ఐటమ్ గాళ్స్గా స్టార్ హీరోయిన్స్

ఛార్మీ-శృతి-హంస-అంజలీ - Sakshi


ఐటంసాంగ్స్ అంటే మాస్ ప్రేక్షకులకు మహా పిచ్చి. సినిమాలో ఓ ఐటంసాంగ్ ఉంటే ఆ ఊపేవేరు. టాలీవుడ్లో ఈ సంప్రదాయం ఎప్పటినుంచో  కొనసాగుతోంది. స్టార్ హీరోయిన్స్గా ఓ వెలుగు వెలుగుతున్న బ్యూటీస్ కూడా ఐటం గాళ్స్ గా అవతారమెత్తి    మతులుపోగొడుతున్నారు. కేక పుట్టిస్తున్నారు.  బాలీవుడ్లో  ట్రెండ్ ఎక్కువగా ఉండేది. అయితే ఇప్పుడు  టాలీవుడ్లో కూడా బాగా కనిపిస్తోంది. స్టార్ స్టేటస్ అనుభవిస్తోన్న హీరోయిన్స్ కూడా ఐటంసాంగ్స్కి ఓకే చెబుతున్నారు. ఓ స్పెషల్ సాంగ్లో మెరుపులా కనిపించి ప్రేక్షకులను మైమరపిస్తున్నారు. ఆ సినిమాకు సిరులు కురిపిస్తున్నారు. మిల్కీబ్యూటీ తమన్నా అల్లుడు శీను చిత్రంలో తళుక్కున మెరిసింది. నా ఇంటిపేరు సిల్కూ.. అంటూ మిల్కీ అందాలు ఒలకబోస్తూ.. ఆడియెన్స్ మదిలో అగ్గిపుట్టించింది



గబ్బర్ సింగ్ మూవీతో భాగ్యలక్ష్మిగా కనిపించిన శృతి హాసన్ ఒక్కదెబ్బతో లక్కీ హీరోయిన్గా మారిపోయింది. టాలీవుడ్ యంగ్ హీరోలతో చిందులేస్తూ ఫుల్ బిజీగా ఉంది. శృతి కూడా ఐటం స్టెప్పులతో మతి పోగొట్టడానికి రెడీ అవుతోంది. సూపర్ స్టార్ మహేష్, శ్రీను వైట్ల కాంబినేషన్లో రాబోతోన్న ఆగడు మూవీలో ఓ ఐటంసాంగ్లో చిందేయబోతోంది. కొంత కాలంగా  ఖాళీగా ఉన్న త్రిష  మళ్ళీ ఇప్పుడు బిజీ అయిపోతోంది. సత్యదేవ్ డైరెక్ట్ చేస్తోన్న ఓ సినిమాలో బాలయ్య సరసన హీరోయిన్గా కనిపించబోతోంది. తమిళ్లో మరో రెండు సినిమాల్లో ఛాన్స్ కొట్టేసినట్లు సమాచారం. అంతేకాకుండా ఏకంగా సూపర్ స్టార్ రజనీకాంత్తో ఐటం స్టెప్స్ వేసే ఆఫర్ని కొట్టేసిందని కోలీవుడ్ కోడై కూస్తోంది. లింగా మూవీలో త్రిష ఐటం బాంబ్గా మారి నిషా ఎక్కించబోతోందని అనుకుంటున్నారు.



ప్రస్తుతం ఫ్యామిలీ ఆడియెన్స్ కూడా ఐటం సాంగ్స్ని హాయిగా ఆస్వాదిస్తున్నారు. అందుకే హీరోయిన్లు కూడా  ఐటం సాంగులు చేస్తూ ఎంటర్‌ టైన్‌ చేస్తున్నారు. సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాతో అంజలి అగ్ర హీరోయిన్ల జాబితాలో చోటు సంపాదించుకుంది. ఎప్పుడూ పద్దతిగా ఉంటే ఏం బాగుంటుదనుకుందో ఏమో ఓ అదిరిపోయే ఐటమ్‌ సాంగ్‌తో హీటెక్కించింది. సింగం 2 మూవీలో ఓ హాట్‌ ఐటమ్‌ బ్యూటీగా కనిపించింది.



అనుష్క సూపర్ మూవీతో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది. గ్లామర్ డాల్గా గరంగరంగా కనిపించి. గుండెలు ఝల్లుమనిపించింది. ఆరుంధతి మూవీతో జేజెమ్మగా జేజేలు అందుకుంది. ప్రస్తుతం టాలీవుడ్ భారీ ప్రాజెక్టుల హీరోయిన్గా ఉన్న అనుష్క కూడా స్పెషల్ సాంగ్స్ చేస్తోంది. సూపర్ తర్వాత కొంత గ్యాప్ తీసుకుని కింగ్ నాగ్తో కేడీ మూవీలో స్పెషల్ ఐటం గా మురిపించింది. ఆ తరువాత ఈ బ్యూటీ స్టాలిన్లో మెగాస్టార్ చిరంజీవితో కాలు కదిపింది.



