నా కథ కాదు...: కరీనా కపూర్

నా కథ కాదు...: కరీనా కపూర్


కండల వీరుడు సల్మాన్ ఖాన్‌తో కలసి తాను నటిస్తున్న ‘బజరంగీ భాయీజాన్’ కథకు తన జీవితానికి ఎలాంటి సంబంధం లేదని కరీనా కపూర్ చెబుతోంది. ముస్లిం అబ్బాయి, బ్రాహ్మణ అమ్మాయి మధ్య ప్రేమ కథ ఆధారంగా రూపొందుతున్న ఈ చిత్రాన్ని సల్మాన్ ఖాన్ తన సొంత బ్యానర్ ‘సల్మాన్‌ఖాన్ వెంచర్స్’ కింద నిర్మిస్తున్నాడు. సైఫ్ అలీఖాన్‌తో తన ప్రేమగాథ ఆధారంగానే ఈ చిత్రం రూపొందుతోందన్న వదంతులను కరీనా తోసిపుచ్చింది. అయితే, ఇదొక చక్కని ప్రేమకథా చిత్రం అని చెబుతోంది. ఈ చిత్రం వచ్చే ఏడాది ఈద్ పర్వదినం సందర్భంగా విడుదల కానుంది.

 

 బోనీ తదుపరి చిత్రంలో శ్రీదేవి

 తన భర్త బోనీ కపూర్ నిర్మించనున్న తదుపరి చిత్రంలో శ్రీదేవి నటించనుంది. సుదీర్ఘ విరామం తర్వాత ‘ఇంగ్లిష్ వింగ్లిష్’తో తెరపై తళుక్కుమన్న ఈ అతిలోక సుందరి ప్రస్తుతం చింబు దేవన్ దర్శకత్వంలో రూపొందుతున్న తమిళ చిత్రంలో నటిస్తోంది. తమిళ హీరో విజయ్, కన్నడ హీరో సుదీప్ ప్రధాన పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రం షూటింగ్ పూర్తయ్యాక బోనీ చిత్రం షూటింగ్ ప్రారంభం కానుంది. ఇందులో ఒక పద్దెనిమిదేళ్ల అమ్మాయికి సవతితల్లి పాత్రలో శ్రీదేవి కనిపించనుంది.

 

 అజయ్ దేవ్‌గన్ చిత్రంలో కాజోల్


 చాలాకాలంగా తెరమరుగైన కాజోల్, త్వరలోనే తన భర్త అజయ్ దేవ్‌గన్ నిర్మించనున్న చిత్రంతో తెరపైకి రానుంది. ‘ఎండెమాల్’ సంస్థ సహ నిర్మాణంతో అజయ్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రానికి రామ్ మాధ్వానీ దర్శకత్వం వహించనున్నాడు. రామ్ మాధ్వానీ తొలుత అమీర్ ఖాన్‌తో ఈ చిత్రాన్ని తీయాలనుకున్నాడు.   అమీర్ నిర్ణయం జాప్యం కావడంతో అజయ్‌కు కథ వినిపించాడు. ఈ స్క్రిప్ట్ అజయ్‌కు నచ్చడంతో నిర్మాణానికి సిద్ధపడ్డాడు. ఇందులో కాజోల్ ప్రధాన పాత్ర పోషించనుంది.

Read latest Features News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top