చక్ర బంధంలో ఆర్టీఐ చట్టం

దిలీప్ రెడ్డి - Sakshi


 సమకాలీనం



 ఎంతో విప్లవాత్మకమైన సమాచార హక్కు చట్టానికి అన్నివైపుల నుంచీ ప్రమాదం ముంచుకొచ్చింది. రాజకీయ పార్టీలు, అధికార గణం, స్ఫూర్తి కొరవడ్డ కమిషనర్లు, ప్రభుత్వాలు సహా అంతా దాని అమలుకు గండికొడుతున్నారు. పార్టీలు కూడా పౌర సంస్థలేనని, అవి పౌరులు కోరే సమాచారం ఇచ్చి తీరాల్సిందేనని ఆదేశించినా బేఖాతరు చేయడం, కేంద్రం వాటికి దన్నుగా నిలవడం ఆందోళనకరం. ఏడు నెలలుగా ముఖ్య సమాచార కమిషనర్‌ను నియమించకపోవడమే కేంద్ర ప్రతికూల వైఖరికి నిదర్శనం.

 

 సమాచార హక్కు చట్టాన్ని సజీవంగా సమాధి చేసే యత్నాలు ముమ్మరంగా సాగుతున్నాయి. విప్లవాత్మకమైన ఈ చట్టాన్ని నీరుగార్చే యత్నం అన్నివైపుల నుంచీ జరగడం ఆందోళనకరం. ఇటు ప్రధాన రాజకీయ పక్షాలు, ప్రభుత్వ పెద్దల నుంచి అటు ముఖ్య అధికార యంత్రాంగం, స్ఫూర్తి కొరవడ్డ కమిషన్ల వరకు ఏక కాలంలో చట్టం అమలును గండికొట్టే చర్యలకు పాల్పడుతున్నారు. చట్టం అమల్లోకి వచ్చిన దశాబ్దికే ‘ఇలా అయితే, ఈ చట్టం మనుగడ సాగిం చేనా?’ అని సందేహం తలెత్తుతోంది. పాలనా వ్యవస్థల్లో పారదర్శకతను సాధించడం ద్వారా సామాన్యునికి ప్రజాస్వామ్య ఫలాలను అందించే లక్ష్యం తో తెచ్చిన ఈ చట్టం అమలుకు తిలోదకాలిచ్చే  వ్యవహార శైలి కేంద్ర ప్రభుత్వ నిర్వాకంలో కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. ‘ఇంత గొప్ప చట్టం మేమే తెచ్చాం’ అని జబ్బలు చరుచుకున్న యూపీయే ప్రభుత్వమే చివరి రోజుల్లో ఆర్టీఐ అమలు పట్ల నిర్లక్ష్యం వహించింది. ఈ చట్టంతో వచ్చిన పారదర్శకత వల్ల రాజకీయంగా ఎంతో లబ్ధి పొందిన నాటి విపక్ష ఎన్డీఏ, ఇప్పుడు పాలక పక్షంగా సహచట్టాన్ని నిర్వీర్యం చేసే బాధ్యత తీసుకుంది. ఏడు నెలలుగా ముఖ్య సమాచార కమిషనర్‌ను నియమించకుండా తాత్సారం చేస్తోంది. ఈ చట్టం అమలును పర్యవేక్షిస్తూ, దేశవ్యాప్తంగా సరైన సంకేతాలివ్వాల్సిన కేంద్ర సమాచార కమిషన్(సీఐసీ)నే దెబ్బతీసే చర్యలకు కేంద్రం తలపడుతోంది. ఈ చట్టపరిధిలో సీఐసీ ఫుల్‌బెంచ్ ఇచ్చిన ఉత్తర్వుల్ని ఇటు పాటించకుండా ఉల్లం ఘిస్తూ, అటు న్యాయస్థానంలో సవాలైనా చేయకుండా ప్రధాన రాజకీయ పక్షాలన్నీ నిస్సిగ్గుగా వ్యవహరిస్తున్నాయి. కేంద్ర కమిషన్ తామిచ్చిన ఉత్త ర్వుల్ని తామే అమలు చేయజాలమని చేతులెత్తేసి, కేంద్ర సిబ్బంది, శిక్షణ వ్యవహారాల శాఖ (డీఓపీటీ)పై ఆ భారం మోపి సహ చట్ట స్ఫూర్తిని గంగలో కలిపింది. ఇక, మొదట్నుంచీ సీఐసీపై ఆధిపత్యం కోసం పాకులాడుతున్న డీఓపీటీ... ముఖ్య కమిషనర్ లేని పరిస్థితిని అవకాశంగా తీసుకొని కమి షన్‌ను బలహీనపరిచే చర్యల్ని ముమ్మరం చేస్తోంది.



