సిటీ వాకిట్లో ఐస్‌క్రీమ్ బ్యూటీ

సిటీ వాకిట్లో ఐస్‌క్రీమ్ బ్యూటీ


‘ఐస్‌క్రీమ్’ సినిమాతో ఆడియన్స్ హృదయాలను నైస్‌గా కొల్లగొట్టిన భామ తేజస్వి మదివాడ. తానుపుట్టి పెరిగిన హైదరాబాద్‌లో నాటి, నేటి జ్ఞాపకాలను, తన కెరీర్ విశేషాలను సాక్షి సిటీప్లస్‌తో ఇలా పూసగుచ్చింది.

 

మాది విజయవాడ. అయితే నేను పుట్టి పెరిగింది మాత్రం హైదరాబాద్‌లోనే. బాల్యమంతా బీహెచ్‌ఈఎల్, బేగంపేట, సైనిక్‌పురి ప్రాంతాల్లోనే గడిచింది. జూబ్లీహిల్స్‌లోని భారతీయ విద్యాభవన్ స్కూల్‌లో ఎనిమిది వరకు, బేగంపేటలోని కేంద్రీయ విద్యాలయలో టెన్త్ వరకు చదివా. సెయింట్ ఫ్రాన్సిస్ కాలేజ్ ఫర్ ఉమెన్‌లో ఇంటర్, డిగ్రీ పూర్తి చేశా. పీజీలో మాస్ కమ్యూనికేషన్ జర్నలి టజం చేశా. ఓ టీవీ చానల్‌లో ఇంటర్నెషిప్ చేశా. నేను ఆరేళ్ల ప్రాయంలో ఉండగా అమ్మ లక్ష్మి చనిపోయింది.



అప్పటి నుంచి సిటీలో చిన్నప్పుడు అమ్మతో కలిసి తిరిగిన ప్రాంతాల ఫొటోలు తిరిగేస్తూ ఆ రోజుల్ని గుర్తుచేసుకుంటుంటాను. సీఐఎస్‌ఎఫ్‌లో ఇంటెలిజెన్స్ డిపార్ట్‌మెంట్‌లో పనిచేస్తున్న నాన్న ఎన్‌కే రావు అన్ని విషయాల్లో నాకు పూర్తి స్వేచ్ఛనిచ్చారు. అన్న హరీశ్ యానిమేటర్. స్కూలింగ్ నుంచే డ్యాన్స్ అంటే నాకు మహా ఇష్టం. స్కూల్‌లో ఏ చిన్న కార్యక్రమం జరిగినా వేదికెక్కి స్టెప్పులేసేదాన్ని. అలా బాబాసెహగల్ చికాగో అకాడమీ, ట్విస్ట్ అండ్ టర్న్స్ డ్యాన్స్ అకాడమీలో డ్యాన్స్ ఇన్‌స్ట్రక్టర్‌గా పనిచేశా. ఇదే సమయంలో నాకు సెవన్‌అప్ యాడ్ అవకాశం వచ్చింది.



హీరోయిన్ అవుతాననుకోలేదు

2011లో హైదరాబాద్‌లో జరిగిన ‘మిస్ దాబర్ గులబరి’ అందాల పోటీల్లో పాల్గొన్నా. క్యాట్, ర్యాంప్‌వాక్‌లతో పాటు డ్యాన్స్ కూడా చేశా. అయితే రన్నరప్‌తో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. అప్పుడే నాకు సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టులో సమంత చెల్లెలిగా నటించే చాన్స్ వచ్చింది. హార్ట్‌ఎటాక్, మనం, అనుక్షణం, లవర్స్ సినిమాల చాన్స్‌లు తలుపుతట్టాయి.



రాంగోపాల్‌వర్మ డెరైక్షన్‌లో వచ్చిన ‘ఐస్‌క్రీమ్’లో పూర్తిస్థాయి హీరోయిన్‌గా చేశా. ప్రస్తుతం ఊర్వశివో...రాక్షసివో, పండగ చేస్కో, రాజు గారి గాడి సినిమాలు రిలీజ్‌కు సిద్ధమవుతున్నాయి. తమిళ్ మూవీ హోలీలో నటించా. చిన్నప్పటి నుంచి నేను హీరోయిన్ అవుతానని అనుకోలేదు. అనుకోకుండానే అవకాశాలు వచ్చిపడ్డాయి. ఇప్పుడప్పుడే పెళ్లి చేసుకోవాలనుకోవడం లేదు. ప్రస్తుతం సినీ కెరీర్‌పైనే దృష్టి అంతా.



సిటీ టేస్ట్ అదుర్స్...

చార్మినార్ అంటే మహా ఇష్టం. చిన్నప్పటి నుంచి అక్కడికి ఎన్నోసార్లు వెళ్లా. టైమ్ దొరికితే జూబ్లీహిల్స్‌లోని మహరాజ్ చాట్ భండార్‌లో వాలిపోవాల్సిందే. బేగంపేటలోని నీడ్స్ దాబాలో డిఫరెంట్ స్పైసీ వంటకాల్ని టేస్ట్ చేస్తా. సిటీ సెంటర్ వెనక ఉండే ఓహ్రీస్, రుచి అండ్ ఇదోని బిస్ట్రోకు రెగ్యులర్‌గా వెళ్తుంటా. అక్కడ చెఫ్ చేసే వంటకాలు టేబుల్‌పైకి రాగానే మొదలు కెమెరాతో క్లిక్ చేసిన తర్వాత ఆరగిస్తా. హోలీ వచ్చిందంటే ఫ్రెండ్స్‌తో కలిసి రంగుల్లో మునిగి తేలుతుంటా. నేను చిన్నప్పుడు చూసిన సిటీని మళ్లీ చూడాలనిపిస్తోంది.

Read latest Features News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top