జ్యోతిలక్ష్మి, జయమాలిని... కాలంలో క్లబ్ సాంగ్స్ అంటే ఫ్యామిలీ ప్రేక్షకులు పెదవి విరిచే వారు. వాటిని అశ్లీల కేటగిరీ కింద లెక్కగట్టేవారు. రాను రాను ఐటం సాంగు తీరు మారడంతో పాటు ప్రేక్షకుల్లో ఆ సాంగ్స్‌పై అభిప్రాయం కూడా మారిపోయింది. శ్రీయ టాలీవుడ్‌లో నెంబర్‌ 1 హీరోయిన్గా వెలిగిపోయింది. దేవదాసు మూవీ నుంచి ఐటం సాంగ్స్ చేయడం మొదలుపెట్టింది. కందిరీగ, తులసి, మున్నా, పులి చిత్రాల్లో శ్రీయ ఐటం సాంగ్స్లో చిందులేసి ఆడియెన్స్కు కంటిమీద కునుకులేకుండా చేసింది



పాపం చార్మికి ఈ మధ్య ఆఫర్లు బాగా తగ్గాయి. తెలుగు, తమిళం, కన్నడం.. ఎక్కడా సరైన అవకాశాలు ఇవ్వకపోవడంతో ఐటం సాంగ్స్‌పై కన్నేసింది. బాలీవుడ్‌ భామలను స్ఫూర్తిగా తీసుకునిగాని ఐటం సాంగ్స్ తో అదరగొడుతోంది. ఆ మధ్య నాగార్జున డమరుకం సినిమాలో చాయ్‌ సాంగుతో  సక్కుబాయిగా షేక్‌ చేసింది. ఆ తరువాత రామ్‌ చరణ్‌ హీరోగా రూపొందిన నాయక్‌ సినిమాలో నెల్లూరే సాంగుతో ఛార్జీ కేక పుట్టించింది



ప్రస్తుతం తెలుగు, తమిళ భాషల్లో ప్రియమణి పరిస్థితి అంతంత మాత్రంగా ఉంది. చెన్నైఎక్స్‌ ప్రెస్‌ సినిమాలో చేసిన ఐటమ్‌ సాంగ్‌ తన కెరీర్ను మళ్లీ మార్చేస్తుందని ఆశించింది. ఆ ఐటం కోసం ప్రియమణి పడ్డ  ప్రయాసలు అన్నీ ఇన్నీ కావు. ఆ పాటకి ఒక్క రూపాయి కూడా రెమ్యునిరేషన్ తీసుకోలేదట.షారూఖ్  సినిమా కాబట్టి అందుకు తగ్గ స్థాయిలో గుర్తింపు లభిస్తుందని ప్రియమణి ఆశలు పెట్టుకున్నా అంతగా ఫలితం దక్కలేదు పాపం.



కాలంతో పాటు కొన్ని అభిప్రాయలు కూడా మారుతూ ఉంటాయి. ఐటంసాంగ్స్ కు అది బాగా వర్తిస్తుంది. ఇప్పుడు ఐటంసాంగ్స్ కేవలం శృంగార ప్రియుల్ని మాత్రమే అలరించటంలేదు. చిన్న పిల్లలు కూడా కెవ్వుకేక అంటూ స్టెప్పులేస్తున్నారు. అందుకే టాలీవుడ్ టాప్ హీరోయిన్లు ఐటం చిందులేయటానికి ఆలోచించటంలేదు. పాలతరగలా ఉంటే పార్వతీ మెల్టన్ కూడా పువ్వాయ్.. పువ్వాయ్.. ఐటంబాట పట్టింది



హంసానందిని ప్రతిదినం నీ దర్శనం.. అంటూ అనుమానాస్పదం మూవీతో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత ఒకట్రెండు సినిమాలతో తెరమరుగైంది. మళ్లీ కొంత గ్యాప్‌ తర్వాత మిర్చిలో టైటిల్‌ సాంగ్‌ కోసం ఐటం గాళ్‌గా మారింది.  భాయ్‌, అత్తారింటికి దారేది సినిమాల్లో స్పెషల్‌ సాంగ్స్‌తో సందడి చేసింది. హంసా ఐటం చిందులేస్తే ఆ మూవీ హిట్టే అన్న టాక్ కూడా వచ్చేసింది. లక్కీ ఐటంగాళ్గా హంసా నందిని ఇప్పుడు ఓ వెలుగు వెలుగుతోంది.



