రెడీ...స్టార్ట్


‘మేము సైతం’ అంటూ విశాఖవాసులకు భరోసానిస్తున్న టాలీవుడ్ ఈవెంట్ సక్సెస్ కోసం ఫుల్‌గా ప్రిపేరవుతోంది. పది రోజులుగా రిహార్సల్స్‌లో మునిగిపోతున్నారు సినీజనాలు. ఆదివారం జరిగే 12 గంటల లైవ్ షో ఆద్యంతం ఆసక్తిగా ఉండేలా ప్లాన్ చేస్తున్నారు. పలువురు నటీనటులు వెరైటీ స్కిట్స్‌తో రెడీ అవుతున్నారు. డ్యాన్స్, షోస్ ప్రాక్టీస్‌లో గంటల తరబడి గడుపుతున్నారు. ఇంకొందరు కబడ్డీ.. కబడ్డీ.. అంటూ ‘కూత’ పెడుతున్నారు. స్టార్స్ క్రికెట్‌లో బౌండరీలు బాదడానికి నెట్స్‌లో చెమటోడుస్తున్నారు. హుద్‌హుద్ బాధితులను ఆదుకునేందుకు మేము సైతం అంటూ రంగంలోకి దిగిన ఇండస్ట్రీ ప్రాక్టీస్ సెక్షన్ ముచ్చట్లు మీ కోసం..

 

అందరూ భాగస్వాములే..



విశాఖవాసులకు ఎవరూ తీర్చలేని కష్టం వచ్చింది. దాన్ని పూర్తిగా పూడ్చలేకపోయినా.. మా వంతు సాయం చేయడానికి వీలైనన్ని మార్గాలను అన్వేషిస్తున్నాం. మాకు వచ్చిన కళతోనే దీన్ని ఎదుర్కోవాలని మేముసైతం కార్యక్రమానికి పూనుకున్నాం. టాలీవుడ్ ఫ్యామిలీ తరఫున చేస్తున్న బృహత్కార్యం ఇది. ఇండస్ట్రీలోని అందరూ వివిధ పెర్ఫార్మెన్స్‌లు ఇస్తున్నారు. కమెడియన్స్ కామెడీ స్కిట్స్ చేస్తున్నారు. నేను క్రికెట్‌లో పార్టిసిపేట్ చేస్తున్నాను. ఈ ఈవెంట్ ద్వారా మేమందిస్తున్న సహాయం వారికి కొంతైనా ఓదార్పునిస్తుంది. మాతో ప్రతి ఒక్కరూ చేయి కలిపి వైజాగ్ పునరుద్ధరణలో భాగస్వాములు కావాలి.

 - నాగార్జున

 

ఎంత కష్టం..



విశాఖలో కొన్ని వందల షూటింగ్‌లు చేసుంటాం. అక్కడ ప్రతి అంగుళం మా సినీజనానికి తెలుసు. అవన్నీ సుడిగాలి తీవ్రతకు సర్వనాశనమయ్యాయి. తెలంగాణ సీఎం కేసీఆర్ వెంటనే స్పందించి విద్యుత్ పునరుద్ధరణకు రూ.16 కోట్ల విలువైన సామగ్రి పంపించారు. తెలుగు ప్రజలకు ఏ కష్టమొచ్చినా ఇండస్ట్రీ ఆదుకుంటుందని గతంలో ఎన్నోమార్లు రుజువైంది. ఆ ఆదర్శంతోనే ఈరోజు మేమంతా ముందుకు వచ్చాం. రచయితలమంతా కలసి స్వచ్ఛభారత్‌పై జొన్నవిత్తుల రాసిన ఓ స్కిట్‌ను ప్రదర్శిస్తున్నాం.

 - పరుచూరి గోపాలకృష్ణ

 

తలో చెయ్యి..



వారం రోజులుగా నటీనటులందరూ సీరియస్‌గా ప్రాక్టీస్ చేస్తున్నారు. ప్రొడ్యూసర్ దామూ నేతృత్వంలో ఈ సెక్షన్ నిర్వహిస్తున్నాం. బ్రహ్మానందం, అలీ, పోసాని కృష్ణమురళి, పరుచూరి గోపాలకృష్ణ,  కోడి రామకృష్ణ, నాగేశ్వర్‌రెడ్డి, ఎమ్మెస్, ఈవీవీ సత్తిబాబు, శివారెడ్డి ఇలా అందరూ స్కిట్స్ చేస్తున్నారు. నేను, ఖయ్యూం ఇద్దరం వీటిని కో ఆర్డినేట్ చేస్తున్నాం.

 - కాదంబరి కిరణ్

 

అందరివాళ్లం..



హుద్‌హుద్ తీవ్రతకు బ్యూటిఫుల్ వైజాగ్ కళావిహీనమైపోయింది. తెలుగు ఇండస్ట్రీ అంతా కలసి వారికి సాయం చేయాలని ముందుకు వచ్చింది. క్రికెట్‌లో నేను వెంకటేష్ టీమ్‌లో ఉన్నాను. నాలుగు జట్లు ఉన్నాయి. ఒక్కో ఇన్నింగ్స్ ఆరు ఓవర్లు సాగుతుంది. నేను సీసీఎల్, టీసీఐ టీమ్‌లలో ఉన్నాను. అప్పుడప్పుడూ క్రికెట్ ఆడుతూనే ఉంటాను.

