రిథమ్ ఆఫ్ లైఫ్


 దిల్‌సుఖ్‌నగర్.. ఫిట్‌నెస్ నైన్ సెంటర్.. ఉదయం

 పదకొండు గంటలు..

 25 నుంచి 45 ఏళ్లలోపు గృహిణులు హిందీ, ఇంగ్లిష్, తెలుగు పాటలతో జుంబా డ్యాన్స్‌ను అలవోకగా చేస్తున్నారు. అందులో ఓ అయిదుగురు ఇరవై ఏళ్లలోపు వాళ్లే. డ్యాన్స్‌లో పెద్దాళ్లు ఆ పిల్లలతో పోటీ పడుతున్నట్టుగా ఉన్నట్టుంది. విమెన్స్ డే కోసం సెలక్ట్ చేసుకున్న పాటల మీద డ్యాన్స్ ప్రాక్టీస్ చేస్తున్నారు. అయిదారు పాటలకు ఆపకుండా స్టెప్స్ వేశాక సేదతీరారు. ఫిట్‌నెస్‌పై వాళ్లకున్న తపన, ఆరోగ్యం మీద ఆరాటం కనిపించాయి ఆ డ్యాన్స్‌లో. వీళ్లలో చాలామందికి ఓ యేడాది కిందటి వరకూ విమెన్స్ డేని టీవీల్లో, పత్రికల్లో చూసి, చదివి ఓహో అనుకోవడమే తప్ప... ప్రత్యక్షంగా పాల్గొన్న సందర్భాలు లేవు. ఇంకొంతమందికి దాని ప్రాధాన్యం తెలిసినా వేడుకలా చేసుకొనే అవకాశం రాలేదు. కానీ గృహిణులకు ఆరోగ్యం ఎంత ఇంపార్టెంటో విమెన్స్ డే వేదికగా తెలియజెప్పాలనే సెలబ్రేషన్స్‌లో జుంబా డ్యాన్స్‌ను చేర్చారు. దాని వెనక ఈ టీమ్ లీడర్, ట్రైనర్ సంతోషి ఉన్నారు.

 ఓ అయిదారేళ్ల కిందట..

 ‘నేను 80 కిలోల బరువు ఉండేదాన్ని. ఏ పనిచేయాలన్నా ఆయాసంతో ఇబ్బంది.. పైగా ఆ వెయిట్‌తో అనారోగ్య సమస్యలు కూడా! నా అవస్థ చూసి మా ఇరుగుపొరుగు యోగాకో... జిమ్‌కో వెళ్లొచ్చు కదా’ అని సలహా ఇచ్చేవారు. నాకూ అది కరెక్టే అనిపించి జిమ్‌లో జాయిన్ అయ్యా. కొద్ది రోజులకే నాలో చాలా చేంజ్ వచ్చింది. ఇరవైకిలోల బరువు తగ్గాను. మునుపటి ఉత్సాహం వచ్చింది. జుంబా నేర్చుకున్నాను. ఇంకా నాజూగ్గా తయారయ్యాను. నా వర్కవుట్స్ చూసి మాస్టర్.. ‘జుంబాలో ఉమన్ ట్రైనర్స్ అంతగా లేరు. నువ్వు స్టార్ట్ చేయొచ్చు కదా’ అని సజెస్ట్ చేయడమే కాదు ఎంకరేజ్ కూడా చేశారు. దాంతో యేడాదిన్నర కిందట జుంబా ట్రైనింగ్ స్టార్ట్ చేశాను. డెమో ఇచ్చిన మర్నాడే క్లాసంతా నిండిపోయింది. అందరూ గృహిణులే! రకరకాల ఏజ్ గ్రూప్ వాళ్లు. నాకు ఆశ్చర్యమనిపించింది. ఇంత ఇంట్రెస్ట్ ఉండి ఇన్నాళ్లూ ఎందుకు నేర్చుకోకుండా ఉండిపోయారని అడిగా. అందరి దగ్గర్నుంచి ఒకటే సమాధానం ‘ట్రాక్‌పాంట్స్ వేసుకొని మేల్ ట్రైనర్స్ దగ్గర జుంబా చేయాలంటే.. ఇబ్బంది అనిపించి’ అని. అప్పుడర్థమైంది నాకు.. ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేసుకోవాలని ఏ గృహిణీకీ లేదు. టైమ్ లేదనే సాకు కోసమూ చూడ్డం లేదు. కేవలం సరైన ట్రైనర్ దొరకకే ఫిట్‌నెస్ గురించి ఆలోచించలేదని.