 దూడలు గట్టున మేస్తాయా...?

 వివిద వ్యవస్థలకు మార్గదర్శకంగా ఉండాల్సిన రాజకీయ వ్యవస్థ సహ చట్టం అమలు విషయమై తప్పుడు సంకేతాలిస్తోంది. సీఐసీ తీర్పును లక్ష్యపెట్టక ప్రధాన రాజకీయ పక్షాలు చట్టవ్యతిరేకంగా వ్యవహరిస్తున్న తీరు అధికార గణానికి, కార్యనిర్వాహక వ్యవస్థకు తప్పుడు సంకేతమిస్తోంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి ప్రత్యక్షంగా, పరోక్షంగా నిధులను పొందుతున్న స్వచ్ఛం ద సంస్థలు కూడా ఆర్టీఐ పరిధిలోకొస్తాయని ఈ చట్టం చెబుతోంది. కాంగ్రెస్, బీజేపీ, సీపీఐ, సీపీఎం, బీఎస్పీ, ఎన్సీపీలు అలాంటి పౌర సంస్థలేనని, ఈ చట్టం కింద పౌరులడిగే సమాచారం ఇచ్చి తీరాల్సిందేనని సీఐసీ 2013 జూన్ లోనే ఖరాకండిగా ఆదేశించినా అవి ఖాతరు చేయడం లేదు. పోనీ, దీన్ని సవాల్ చేస్తూ న్యాయస్థానాన్నయినా ఆశ్రయించాయా? అంటే అదీ లేదు. పార్టీలు అనుసరిస్తున్న ఈ మొండివైఖరి ప్రజాస్వామ్యవ్యవస్థ ఉనికికే సవా లు. రాజకీయ పక్షాల్ని ఆర్టీఐ పరిధి నుంచి బయటకు తెచ్చేలా చట్టసవరణకు యూపీయే ప్రభుత్వపు చివరి రోజుల్లో ఒక బిల్లును ప్రతిపాదించారు. అన్ని పార్టీలు ఈ విషయంలో ఏకమై పార్లమెంటు స్టాండింగ్ కమిటీలో ముసాయి దా బిల్లుకు ఏకపక్షంగా మద్దతు తెలిపాయి! ఆ బిల్లు ఆమోదం పొందకుం డానే 2015 మే నెలలో లోక్‌సభ రద్దయింది. నేటి ఎన్డీఏ ప్రభుత్వం కూడా అదే దోరణితో వ్యవరిస్తోంది. ఇటీవల రాజ్యసభలో అడిగిన ఓ ప్రశ్నకు సమా ధానమిస్తూ, ‘పార్టీలను ఆర్టీఐ కింద పౌరసంస్థలుగా ప్రకటిస్తే వాటి పని తీరునకది భంగం కలిగిస్తుంది, ప్రత్యర్థులు వారి సమాచారాన్ని దుర్వినియో గం చేసే ప్రమాదముంది’ అని చట్ట వ్యతిరేక ప్రకటన చేసింది. గోద్రా అల్లర్ల తర్వాత నాటి గుజరాత్ ముఖ్యమంత్రి మోదీ, ప్రధాని వాజ్‌పేయ్ మధ్య ఉత్తరప్రత్యుత్తరాల ప్రతులు కావాలన్న దరఖాస్తుదారునికి అధికారులు మొండిచేయి చూపారు.



