టమ్‌కీన్ ఏక్ సొల్యూషన్

టమ్‌కీన్ ఏక్ సొల్యూషన్


వేర్ దేరీజ్  ఎ వే.. దేర్ ఈజ్ ఎ విల్... సేయింగ్ పాతదే

 కానీ ఎప్పటికప్పుడు పంచే స్ఫూర్తి కొత్తది.

 ఆ చిత్తశుద్ధి నుంచి రూపం దిద్దుకున్నదే... ‘టమ్‌కీన్’

 అంటే... అరబిక్‌లో సాధికారత అని అర్థం.

 పండుగలోని ఓ ఆచారాన్ని ఉపాధి మార్గంగా మలిచే సంస్థ.

 దాని వ్యవస్థాపకుడు యంగ్ అండ్ ఎనర్జిటిక్ అబ్దుల్ ముజీబ్ ఖాన్. అసలీ ఆలోచన ఎందుకు వచ్చింది? టమ్‌కీన్ చేసే పనేంటి!

 ఆయన మాటల్లోనే...

 

 మా నాన్న అబ్దుల్ ముఖీత్‌ఖాన్ యానిమల్ హజ్బెండరీ డిపార్ట్‌మెంట్‌లో వర్క్ చేసేవాడు. మనం చేసే పని పదిమందికి ఎలా ఉపయోగపడుతుందనే ఆలోచించేవాడెప్పుడూ. నా ఈ టమ్‌కీన్ సొల్యూషన్స్‌కి అదే ప్రేరణనిచ్చింది. నేను ఇంజనీరింగ్ చదవి, ఎంబీఏ చేశా. ఎనిమిదేళ్లు డెవలప్‌మెంట్ సెక్టార్ (ఓ ఎన్‌జీవో తరపున)లో పనిచేశా. నా జాబ్ అంతా రసూల్‌పురా బస్తీలోనే. ఎవరో ఇచ్చే ఫండ్స్ మీద ఆధారపడి పని ఉండేది. ఇట్లా ఇంకొకరు ఇచ్చే డబ్బుతో ఏం పనిచేస్తాం అనిపించేది. రానురాను ఆ భావన సీరియస్ అయి చివరకు ఆ ఉద్యోగం మానేశా.

 

 టమ్‌కీన్..

 అప్పుడే టమ్‌కీన్ నా సమస్యకు సొల్యూషన్‌గా దొరికింది. లైక్ మైండెడ్ పీపుల్ ఎనభైమంది కలిసి ‘టమ్‌కీన్ సొల్యూషన్’ పేరుతో సోషల్ ఎంటర్‌ప్రైజ్ గ్రూప్‌ని మొదలుపెట్టాం. ఒకరకంగా ఇది పెట్టడానికి ముస్లిం కమ్యూనిటీలో ఉన్న పావర్టీ కూడా కారణమే. అందరూ పేదరికం గురించి మాట్లాడతారు కానీ దాని పరిష్కారమే ఆలోచించరు. ఆ పాయింట్ మీదే దృష్టి పెడుతుంది టమ్‌కీన్. దీనికి పండుగ ఆచారాలను డయాస్‌గా మలచుకుంటున్నాం. ఇప్పుడు బక్రీద్ వస్తోంది.. ఆ రోజున ప్రతి ముస్లిం ఓ పొట్టేలును ఖుర్బానీ ఇవ్వడం ఆచారం. ఆ సంప్రదాయంతోనే ఊళ్లల్లో ఉన్న యువత ఉపాధికి ఒక మార్గం వేయాలనుకున్నాం.



ముందుగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లోని వెనకబడిన ప్రాంతాలన్నిటినీ తిరిగాం. ప్రతి ఊరును పరిశీలించాం. టమ్‌కీన్ తరపున ఆ ఊళ్లలో కొంత భూమిని లీజుకు తీసుకొని షీప్ ఫార్మింగ్‌కి అనుగుణంగా షెడ్లు వేస్తాం. ఆ ఊళ్లో కాస్త చదువుకొని ఉపాధిలేక ఖాళీగా ఉన్న పదిమంది యువకులను ఎంపిక చేసి గొర్రెల పెంపకంలో శిక్షణనిస్తాం. గొర్రెలను, వాటికి కావల్సిన దాణా, వ్యాక్సినేషన్, మెడికేషన్.. ఇట్లా అన్నీ  మేమే సమకూరుస్తాం. ఆ యువకులు దీని నిర్వహణ చూసుకోవాలి. అయితే ఈ ఉద్యోగంలో చేరడానికి ఓ అయిదు అంశాలు... వాల్యూస్ అండ్ సిస్టమ్, స్కిల్స్ అండ్ క్రాఫ్ట్స్, సెల్ఫ్ డెవలప్‌మెంట్, ఫ్యామిలీ డెవలప్‌మెంట్, కమ్యూనిటీ డెవలప్‌మెంట్‌కు కట్టుబడి ఉండాలి.

 

 ప్రాఫిట్ షేరింగ్..

 మా ఈ పొట్టేలు ఫారం నుంచి పొట్టేళ్లను అమ్మగా వచ్చిన డబ్బులో నలభై శాతం షేర్స్‌ని ఇందులో పనిచేసే యువతకు ఇస్తాం. ఇంకో ఇరవై శాతం గ్రామాల్లోని అడల్ట్ అండ్ చైల్డ్ ఎడ్యుకేషన్‌కి కేటాయిస్తాం. మిగిలిన నలభై శాతం మా సంస్థ అభివృద్ధికి ఖర్చు పెడ్తాం. ఈ ఆర్గనైజేషన్ మొదలై ఏడాదిన్నర అవుతోంది. ఇప్పుడిప్పుడే కాస్త నిలదొక్కుకుంటున్నాం. ఊళ్లలో యువతకు ఉపాధి కల్పించి తద్వారా ఇందులో భాగస్వాములను చేయడానికి ఈ బక్రీద్‌నే ప్రారంభంగా ఎంచుకున్నాం. ఇప్పుడు మహబూబ్‌నగర్ జిల్లాలోని ఉట్కూర్‌ని దత్తత తీసుకుంటున్నాం. అక్కడ ఫారం కోసం భూమి లీజుకి తీసుకున్నాం. అదే ప్రాంతంలోని పదిమంది యువకులకు మా దగ్గర పని ఇస్తున్నాం. దీనివల్ల వలసలనూ ఆపగలుగుతాం. ఆధ్యాత్మిక చింతనను ఉపాధి మార్గంగా మలుస్తున్నాం కాబట్టి ఇందులో కేవలం ముస్లింలకు మాత్రమే చోటు ఉంటుందనుకోవద్దు. కుల, మత భేదాల్లేవ్. కష్టపడి పనిచేయాలనుకునే తత్వం ఉన్న ప్రతి యువకుడికి టమ్‌కీన్ ఓ సొల్యూషన్.

Read latest Features News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top