 ఇప్పుడు నా దగ్గర మూడు బ్యాచ్‌లు నడుస్తున్న్నాయ్. ఏడాదిగా అందరూ రెగ్యులర్‌గా అటెండ్ అవుతున్నారు. ఎంత బిజీగా ఉన్నా ఓ గంట వాళ్ల కోసం జుంబాకి వస్తున్నారు. వాళ్ల ఆసక్తి చూశాకే నాకనిపించింది.. ఈ గ్రూప్‌తో విమెన్స్ డేకి ఏదైనా సెలబ్రేషన్ చేస్తే బాగుంటుంది కదా అని. మేం చేసే పనినే కాన్సెప్ట్‌గా తీసుకుంటే సరి అనుకున్నా. దానికి మా టీమే

 ఇన్స్‌పిరేషన్. ఎందుకంటే నా దగ్గర ముందు 30 నుంచి 40 ఏళ్ల స్త్రీలే జాయిన్ అయ్యారు. వాళ్లను చూసి కాలేజ్ గర్ల్స్, పాతికేళ్లలోపున్న గృహిణులు రావడం మొదలుపెట్టారు. మహిళలకు ఫిట్‌నెస్ తప్పనిసరి అని క్యాంపేన్ చేయడానికి ఇంతకన్నా మంచి ఇన్‌స్పిరేషన్ ఇంకేముంటుంది? టీమ్ అందరితో చర్చించా. అందరూ ఓకే అన్నారు. ఒక్కో ఏజ్‌గ్రూప్‌కి నచ్చిన పాటలను సెలక్ట్ చేసుకున్నాం. ఇందులో హిందీ, ఇంగ్లీష్, తెలుగు అన్ని సాంగ్స్ ఉన్నాయి. వాటికి జుంబాను కంపోజ్ చేసుకొని 25 రోజులుగా ప్రాక్టీస్ చేస్తున్నాం. ఆ రోజుకి మాకు ఓ థీమ్ ఉంది. అందరం ట్రెడిషనల్‌వేర్ అయిన శారీస్ కట్టుకుని, నగలు వేసుకొని వస్తాం. అట్లాగే డాన్స్ చేస్తాం’ అని వివరించారు సంతోషి.

 ఎక్సర్‌సైజ్ కన్నా

 ఎంజాయ్‌మెంట్..