 కన్నతల్లే దయ్యమైతే...!

 చట్టాన్ని అమలు చేయాల్సిన కేంద్రమే ఆర్టీఐ అమలును తూట్లు పొడిచే చర్యలకు పూనుకుంటోంది. ‘కన్నతల్లే దయ్యమైతే...పసికందుకు తొట్టెల కట్టే చోటేది’ అన్నట్టుంది పరిస్థితి. గత ఆగస్టు నుంచి సీఐసీ పదవి ఖాళీగా ఉంది. కీలకమైన అప్పీళ్లు పరిష్కారానికి నోచకుండా పడి ఉన్నాయి. పీఎం కార్యా లయం, విజిలెన్స్ కమిషన్, కాగ్, సుప్రీంకోర్టు, హోమ్ సహా 34 ప్రధాన శాఖల ఆర్టీఐ అప్పీళ్లను కేంద్ర సమాచార కమిషనర్ లేనిదే సీఐసీలో విచారించడానికి లేదు. అంటే, ఆయా శాఖలు సమాచారాన్ని ఏకపక్షంగా తిరస్కరించినా దిక్కు లేదు. ఇందులో ఇంకో సాంకేతికాంశం కూడా ఉంది. అసలు సీఐసీ లేకుండా అటు కేంద్ర సమాచార కమిషన్ గానీ, ఇటు రాష్ట్రాల కమిషన్లు (ఎస్‌ఐసీ) గానీ పనిచేయడానికి లేదు. కమిషన్ పూర్తిస్థాయి నిర్వ హణను ఇతర కమిషనర్ల సహకారంతో ముఖ్య సమాచార కమిషనర్ మాత్ర మే చేపట్టాలని సెక్షన్ 12 (4) చెబుతోంది. లోగడ ఇలాగే కమిషనర్ లేని పరిస్థితే గుజరాత్‌లో తలెత్తితే, వెంటనే ముఖ్య సమాచార కమిషనర్‌ను నియమించాలని అహ్మదాబాద్ హైకోర్టు ఆదేశించింది. కేంద్ర కమిషన్‌లో సీఐసీ నియామకానికి ఎంపిక కమిటీని ప్రధాని మోదీ డిసెంబర్ 13న నియ మించారు. ప్రధానితోపాటు కేంద్ర మంత్రి అరుణ్‌జైట్లీ, విపక్ష నేత మల్లి కార్జున్ ఖర్గేలతో కూడిన ఈ త్రిసభ్య సంఘం రెండుసార్లు భేటీ అయినా నియామక ప్రక్రియ అంగుళం ముందుకు జరగలేదు. చట్టం సక్రమంగా అమలైతే పారదర్శకతపరంగా తమ ప్రభుత్వంపై ఒత్తిడి పెరుగుతుందనే భయం వల్లనే కేంద్రం దీన్ని నిర్వీర్యం చేయడానికి పూనుకుంది. మొత్తంగా ఆర్టీఐపై కేంద్రం వైఖరి ఎన్డీఏ ప్రభుత్వానికి తలవంపులు తెచ్చేలా ఉంది.



 అధికారులు ఆడిందే ఆట......

