ప్రేమఖైదీ

ప్రేమఖైదీ


‘సదా మీ సేవలో..’ అంటూ సాక్షి సిటీప్లస్ ఇచ్చిన పిలుపునకు స్వచ్ఛంద సంస్థల నుంచి అనూహ్య స్పందన లభిస్తోంది. సిటీ జీన్స్‌లోనే చారిటీ ఉందంటూ.. నగరం వేదికగా తాము నిర్వహిస్తున్న సామాజిక సేవా కార్యక్రమాల వివరాలను పంపిస్తున్నాయి. ఈ వరుసలో ప్రచురితమవుతున్న 14వ కథనమిది...

 

 ‘మేం నేరం చేసి ఇక్కడ శిక్ష అనుభవిస్తున్నాం. కానీ ఏ పాపం పుణ్యం తెలియని మా పిల్లలు మాకన్నా పెద్ద శిక్షను అనుభవిచడం ఎంత అన్యాయం సార్. దానికి కారణం మేమే.. అందుకే చేతులెత్తి మొక్కుతాం మా పిల్లలు అనాథలు కాకుండా కాపాడండి’ అంటూ జైళ్లలోని జీవితఖైదీలు ప్రేమ్‌రాజ్ చేతులు పట్టుకున్నప్పుడు పుట్టింది ఎవేక్ ‘ఓ’ వరల్డ్. తండ్రి చేతిలో కడతేరిన తల్లి జ్ఞాపకాల్లో బాధపడుతున్న పసి హృదయాలు కొన్నయితే, ఓ అమ్మ ఆవేశానికి బలైన నాన్నను గుర్తు చేసుకునే చిన్నారులు ఇంకొందరు. వీరి జీవితాలను అంధకారంలోకి నెట్టేసిన ఖైదీల పాలిట, వారి పిల్లల పాలిట ఎవేక్ ‘ఓ’ వరల్డ్ ఓ వరంలా మారింది.

 

 తహసీల్దార్ కార్యాలయంలో పని చేసే ప్రేమ్‌రాజ్ తరచూ జైళ్లకు వెళ్లి ఖైదీలకు మోరల్ లెక్చర్స్ ఇస్తుండేవారు. ఆ సమయంలో కొందరు ఖైదీలు తమ పిల్లల దయనీయ స్థితిని ప్రేమ్‌రాజ్‌కు చెప్పుకుని బాధపడ్డారు. అక్కడున్న ఖైదీల్లో పేదవారి చిరునామాలు కనుక్కున్న ఆయన వారిళ్లకు వెళ్లారు. ఖైదీల పిల్లలకు నేనున్నానని భరోసా ఇచ్చారు. మౌలాలి హౌసింగ్ బోర్డ్ ఏరియాలో ఓ ఇంటిని అద్దెకు తీసుకుని వారికి ఆశ్రయం కల్పించారు. 2008లో నెలకొల్పిన ఈ సంస్థలో ప్రస్తుతం 40 మంది పిల్లలున్నారు.

 

 పగ చూరకుండా..

 ‘తల్లి లేదు.. తండ్రి హంతకుడు! అంటూ వీరిని అయినవారు కూడా ఆదరించరు. అనాథల్లో బోలెడన్ని రకాలుంటారు. ఇలాంటి వారిని ఆదరించడానికి అందరూ ముందుకురారు. అటువంటి వారిని ఆదరించడం ఒక్కటే నా లక్ష్యం కాదు. వారి మనసులను మార్చాలి. కళ్లముందే తల్లిని చంపిన తండ్రిపై ఓ పసిహృదయంలో పేరుకుపోయిన పగను చల్లార్చాలి. ఆ మనసులో ప్రేమను నింపాలి’ అని చెబుతారు ప్రేమ్‌రాజ్. ‘ఎవేక్ ‘ఓ’ వరల్డ్.. రెండు ఇంగ్లిష్ పదాల మధ్య తెలుగు అక్షరం. వినడానికి కొత్తగా ఉన్నా.. మేలుకో ఓ ప్రపంచమా అనే పిలుపునివ్వడంలో భాగంగా ఇది పుట్టింది’ అని అంటారు ప్రేమ్.