 ‘కిందటేడాది విమెన్స్ డేని మిస్ అయ్యాం. ఈసారి గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసుకుందామనుకుంటున్నాం. ఇదైతే అచ్చంగా ఆడవాళ్లు సాధించుకున్న కొన్ని విజయాలకు గుర్తు కదా. కనీసం ఓ నాలుగు గంటల పాటు ఇక్కడే ‘ఫిట్‌నెస్ 9’ డయాస్‌గా సెలబ్రేట్ చేసుకుంటున్నాం. ఇది మా ప్రపంచం. ఆ రోజు మా స్పెషల్ డే! కాబట్టి మజాతో పాటు హెల్త్‌పై ప్రచారమూ ఉంటుంది’ అని చెప్తుంది జుంబా టీమ్‌లో మెంబరైన ముప్పయి అయిదేళ్ల శుచిత. ‘యేడాది నుంచి జుంబా నేర్చుకుంటున్నాను. అంతకుముందున్న వెయిట్‌లో మూడొంతులు తగ్గాను. జుంబాలో ఎక్సర్‌సైజ్ కన్నా ఎంజాయ్‌మెంట్ ఎక్కువ. గృహిణులంతా కలిసి డ్యాన్స్ చేయడం మానసిక ఉల్లాసాన్నిస్తోంది. దాంతో వెయిట్ లాస్ అవడమే కాక ఆరోగ్యమూ బాగుంటోంది. ఇన్‌ఫీరియారిటీ పోయి కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెరిగాయి. మమ్మల్ని చూసి జెలస్ ఫీలయి ‘ఆంటీ మేమూ మీ డ్యాన్స్ క్లాస్‌కొస్తామ’ని వచ్చి చేరిన పిల్లలున్నారు’ అని 42 ఏళ్ల అర్చన చెప్తుంటే... పక్కనే ఉన్న బీటెక్ గ్రాడ్యుయేట్ సాహితీ ‘ఇది నిజం. మేమంతా ఈ ఆంటీలను చూసి ఎంతో ఇన్‌స్పైర్ అవుతున్నాం. వీళ్లంతా ఏజ్‌ని మరిచిపోయి మాతో స్టెప్స్ వేస్తుంటే వండర్ అనిపిస్తోంది. ఫ్యాషన్‌లోనూ మమ్మల్ని బీట్ చేస్తున్నారు’ అని అంటోంది. ‘మార్కెట్‌లోకి ఏ కొత్త ప్రొడక్ట్ వచ్చింది? ఎడ్యుకేషన్‌లో ఏ కోర్స్‌కి డిమాండ్ ఉంది? సినిమాలతోపాటు అన్ని విషయాల్లో పిల్లల ద్వారా అప్‌డేట్ అవుతున్నాం’ అని అన్నారు 47 ఏళ్ల కవితారావు.

 మా లోకం.. మా ఇష్టం..

 ‘ఇక్కడికి వచ్చాక హ్యాపీగా ఉంటున్నామనేది హండ్రెడ్ పర్సెంట్ నిజం. ఈ డ్యాన్స్ ఏరియా మా లోకం.

 పిల్లలతో పిల్లల్లా కలిసిపోయి ఆడతాం.. పాడుతాం. మమ్మల్ని ఎవరూ అబ్జర్వ్ చేయట్లేదన్న ఫీలింగ్ ఎంతో కాన్ఫిడెన్స్‌నిస్తుంది. అదే మా ఆరోగ్యాన్ని పెంచుతుంది. ఆ ఉత్సాహంతోనే ఇంటికెళ్తాం. రెట్టింపు శక్తితో పనిచేస్తాం. రోజంతా చురుగ్గా ఉంటాం. ఇలాంటప్పుడే ఫిట్‌నెస్ ఎంతో ముఖ్యం అనిపిస్తుంది. దీన్నే మాలాంటి చాలామంది హౌజ్‌వైవ్స్‌కి తెలియజెప్పాలనుకుంటున్నాం’ అని అంటున్నారు 34 ఏళ్ల దీక్ష.

 వీళ్లంతా రోజులో ఓ గంట సమయాన్ని వాళ్లకోసం కేటాయించుకుంటున్నారు. దానిద్వారా వచ్చే సంతోషాన్ని, ఆరోగ్యాన్ని మిగిలిన 23 గంటలు కుటుంబానికి పంచుతున్నారు. దాంతో ఇంటినీ ఆనందమయం చేసుకుంటున్నారు. ఈ మెసేజ్‌నే మహిళలందరికీ పంచడానికి అడుగులేయనున్నారు. ఆల్ ది బెస్ట్ ఫర్ దట్ డ్యాన్స్ షో!

 

Read latest Features News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Tags: 



 

Read also in:
Back to Top