 పాలకుల వైఖరిని బట్టే కేంద్ర అధికారులు నడుస్తుంటారు. ఆర్టీఐ విషయంలో ప్రభుత్వధోరణిని చూసే కేంద్ర ప్రభుత్వ శాఖలు ఇష్టారాజ్యంగా సమాచా రాన్ని నిరాకరిస్తున్నాయి. పద్మ అవార్డులపై నిర్దిష్టంగా అడిగిన సమాచారాన్ని గృహమంత్రిత్వ శాఖ ఏకపక్షంగా నిరాకరించింది. ఆ దరఖాస్తు అప్పీలును విచారించాలంటే సీఐసీ ఉండాలి. కాబట్టి ఇప్పట్లో అది విచారణకు రాదు. ఇదే పరిస్థితి చాలా శాఖల్లో నెలకొని ఉంది. గత పదేళ్లుగా కొందరు చిత్తశుద్దిగల కమిషనర్లు, మరీ ముఖ్యంగా ఆర్టీఐ కార్యకర్తలు, ప్రసారమాధ్యమాలు చూపిన చొరవతో సహ చట్టంపై ప్రజల్లో అవగాహన పెరుగుతూ వచ్చింది. దరఖాస్తుల సంఖ్యా పెరిగింది. బడుగు బలహీనవర్గాలు, అల్ప, మధ్యా దాయవర్గాల వారు ప్రధానంగా సంక్షేమ పథకాలు, కార్యక్రమాల కింద తమ కు దక్కాల్సిన ప్రయోజనాలకు సంబంధించే ఎక్కువగా దరఖాస్తులు చేస్తున్న ట్టు తేలింది. దశాబ్దాల నుంచి సహ చట్టం అమల్లోవున్న అమెరికాలో గత ఏడాది 35 లక్షల ఆర్టీఐ దరఖాస్తులు వస్తే, భారతదేశంలో 45 లక్షల దర ఖాస్తులు వచ్చాయి! ఇలాంటి కీలక సమయంలోనే ఆ చట్టాన్ని  నీరుగార్చే ప్రయత్నాలు ముమ్మరమయ్యాయి. పాలకులలాగే కేంద్ర ప్రభుత్వ సిబ్బంది- శిక్షణ వ్యవహారాలశాఖ (డీఓపీటీ) సైతం సీఐసీని మరింతగా నిర్వీర్యం చేసేందుకు పావులు కదుపుతోంది. ప్రధాని ప్రత్యక్ష పర్యవేక్షణలోని  ఈ శాఖే కేంద్ర సమాచార కమిషన్‌కు సదుపాయాలు కల్పించే సౌజన్య విభాగం. మొదట్నుంచీ డీఓపీటీకి, సీఐసీకి పడటం లేదు. సీఐసీ మొదటి ముఖ్య సమాచార కమి షనర్ వజహత్ హబీబుల్లా ఆదేశాల్ని అది సుదీర్ఘంగా అమలు చేయక, సంఘర్షణాత్మక ధోరణితో పనిచేసింది. ఫైల్ నోటింగ్స్ కూడా పౌరులకివ్వాల్సిన సమాచారంలో భాగమేనని సీఐసీ ఇచ్చిన ఆదేశా లకు విరుద్ధంగా వెబ్‌సైట్లో సమాచారం పెట్టి లక్షలాదిగా పౌర సమాచార అధి కారుల్ని తప్పుదోవ పట్టించింది. ముఖ్య కమిషనర్ నేతృత్వంలో కమిషన్ నిర్వహించాల్సిన బాధ్యతల్ని, ఆర్థికాధికారాల్ని క్రమంగా తాము నియమించే కమిషన్ కార్యదర్శి అయిన ఐఏఎస్ అధికారికి బదిలీ చేయడానికి చూస్తోందనే విమర్శలున్నాయి. ఈ విమర్శకు బలమిచ్చేదిగా...ఈ నెల 11న డీఓపీటీ, సీఐసీ ఆర్థి కాధికారాలన్నిటీనీ కార్యదర్శికి బదలీచేస్తూ వివాదస్పద ఉత్తర్వులు ఇచ్చింది. కమిషన్ స్వతంత్ర ప్రతిపత్తికే ఇది గొడ్డలిపెట్టు.



 చేతులెత్తేసే కమిషన్లు శవపేటికపై చివరి మేకులు!

