనిచేస్తుందని చెప్పవచ్చు’ అంటున్న రినా హిందోచా తమ దగ్గర ఒకేసారి పది మంది రోప్ యోగా చేయడానికి వీలుగా ఏర్పాట్లు ఉన్నాయని చెప్పారు. పదకొండేళ్లుగా శిక్షకురాలిగా ఉన్న ఉత్తర శర్మ సైతం సిటీలో రోప్‌యోగా స్టూడియో నిర్వహిస్తున్నారు. కొన్ని రకాల బాడీ టైప్స్‌కి ఇది పనికిరాదనే అపోహలను యోగా నిపుణులు తోసిపుచ్చుతున్నారు. బాడీ టైప్‌ని బట్టి విభిన్న ఆసనాలు, సాధన శైలిని మార్చుకోవచ్చునంటున్నారు. గతేడాదే రోప్‌వాల్ యోగా స్టార్ట్ చేశానంటున్న రమ్య, తనకు దీని ద్వారా మైగ్రెయిన్ బాధ తప్పిందన్నారు. ‘తొలుత చూసినప్పుడు భయమేసింది. కానీ.. ఇప్పుడు మరింత ఫ్లెక్సిబుల్‌గా మారాన’ని ఆనందం వ్యక్తం చేశారామె. ఫ్లెక్సిబులిటీని అలా ఉంచితే తల భాగానికి రక్త సరఫరా మెరుగై మంచి ఫలితాలు లభిస్తాయని చెబుతున్నారు యోగా గురువులు. ‘ఇది మైండ్‌కి, దేహానికి చాలా మేలు చేస్తుంది. చర్మం కాంతివంతమై, ముడతల్ని నివారిస్తుంది. తలకు రక్త సరఫరా అనేది హార్మోనల్ బ్యాలెన్సింగ్‌కు ఉపకరిస్తుంది. పిట్యూటరీ గ్రంథితో పాటు బ్రెయిన్‌లో ఉండే స్పిరిట్యువల్ సెంటర్‌గా పేర్కొనే పినియల్ గ్లాండ్ కూడా యాక్టివేట్ అవుతుంది’ అంటూ నిపుణులు దీని లాభాలను వివరిస్తున్నారు.



జాగ్రత్తలూ ఉన్నాయ్..



ఇప్పటికే యోగసాధనలో ఉన్నవారు మాత్రమే ఈ యోగా శైలిని ఎంచుకోవాలి. అసలు యోగాసనాలే పరిచయం లేనివారు ప్రారంభ దశలో ఇవి వేయడం క్షేమం కాదు. కనీసం వారం రోజులైనా సరే ముందస్తుగా యోగ సాధన చేయకుండా తిన్నగా రోప్ అందుకోవడానికి కుదరదు.

 

Read latest Features News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top