 

 గతం మరచేలా..

 ఎవేక్ ‘ఓ’ వరల్డ్‌లో ఆశ్రయం పొందుతున్న పిల్లలు తెలుగు రాష్ట్రాల్లోని పది జిల్లాలకు చెందిన వారున్నారు. హైదరాబాద్, రంగారెడ్డి జిల్లా, వరంగల్, ఆదిలాబాద్, కరీంనగర్, మహబూబ్‌నగర్, తూర్పుగోదావరి, కర్నూలు, వైఎస్‌ఆర్ కడప, అనంతపురం జిల్లాలకు చెందిన చిన్నారులంతా ఒకే కుటుంబంలోని సభ్యులుగా మారిపోయారు. ‘తల్లిదండ్రులు కోల్పోయిన పిల్లల పరిస్థితి ఒకలా ఉంటే.. వీరిది మరోలా ఉంటుంది. తల్లిని చంపిన తండ్రి ఒకరైతే, తండ్రిని హత్య చేసిన తల్లి ఇంకొకరు.. అందరి గతాలు ఇవే. ఈ భయానక దృశ్యాలు చూసిన ఆ చిన్నారి హృదయాలు తేరుకోవడానికి ఏళ్లు పడుతుంది. దూరమైన వారిపై ఆవేదన.. దూరం చేసిన వారిపై ఆవేశం.. ఈ రెండు ఆ పసి మనసులను కుమిలిపోయేలా చేస్తుంటాయి.



తల్లిదండ్రుల ప్రేమ ఉంటే పేదరికంలో ఉన్నా.. పసిమొగ్గలు ఎప్పుడూ వికసించే ఉంటాయి. ఆ ప్రేమ కరువైన వీరికి గతం పెను భూతంలా వెంటాడుతూనే ఉంటుంది. అలాంటి వాతావరణం నుంచి వీరిని బయటకు తీసుకురావడానికి చాలా సమయం పట్టింది’ అంటూ పిల్లల గత జీవితాల ప్రభావాలను గుర్తుచేసుకున్నారు ప్రేమ్‌రాజ్. తల్లిదండ్రుల పోట్లాటలు చిన్నారుల మానసిక ప్రవర్తనపై తీవ్రమైన ప్రభావం చూపుతాయని మానసిక వైద్యులు చెబుతూనే ఉంటారు. అలాంటిది హత్య వంటి సంఘటనలు కంటపడితే వారి పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించుకోవచ్చు. అక్కున చేర్చుకున్న పిల్లలకు ప్రేమ్‌రాజ్ ప్రత్యేక కౌన్సెలింగ్‌లు ఇవ్వడం, చదివించడం, భవిష్యత్తుపై భరోసా కల్పించడం వంటివి చేస్తున్నారు.

 

 ఎదురుచూసేలా..

 ‘నా జీవితంలో నాన్న ముఖం చూడను, అసలు వాడు మనిషే కాదు...’అంటూ ఆగ్రహంతో ఊగిపోయే రాధిక ఇప్పుడు తండ్రిని పలకరించడానికి ప్రతి నెలా జైలుకి వెళుతుంది. తండ్రి ఎప్పుడు బయటికి వస్తాడా.. తనతో ఎప్పుడు కలసి ఉంటాడా అని కలలుకంటోంది. ‘పగ, కోపం మనిషిని పైకి ఎదగనీయవు. తల్లిని చంపిన తండ్రి మంచివాడని అర్థం కాదు. తండ్రిపై పగ పెంచుకోవడం ఈ పిల్లల బంగారు భవిష్యత్తుకు ప్రమాదం. అందుకే వీరిని ప్రతి నెలా వారి తండ్రి ఉన్న జైలుకి తీసుకెళ్లి కలిపిస్తుంటాను. అలాంటి సమయంలో పిల్లల స్పందనకంటే వారి తల్లి లేక తండ్రి ఆనందం మాటల్లో చెప్పలేం’ అని చెప్పే ప్రేమ్‌రాజ్ మాటలు వినడానికి సులువుగా ఉన్నా.. వారిని ప్రతి నెలా జైళ్లకి తీసుకెళ్లడం పెద్ద పనే. ఎందుకంటే.. చర్లపల్లి జైల్లో 13మంది, వరంగల్ సెంట్రల్ జైల్లో 12 మంది, కడప జైల్లో ఏడుగురు, రాజమండ్రిలో ముగ్గురు, చంచల్‌గూడలో ఐదుగురు మహిళా ఖైదీలున్నారు. వీరందరి దగ్గరికీ పిల్లల్ని తీసుకెళ్లి చూపించడానికి బోలెడంత ఓపికుండాలి.