 మేమిచ్చిన ఆదేశాల్ని మేమే అమలుపరచలేకపోతున్నామని చేతులెత్తేయడం ఇటీవలి కాలంలో కమిషనర్లకు రివాజయింది. ఇది ఆర్టీఐ కార్యకర్తల కృషిని, సామాన్యపౌరుల ఆశలను నీరుగారుస్తోంది. ఏపీ సమాచార కమిషన్ కూడా ఈ వార్షిక సదస్సులో ఇలాగే తన అశక్తతను వ్యక్తం చేసింది తమ ఆదేశాల్ని ప్రభుత్వం అమలుపరచాలని, లేకపోతే తాము చేయగలిగేదేమీ లేదని పేర్కొంది. రాజకీయ పార్టీలను పబ్లిక్ అథారిటీలుగా స్పష్టం చేస్తూ సీఐసీ ఇచ్చిన ఉత్తర్వుల్ని ఆయా పార్టీలు ఖాతరు చేయకపోయినా సీఐసీ ఏం చేయలేకపోయింది. ఇదే కేసులో ఈ నెల 16న తుది తీర్పు వెలువరిస్తూ, కమిషన్ ఆదేశించినా రాజకీయ పార్టీలు ఉత్తర్వుల్ని అమలుపరచలేదని, ఈ విషయంలో ఇంతకు మించి  తామేమీ చేయజాలమని ముగ్గురు కమిషనర్లతో కూడిన ధర్మాసనం పేర్కొంది. పార్టీలు ఉత్తర్వుల్ని అమలు పరచలేదు, సవాల్ చేస్తూ న్యాయస్థానానికి వెళ్లలేదు, చట్టసవరణ కూడా జరగలేదు... కనుక తమ ఉత్తర్వులకు కాలదోషం పట్టలేదని మాత్రం పేర్కొంది.  సీఐసీ ఉత్తర్వులు అమలయ్యేలా చూసే వ్యవస్థ లేకపోవడం చట్టంలో ఉన్న లొసు గని, దాన్ని సరిదిద్దడానికి ప్రభుత్వం చర్యలు తీసుకునేలా చూడాలని డీఓపీటీని కోరుతున్నట్టుగా అది పేర్కొంది. నిజానికి కమిషన్ ఈ కేసు పరిష్కారంలో చట్టప్రకారం వ్యవహరించలేదనే అభిప్రాయం వ్యక్తమౌతోంది. రాజకీయ పార్టీలను పబ్లిక్ అథారిటీలుగా ఆదేశాలిచ్చినపుడు, ఆయా పార్టీ లకు తానే పీఐవోలనూ నియమించే అధికారం ఆర్టీఐ సెక్షన్ 19 (8) ఎ (జీ) (జీజీ) ప్రకారం కమిషన్‌కు ఉంది. ఈ నిబంధనను వినియోగించుకొని ఆయా పార్టీల కార్యనిర్వాహక బృందంలో ఎవరినైనా పీఐవోలుగా ప్రకటించి జరిమానా విధించి ఉండాల్సిందని అలాంటి వారి వాదన. అంటే సీఐసీ కూడా సహ చట్టం స్ఫూర్తికి విరుద్ధంగా వ్యవహరించినట్టయింది. ఇలా... రాజకీయ పక్షాలు, కేంద్ర ప్రభుత్వం, అధికార వ్యవస్థ, కమిషన్లు ఎవరి వంతుకు వారు ఆర్టీఐని నీరుగారుస్తుండటంతో సహజంగానే ఆర్టీఐ కార్య కర్తలు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. పౌర సమాజం మరింత చైతన్యమై, సంఘటిత పోరాటం ద్వారానే ఈ చట్టాన్ని కాపాడుకోవాలి.


దిలీప్ రెడ్డి

ఎగ్జిక్యూటీవ్ ఎడిటర్


 

ఈమెయిల్: dileepreddy@sakshi.com    

Read latest Features News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top