 - నవీన్ చంద్ర

 

ఉడతాసాయం



నాకు క్రికెట్ అంటే ప్రాణం. విశాఖవాసులను ఆదుకోవడానికి టాలీవుడ్ ఇండస్ట్రీ చేస్తున్న గొప్ప కార్యక్రమమిది. ఉడతాసాయంగా నేను అందులో పాలుపంచుకోవాలనుకున్నాను. అందుకే ఢిల్లీ నుంచి ప్రత్యేకంగా 900 గ్రాముల లైట్‌వెయిట్ బీడీఎం బ్యాట్స్ తెప్పించాను. హీరో నాగార్జునకు అందించాను. జూనియర్ ఎన్టీఆర్, వెంకటేష్‌లకూ ఇస్తాను.

 - చక్రపాణి, స్పోర్స్ట్  డెవలప్‌మెంట్ ఆఫ్ ఏపీ చైర్మన్

 

బాధ్యతగా ఫీలవుతున్నాం..



వైజాగ్  ఒక ప్రళయాన్ని చూసింది. ఈ సమయంలో వారి బాగోగులను చూడాల్సిన బాధ్యత తెలుగు వారందరిపై ఉంది. ఆ బాధ్యతతోనే ఇండస్ట్రీ ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఇందులో నేను భాగస్వామినైనందుకు సంతోషంగా ఉంది.

 - నాని

 

క్రికెట్, కబడ్డీ కూడా..



ఎంటర్‌టైన్‌మెంటే కాదు.. ఇలాంటి సందర్భాల్లో కూడా అండగా ఉంటామని టాలీవుడ్ నిరూపించింది. డ్యాన్సింగ్ పెర్ఫార్మెన్స్‌తో పాటు క్రికెట్, కబడ్డీ జట్టుల్లో కూడా ఉన్నాను. మా ప్రయత్నాన్ని ప్రేక్షకులు కూడా ఆదరించాలని కోరుకుంటున్నాను.

 - తనీష్

 

స్టే స్ట్రాంగ్



మా సినిమాలను ఆదరించిన కామన్ పీపుల్ కష్టాల్లో ఉంటే స్పందించడం మా కనీస బాధ్యత. నేను కబడ్డీ జట్టులో ఉన్నాను. స్కిట్‌లో కూడా యాక్ట్ చేస్తున్నా. గుడ్ కాజ్ గురించి చేస్తున్న ఇందులో పార్టిసిపేట్ చేస్తున్నందుకు గర్వంగా ఫీలవుతున్నా.

 స్టే స్ట్రాంగ్ మీకు మేమున్నాం.

 - నవదీప్

 

పది రోజులుగా..



మేముసైతంలో పాల్గొంటున్నందుకు ఆనందంగా ఉంది. నేను స్కిట్స్ కో ఆర్డినేట్ చేస్తున్నాను. పది రోజులుగా రిహార్సల్స్ చేస్తున్నాం. ఎమ్మెస్, రఘుబాబు, పృథ్వీ, శ్రీనివాసరెడ్డి.. ఇలా అందరు నటులు సీరియస్‌గా ప్రాక్టీస్ చేస్తున్నారు. క్రికెట్ విషయానికి వస్తే నేను రామ్‌చరణ్‌తేజ్ టీమ్‌లో ఉన్నాను.

 - ఖయ్యూం

 

ప్రత్యేక అనుబంధం..



నా మొదటి సినిమా వేదం వైజాగ్‌లోనే షూట్ చేసుకుంది. ఆ సిటీతో నాకు ప్రత్యేక అనుబంధం ఉంది. సాయం చేసే పరిస్థితుల్లో ఉన్న ప్రతి ఒక్కరూ విశాఖవాసులకు చేయూతనివ్వాలి. డ్యాన్స్‌తో పాటు క్రికెట్ కూడా ఆడుతున్నాను. జూనియర్ ఎన్టీఆర్ టీమ్‌లో ఉన్నాను. ఫ్యాషన్ పెరేడ్‌లో కూడా పార్టిసిపేట్ చేస్తున్నాను.

 - దీక్షాసేథ్

 

ఎప్పుడూ సిద్ధం..



గతంలో దాసరి గారు, మురళీమోహన్ గారి ఆధ్వర్యంలో జరిగిన చారిటీ ఈవెంట్లలో పాల్గొన్నాను. మేముసైతం సక్సెస్ కోసం నటీనటులంతా కష్టపడుతున్నారు. నేను హంసనందిని, దీక్షాసేథ్, ఊర్వశి, తనీష్ కోసం కొరియోగ్రఫీ చేస్తున్నాను.

 - సత్య మాస్టర్

 

అందుకే వచ్చా..



తెలుగు ఇండస్ట్రీ మొత్తం యూనిటీగా నడవటం సంతోషంగా ఉంది. మేముసైతం కాజ్ నచ్చడంతో టాలీవుడ్‌తో పరిచయం లేకున్నా.. ఈ ఈవెంట్‌లో పాల్గొంటున్నాను. నేను టాలీవుడ్ నటిని కాకపోయినా.. వారు చేసే మంచి కార్యక్రమంలో పాల్గొంటున్నందుకు ఆనందంగా ఉంది.

 - ఊర్వశి రౌటెల

 

 ..:: శిరీష చల్లపల్లి

 ఫొటోలు: సృజన్ పున్నా

 

Read latest Features News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top