 

 ఆ నలుగురు...

 ఈ హోంలో ఉంటున్న శ్రీరామ్ ఇంటర్ చదువుతున్నాడు. ఆ అబ్బాయిని పలకరిస్తే తల్లిని పోగొట్టుకున్న పిల్లల జీవితం ఎంత దుర్భరంగా ఉంటుందో అర్థమవుతుంది. ‘మాది ఆదిలాబాద్ జిల్లాలో ఓ పల్లెటూరు. అమ్మానాన్న ఎప్పడూ గొడవపడేవారు. ఒకరోజు నాన్న అమ్మను చంపేశాడు. నేను, ఇద్దరు తమ్ముళ్లు, చెల్లి అనాథలమయ్యాం. అమ్మను అన్యాయంగా చంపేశాడు నాన్న. గుర్తొచ్చినపుడల్లా ఏడుపొస్తుంటుంది. నాన్న ప్రస్తుతం వరంగల్ జైల్లో ఉన్నాడు. ఎవేక్ ‘ఓ’ వరల్డ్ లేకపోతే మేం నలుగురం చదువుకునేవారం కాదు. అమ్మ ఎప్పుడూ మమ్మల్ని బాగా చదివించాలనేది. ప్రస్తుతం ప్రేమ్‌రాజ్ సారే మాకు అమ్మానాన్నా’ అని చెప్పాడు శ్రీరాం.

 

 సదా మీ సేవలో..

 చీకటి వెలుగుల జీవితంలో అందరూ కోరుకునేది వెలుగే. ఆ జిలుగు నీడలో పదివుందినీ ఆహ్వానించే వారు కొందరే ఉంటారు. అలాంటి వారి గురించి పదివుందికీ తెలిస్తే.. వురెందరి హృదయూల్లోనో సేవాభావం వెలుగు చూస్తుంది. మీకు స్ఫూర్తిగా స్టార్‌డమ్‌కి సేవను జోడించిన సినీ నటి సవుంత ‘సిటీప్లస్’లో వెలుగుచూసే కథనాలకు బాసటగా నిలుస్తానంటోంది. మీరు చేయూల్సిందల్లా.. ఓ సంస్థ ద్వారా, వ్యక్తిగతంగా మీరు చేస్తున్న సేవల వివరాలను వూకు మెరుుల్ చేయుండి. వాటిని ‘సిటీప్లస్’లో ప్రచురిస్తాం. ఇలా ఉత్తమ సేవలు అందిస్తూ సమాజ హితానికి పాటుపడుతున్న ‘సేవకుల’ను సవుంత పలకరిస్తారు. ఇంకా మిమ్మల్ని అభినందించడానికి వురెందరో సెలబ్రిటీలు వుుందుకు రానున్నారు. ఇంకెందుకు ఆలస్యం మీరు చేస్తున్న చారిటీ వివరాలు మెరుుల్ టు.. sakshicityplus@ gmail.com

 ప్రజెంటేషన్: భువనేశ్వరి

 bhuvanakalidindi@gmail.com

Read latest Features News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top