తెలుగుతెరపై ఐటంసాంగ్స్ ఆటం బాంబుల్లా పేలుతున్నాయి. అదిరిపోయో స్టెప్స్ తో అందాల భామలు బ్యాంక్ బ్యాలెన్సు నింపుకుంటున్నారు. కాంచమాల కేబుల్‌ టివీ అనే మూవీ ద్వారా తెలుగు తెరకు పరిచయమయిన లక్ష్మీరాయ్‌ కూడా ఐటం సాంగ్స్ వైపే టర్నింగ్ ఇచ్చుకుంది. ఎన్ని అవకాశాలు వచ్చినా హీరోయిన్గా బ్రేక్ రాకపోవటంతో చేసేదేమీలేక లక్ష్మీరాయ్ ఐటం అవతారమెత్తింది.



7/జి బృందావన కాలనీ చిత్రంతో తెలుగు ప్రేక్షకుల్ని ఆకట్టుకున్న సోనియా అగర్వాల్‌ గుర్తుండే ఉంటుంది. ఆ తరవాత ఆమె కెరీర్‌ సజావుగా సాగలేదు. సెకండ్ ఇన్నింగ్స్లో ప్రత్యేక గీతాలవైపు దృష్టి మళ్లించింది. అంజి శ్రీను దర్శకత్వం వహించిన అమ్మా నాన్న ఊరెళితే అనే యూత్ ఫుల్ మూవీలో ఐటంగాళ్ గా కనిపించింది. కానీ ఆ మూవీ బాక్సాఫీసు వద్ద బోల్తా కొట్టింది.



ఐటం మసాలా ఘాటు తగలకపోతే ఆ సినిమాలో టేస్టే ఉండదు. సగటు ప్రేక్షకుడు ఇప్పుడు ఇలానే ఆలోచిస్తున్నాడు. సినిమా విజయంలో ఐటంసాంగ్స్కీ రోల్స్ పోషిస్తున్నాయి. బాలీవుడ్ నుంచి టాలీవుడ్కి ఇంపోర్టయింది సమీరారెడ్డి.  జై చిరంజీవ మూవీలో మెగాస్టార్ తో కలిసి నటించింది. యంగ్ టైగర్ ఎన్టీఆర్తో కూడా జతకట్టింది. చాలా గ్యాప్ తీసుకుని కృష్ణంవందే జగద్గురుమ్ మూవీతో ఐటంగాళ్గా రీఎంట్రీ ఇచ్చింది.





సినిమాలో అదిరిపోయో ఐటంసాంగ్ ఉంటే చాలు.. విపరీతమైన హైప్ క్రియోటయి కూర్చుంటుంది. ఆ మసాలా పాటలకున్న పవర్ అలాంటిది. ఐశ్వర్యారాయ్ రాయ్ పోలికలుండే స్నేహా ఉల్లాల్  తన అల్టిమేట్ అందాలతో మతి పోగొడుతూ ఉంటుంది. చాలా తెలుగు సినిమాల్లో హీరోయిన్ ఛాన్సులు కొట్టేసింది. చివరికి బాలయ్యతో సింహా మూవీ చేసినా కలిసిరాలేదు. స్నేహ కూడా ఐటం సాంగ్స్ వైపే అడుగేసింది.



ఇప్పుడు ఐటం సాంగ్స్ కోసం  కోట్ల ఖర్చుపెడుతున్నారు. అదే రేంజ్లో కాసులపంట పండిస్తోన్న ఈ ఐటం సాంగ్స్ ట్రెండ్ 70 వ దశకంలోనే ప్రారంభమైంది. క్లబ్ సాంగ్స్తో స్టార్టయిన ఈ ట్రెండ్ ఇప్పుడు పబ్ సాంగ్స్గా పరిణితి చెందింది. సీనియర్ హీరోయిన్లకు  కూడా ఐటంపాటలు ఆయుధాలుగా మారాయి. టాలీవుడ్ టాప్ హీరోలతో సూపర్ హిట్స్ కొట్టింది రమ్యకృష్ణ. కెరీర్ డౌన్ ఫాల్లో పడ్డాక కూడా రమ్య స్క్రీన్ని వదిలిపెట్టలేదు. తెలుగు యంగ్ హీరోలతో ఐటం స్టెప్పులు వెయ్యటానకి ఏమాత్రం వెనుకాడలేదు. విందుభోజనంలా ఉండే  స్పెషల్ చిందుల్ని చూసేందుకు ప్రేక్షకులు తెగ  ఆరాటపడుతున్నారు. అందుకే స్టార్ హీరోయిన్లు సైతం ఐటంగాళ్స్గా మారిపోతున్నారు.

Read latest Features News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top